ఇష్టారాజ్యానికి ఓ ‘నల్ల’ చట్టం! | Autonomy to the State Economic Development Council | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యానికి ఓ ‘నల్ల’ చట్టం!

Published Sat, Mar 3 2018 1:18 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

Autonomy to the State Economic Development Council - Sakshi

సాక్షి, అమరావతి: మేము తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానాలు ప్రశ్నించరాదంటూ ఏకంగా చట్టాన్నే తీసుకొచ్చే సాహసాన్ని భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా చేశారా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వం మాత్రం దీనికి అతీతులట! తన నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదంటూ చంద్రబాబు ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఈ మేరకు ముసాయిదా బిల్లుకు ఇటీవల కేబినెట్‌ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. ఇది చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తే.. ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వారికి ఇష్టారాజ్యంగా భూములు, రాయితీలు కేటాయించుకోవచ్చు. పరోక్షంగా ప్రయోజనం పొందొచ్చు. ఇదేం అన్యాయం అని అడగడానికి, న్యాయం కోసం కోర్టుకు వెళ్లడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. 

ఆ పిటిషన్లను కోర్టులు అనుమతించొద్దు 
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు సింగపూర్‌ తరహాలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తూ 2016 మార్చి 17న ప్రభుత్వం జీవో 87ను జారీ చేసింది. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు. ఆర్థికాభివృద్ధి మండలికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ముసాయిదా బిల్లును రూపొందించి ఫిబ్రవరి 21న మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించి చట్టరూపం కల్పిస్తారు. గతంలో జీవో ద్వారా ఏర్పాటైన సీఎస్‌ నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీని, సీఎం నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిని కూడా ఈ ఆర్థికాభివృద్ధి మండలి పరిధిలోకి తీసుకొస్తూ వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించారు.

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించే ముసాయిదా బిల్లులోని పలు అంశాలు బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయని, పలు శాఖలు చేయాల్సిన పనులపై గుత్తాధిపత్యం సాధించే అంశాలున్నాయని ఆర్థిక శాఖ, న్యాయ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినా సరే అభ్యంతరాలను తోసిపు చ్చుతూ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి తీసుకునే నిర్ణయాలను కోర్టుల్లో సవాల్‌ చేయడానికి వీల్లేదని, ఎలాంటి ప్రాసిక్యూషన్స్‌కు అవకాశం ఉండదని బిల్లులో స్పష్టం చేశారు. మండలి తీసుకునే నిర్ణయాలతోపాటు అందులో పనిచేసే సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, కన్సల్టెన్సీలపైనా ఏ న్యాయస్థానం లోనూ కేసులు వేయడానికి వీల్లేదని పేర్కొ న్నారు. ఆర్థికాభివృద్ధి మండలి మంచి ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకుంటుందని భావించాలని, ఈ నిర్ణయాలను తప్పుపట్టే పిటిషన్లను ఏ న్యాయస్థానాలు కూడా అనుమతించరాదని తేల్చిచెప్పారు. 

ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలట!
భారీ ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడులను రాబట్టేందుకు ఆర్థికాభి వృద్ధి మండలి దేశ విదేశాల్లో పర్యటించనుంది. నిబంధనల మేరకు విదేశీ పర్యటనల చార్జీలను, టీఏ, డీఏలను ఇస్తే చాలదని, పెద్ద ఎత్తున నిధులు అవసర మని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాలని కూడా స్పష్టం చేశారు. అయితే, నిబంధనల మేరకు వర్తించే టీఏ, డీఏలు మాత్రమే వర్తిస్తాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 

సొంత ప్రయోజనాల కోసమే... 
రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి నిర్ణయాలను కోర్టుల పరిధి నుంచి తప్పిస్తూ ముసాయిదా బిల్లును రూపొందించడం వెనుక లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే. ప్రభుత్వ పెద్దలు ఆర్థికాభివృద్ధి మండలి ముసుగులో మరింత ప్రయోజనం పొందడానికి వ్యూహం రచించారు. అస్మదీయులకు భూములు, రాయితీల కేటాయింపుపై ఎవరైనా కోర్టులను ఆశ్రయిస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన సీఎం వ్యూహత్మకంగా పావులు కదిపారు. అందుకే ఆర్థికాభివృద్ధి మండలి నిర్ణయాలను న్యాయస్థానాలు ప్రశ్నించేందుకు వీల్లేదంటూ ముసాయిదా బిల్లులో ప్రతిపాదనలు చేర్చినట్లు అధికార వర్గాల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement