కొత్త పాలసీ.. పాత పద్ధతి! | The new policy, the old method .. ! | Sakshi
Sakshi News home page

కొత్త పాలసీ.. పాత పద్ధతి!

Published Mon, May 4 2015 3:09 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

కొత్త పాలసీ.. పాత పద్ధతి!

కొత్త పాలసీ.. పాత పద్ధతి!

జూలై నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ విధానం
స్వల్ప మార్పులతో పాత పద్ధతిలోనే మద్యం అమ్మకాలు
ఇతర రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీపై అధికారులతో అధ్యయనం
అధికారులతో సమాలోచనలు జరిపిన కమిషనర్ చంద్రవదన్

 
హైదరాబాద్: రాష్ర్టంలో మద్యం అమ్మకాలు స్వల్ప మార్పులతో పాత పద్ధతిలోనే సాగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీలో ఉన్న కొన్ని లోటుపాట్లను సవరించి, ఆదాయాన్ని మరింతగా పెంచుకునేలా కొత్తపాలసీని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్సైజ్ శాఖ 2013-14 ఆర్థిక సంవత్సరం కన్నా 2014-15లో పదిశాతం మేర అదనపు రెవెన్యూ సాధించి రూ. 10,230 కోట్లు ఖజానాకు జమ చేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయాన్ని 20 శాతం మేర పెంచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.


ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సంవత్సరం జూన్30తో ముగుస్తుండగా, జూలై 1 నుంచి కొత్త మద్యం విధానం అమలు చేయాల్సి ఉంది. తమిళనాడు తరహాలో రిటైల్(వైన్స్) వ్యాపారాన్ని ఎక్సైజ్‌శాఖ ద్వారా నిర్వహించాలని ఏపీ  నిర్ణయించి న నేపథ్యంలో తెలంగాణలో మద్యం విధానం ఎలా ఉండాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచనలు చేసింది. ఈ నేపథ్యంలో చండీగఢ్, హరియాణా, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలకు వెళ్లిన అధికారులు అక్కడ అమలవుతున్న మద్యం విధానంపై అధ్యయనం చేసి నివేదికను అందజేశారు.


ఆయా రాష్ట్రాల్లో రిటైల్ వైన్‌షాపుల నిర్వహణ, లెసైన్స్ ఫీజు, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ బై ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంటు తీరు, సారా, చీప్ లిక్కర్ పరిస్థితితో పాటు వస్తున్న రెవెన్యూ, ఆదాయపు పన్ను చెల్లింపు తదితర అంశాలను నివేదికలో పొందుపరిచారు. ఇటీవలే రాష్ట్రంలోని 10 జిల్లాలకు చెందిన అధికారులు, టీఎస్‌బీసీఎల్ అధికారులతో సమావేశమైన కమిషనర్ చంద్రవదన్ కొత్త మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై చర్చించి, ప్రభుత్వానికి నివేదిక పంపించారు.

సొంతంగా రిటైల్ వ్యాపారం... తక్కువ ధర మద్యంతో నష్టం: తమిళనాడులో ప్రభుత్వమే మద్యం రిటైల్ వ్యాపారం నిర్వహిస్తున్నా, మూడు విభాగాల ద్వారా అది సాగుతుంది.  ఏపీ ప్రభుత్వం ఇదే విధానాన్ని అవలంబించాలని భావించినా... అక్కడ కూడా జూలై నుంచి అమ్మకాలు సాధ్యం కాదని భావిస్తున్నారు. అలాగే తెలంగాణలోనూ సాధ్యం కాదని, ప్రభుత్వానికి నష్టమని అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది.


ఇక తక్కువ ధరలో మద్యం (చీపెస్ట్ లిక్కర్) అమ్మకాల వల్ల రిటైల్ మద్యం దుకాణాల్లో రెవెన్యూ పడిపోతుందని ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు తేల్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో లెసైన్స్ ఫీజుల్లో మార్పులు, ప్రివిలేజ్ ఫీజు తొలగింపు వంటి అందరికీ ఆమోదమైన స్వల్ప మార్పులతో ఇప్పుడున్న మద్యం విధానాన్నే కొనసాగించాలని అధికారులు సూచించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement