
సాక్షి, అమరావతి: చెప్పిన మాట ప్రకారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పెన్షన్‌ను సోమవారం నుంచి రూ.2,250కు పెంచుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం పింఛన్‌దారులకు లేఖ రాశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ లేఖ ప్రతులను పింఛన్‌దారులకు అందజేయనున్నారు. పెంచిన పింఛన్‌ను అర్హులందరికీ అందజేస్తామని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. లేఖలోని వివరాలు...
ప్రియమైన అవ్వాతాతలకు, అక్కాచెల్లెళ్లకు, దివ్యాంగ సోదర సోదరీమణులకు..
మీ కష్టాలు చూశాను. మీ బాధలు విన్నాను. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నా. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని చెప్పిన మాట ప్రకారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు(సోమవారం) నుంచి మీ పెన్షన్‌ను రూ.2,250కు పెంచుతున్నాం. పెంచిన పెన్షన్లను వైఎస్సార్ పెన్షన్ కానుక కింద అందిస్తున్నాం. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధి బాధితులకు ఈ పెంపు వర్తిస్తుంది. నాలుగు నెలల క్రితం వరకు రూ.1,000 మాత్రమే అందిన పెన్షన్‌ను రూ.3,000 వరకు పెంచుకుంటూ పోతాం. దివ్యాంగులకు నెలకు రూ.3,000 చొప్పున పంపిణీ చేస్తున్నాం. కిడ్నీ బాధితులకు పెన్షన్ మొత్తాన్ని నెలకు రూ.10,000కు పెంచాం.
ఈ సందర్భంగా అవ్వాతాతలకు, అక్కా చెల్లెళ్లకు, దివ్యాంగ సోదర సోదరీమణులందరికీ హామీ ఇస్తున్నా. ఇకపై మీకు జన్మభూమి కమిటీల వేధింపులు ఉండవు. పెన్షన్ మంజూరుకు గానీ, పెన్షన్ ప్రతినెలా ఇచ్చేటప్పుడు గానీ గతంలో మాదిరిగా లంచాల బాధ ఉండదు. మీ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చి మీ చేతికే అందుతుంది. అంతేకాదు పెన్షన్ పొందే వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాం. పెన్షన్ల మంజూరు విషయంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, మీరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారని కూడా చూడం. పెంచిన పెన్షన్‌ను అర్హులందరికీ ఇస్తాం. ఈ పెన్షన్‌ను రూ.3,000
వరకూ తీసుకుపోతాం.’’