పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కొత్త విధానంలో నిర్వహించాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి విరమించుకున్నట్టు సమాచారం.
హైదరాబాద్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కొత్త విధానంలో నిర్వహించాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి విరమించుకున్నట్టు సమాచారం. టెన్త్ పరీక్షలకు ఇప్పటి వరకూ 11 పేపర్లు ఉండగా.. ఈ ఏడాది నుంచి ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని, ప్రతి సబ్జెక్టులో 20% మార్కులకు అంతర్గత మూల్యాం కనం, 80% మార్కులకు రాతపరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం మొదట భావించింది. ఇందుకనుగుణంగా ఇప్పటికే ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది.
అయితే విద్యారంగంలో పలువురు నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందిన విజ్ఞప్తుల కారణంగా కొత్త విధానాన్ని ఏడాది పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త విధానాన్ని ఈ ఏడాది 9వ తరగతి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అమలు జరిపి.. వచ్చే సంవత్సరం నుంచి 10వ తరగతి పరీక్షలను కొత్త పద్ధతిలో నిర్వహించాలని భావిస్తోంది.