కోదాడటౌన్ : మార్చి నెలలో నిర్వహించాల్సిన పదవ తరగతి పరీక్షలు ఈ సంవత్సరం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను, జిల్లా అధికారులను ఇప్పటి నుంచే టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. కొత్త సిలబస్‌తో పాటు మారిన పరీక్ష విధానంలో మొదటిసారిగా జరగనున్న ఈ పరీక్షలు, తదనంతరం పరీ క్షా ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయోననే ఆందోళన ఇప్పుటి నుంచే మొదలైంది. డిసెంబర్ నాటికే సిలబస్ పూర్తి చేసి జనవరి నెల నుంచి పునశ్చరణ తరగతులు నిర్వహిం చాల్సి ఉండగా ఇప్పటి వరకు 70 నుంచి 80 శాతం సిలబస్ మాత్రమే పూర్తి కావొచ్చిందని, మిగిలిన సిలబస్ పూర్తి చేయడానికి మరో నెల రోజులకు పైగా పడుతుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. జనవరి చివరి వరకైనా సిలబ స్‌ను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తుం ది. మార్చి25 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ జారీ కావడంతో విద్యార్ధులను నూతన విధానంలో పరీక్షకు సిద్ధం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
చిక్కులు తెచ్చిన నూతన విధానం
ఈ విద్యాసంవత్సరం నుంచి 10వ తరగతి పరీక్షలను నూతన విధానంలో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ప్రశ్న, జ వాబులను బట్టీ పడుతున్నారని దీనిని సమూలంగా మా ర్చాలని భావించిన విద్యావేత్తలు ఈ సంవత్సరం నుంచి నిరంతరం సమగ్ర మూల్యాంకన పద్ధతి(సీసీఎల్) ని అమ లు చేస్తున్నారు. దీని ప్రకారం వివిధ సబ్జెక్టులలో పాఠ్యాం శాల వెనుక ఉన్న ప్రశ్నలు కాకుండా పాఠ్యాంశములోని ఎ క్కడి నుంచైనా ప్రశ్నలు అడగవచ్చు. దీనికి విద్యార్థి ము ఖ్యాంశాలనే గాక పాఠం మొత్తం చదవాల్సి ఉంటుంది. గ తంలో ముఖ్యమైన పాఠ్యాంశాలను విద్యార్థులచే బట్టీ ప ట్టించి ఎలాగోలా గట్టెక్కించేవారు. కాని ఈ సారి ఉపాధ్యాయులకు కూడా పరీక్ష రోజు వరకు ప్రశ్న ఎలా ఉంటుంది? ఎక్కడ నుంచి అడుగుతారు? దాని సమాధానం ఏమిటి? అన్నది తెలియదు. దీంతో విద్యార్థులకు, ఆయా పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులకు టెన్షన్ పట్టుకుంది. ఈ సారి 80 మార్కులకు మాత్రమే ఫైనల్ పరీక్ష నిర్వహిస్తున్నారు. మిగిలిన 20 మార్కులను విద్యార్థి తరగతిలో ప్రదర్శించిన వివిధ నైపుణ్యాలను పరిశీలించి ఇంటర్నల్ మార్కులుగా ఇవ్వాలి. వీటిని పబ్లిక్ పరీక్షలో సాధించిన మార్కులతో కలిపి ఫైనల్ గ్రేడ్ నిర్ణయిస్తారు.
చివరిలో మొక్కుబడిగా శిక్షణ..!!
మారిన సిలబస్, కొత్త పరీక్షా విధానంపై ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఈ విషయంలో తాత్సారం చేశారు. జూన్‌లో పాఠశాలలు మొదలు కాగా డిసెంబర్ నెలలో కొత్త విధానంపై ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. అప్పటికే సమ యం మించిపోయింది. ఇక పదవ తరగతి పరీక్షలు రాస్తున్న వారిలో 60 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. వారికి బోధించే ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలలు ఇప్పటికీ పాత పద్ధతిలోనే విద్యార్థులకు బోధన చేస్తూ విద్యార్థు చేత గైడ్లు, టెస్టు పేపర్లు చదివిస్తున్నారు.
వెనుబడిన విద్యార్థులను గుర్తించే సమయం ఏది?
సంవత్సరం చివరలో పరీక్షలు పెట్టి ఇబ్బంది పెట్టకుండా నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా ప్రారంభం నుంచే విద్యార్థిని పరీక్షించి తద్వార వెనుక బడిన అంశాలలో వారిని మెరుగు పర్చాల్సి ఉంది. కాని కొత్త విధానంపై ఉపాధ్యాయులకే సరైన అవగాహన కల్పించకపోవడంతో ఇప్పటి వరకు వెనుక బడిన విద్యార్థులను గుర్తించే అవకాశం రాలేదు. సోమవారం నుంచి అర్ధ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తరువాత సంక్రాంతి సెలవులు. తిరిగి పాఠశాలలకు వచ్చే సరికి జనవరి నెల పూర్తవుతుంది. ఇక వారిలో వెనుక బడిన విద్యార్థులను గుర్తించడం, వారికి తిరిగి శిక్షణ ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. వెనుక బడిన విద్యార్థులను గుర్తించడానికి ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఒక సబ్జెక్టును బోధించాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఎక్కడ ఇవి అమలు కావడం లేదు. దీంతో వెనుకబడిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ఆందోళన అవసరం లేదు : విశ్వనాథరావు, డీఈఓ
బట్టీ విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థులను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి నూతన విధానం ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. జనవరి చివరి వరకు సిలబస్ పూర్తి చేస్తాం. ప్రధానోపాధ్యాయులు కూడా పాఠాలు బోధించాలని ఆదేశాలు ఇచ్చాం. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమిలేదు.
కొత్త విధానంతో కోటి తిప్పలు
Published Tue, Jan 6 2015 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM
Advertisement
Advertisement