ఈ పాపం బాబు సర్కారుదే  | Eenadu Fake News On Andhra Pradesh Govt Debts | Sakshi
Sakshi News home page

ఈ పాపం బాబు సర్కారుదే 

Published Mon, Feb 14 2022 3:49 AM | Last Updated on Mon, Feb 14 2022 2:40 PM

Eenadu Fake News On Andhra Pradesh Govt Debts - Sakshi

సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒడిదుడుకులకు గత చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకమే కారణం. మూడు సంవత్సరాల పాటు పరిమితులకు మించి.. వచ్చే ప్రభుత్వంలో చేయాల్సిన అప్పులను కూడా అదనంగా చేసి, చేటు చేసింది. రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాల్సిన 39 వేల కోట్ల రూపాయల బిల్లులను చెల్లించకుండా బకాయిలు పెట్టి వెళ్లింది. దీనికి తోడు బడ్జెట్‌ బయట ఏకంగా 58 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి దిగిపోయింది. ఒక పక్క ఆర్థిక మందగమనం, రెండేళ్లుగా కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఇటు రాష్ట్ర, అటు కేంద్ర రాబడులు తగ్గిపోయాయి. అయినా కేంద్రం విధించిన పరిమితుల మేరకు వ్యవహరిస్తూ ఏ పథకాన్ని నిలుపుదల చేయకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ వస్తోంది.

ఈ వాస్తవాలను మరచి అప్పులు ఎక్కువ చేశారని చంద్రబాబు మాట్లాడుతుండటం చూస్తుంటే.. దొంగే దొంగ దొంగ.. అని అరవడంలా ఉందని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా మూడు ఆర్థిక సంవత్సరాలు కేంద్రం అనుమతించిన దానికి మించి అదనంగా అప్పులు చేయడమే కాకుండా, తర్వాత ఆర్థిక సంవత్సరాల్లో అదనంగా చేసిన అప్పులను మినహాయించుకోవాలని కేంద్రానికి తెలిపారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అప్పుల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తోంది. ఈ వాస్తవాలను కప్పిపుచ్చుతూ ‘ఈనాడు’ రాతలు విడ్డూరంగా ఉన్నాయని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు అదనంగా అప్పులు చేయడంతో పాటు తర్వాత సంవత్సరాల్లోని అప్పుల్లో ఆ మేరకు కోతలు విధించాలని చెప్పడంతోనే ఇప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి మేరకు కేంద్రం అనుమతించిన అప్పులకు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

అప్పడు అదనపు అప్పులు కనిపించలేదా?
‘గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణనలోకి తీసుకోవడం వల్లే ఈ ఆర్థిక సంవత్సరం అప్పుల్లో కోత విధించిన విషయం ‘ఈనాడు’కు కనిపించడం లేదా? కనీసం ఆ విషయాన్ని ప్రస్తావించకుండా అప్పు పుట్టేదెలా అంటూ ఎలా రాస్తారు?’ అని ఆర్థికశాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గత చంద్రబాబు ప్రభుత్వం మూడు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి అనుమతించిన అప్పుల కన్నా అధికంగా రూ.16,418.99 కోట్ల అప్పులు చేసింది. పర్యవసానంగా ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  

మరో పక్క గత ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా పెద్ద ఎత్తున అప్పులు చేసి వెళ్లి పోవడంతో ఇప్పుడు ఆ అప్పులను తీర్చడంతో పాటు పెండింగ్‌ పెట్టిన బిల్లులను సైతం చెల్లించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వంపై పడింది. దీనికి తోడు కోవిడ్‌తో ఆదాయం తగ్గడంతో రాష్ట్రం ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటోందని, వాస్తవాలు ఇలా ఉంటే ఇప్పటి ప్రభుత్వమే అత్యధికంగా అప్పులు చేసిందంటూ ఒక పక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు, మరో వైపు ఎల్లో మీడియా ప్రచారం చేయడం దిగజారుడు తనానికి నిదర్శనమని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గత చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్‌ శాఖ అప్పును రూ.31,647.64 కోట్ల నుంచి 2018–19 నాటికి ఏకంగా రూ.62,463 కోట్లకు పెంచేసింది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు విద్యుత్‌ ఉత్పత్తిదారులకు ఇవ్వాల్సిన బకాయిలు 2014–15లో రూ.4,817 కోట్లు ఉంటే 2018–19 నాటికి రూ.20,121.97 కోట్లకు పెంచేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement