
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కొత్త పాలసీ: మంత్రి రావెల
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కొత్త పారిశ్రామిక విధానం అమలులోకి తేస్తున్నట్టు మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. బ్యాంకులు రుణాలివ్వడానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే పూచీకత్తుగా నిలిచేలా కొత్త పాలసీని తయారు చేశామని ఆయన అన్నారు. మార్జిన్ మనీ స్కీం కింద ఎస్టీలకు రూ. 200 కోట్లు, ఎస్సీలకు 100 కోట్లు కేటాయించామని చెప్పారు.
క్రెడిట్ గ్యారంటీ స్కీం కింద ఎస్టీలకు రూ. 100 కోట్లు, ఎస్సీలకు రూ. 50 కోట్లు కేటాయించామని రావెల తెలిపారు. ఇప్పటివరకు సేవారంగంలోనే అధికంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు తయారీ రంగంలో ప్రోత్సహించేందుకు కొత్త పాలసీ దోహదపడుతుందని మంత్రి రావెల ఆశాభావం వ్యక్తం చేశారు.