సాక్షి, అమరావతి: అధికారం చివరి రోజుల్లో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో సీఎం చంద్రబాబు ఇష్టానుసారంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఓట్ల పథకాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమీషన్లు కాజేసేందుకు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో అత్యధిక వడ్డీలకు భారీ అప్పులు చేశారు. హద్దు లేకుండా అప్పుల మేళా కొనసాగిందని ఆర్థిక శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. గత ఏడాదంతా చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్‌లతోనే ప్రభుత్వం నెట్టుకొచ్చిందని పేర్కొంటున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వానికి అప్పులూ పుట్టని పరిస్థితిలోకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు దిగజార్చారని ప్రభుత్వ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అప్పుడూ బాబు ఇదే తీరు...
ఉమ్మడి రాష్ట్రంలో 2004 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు ఇదే తరహాలో ఖజానాను ఖాళీ చేసి భారీ రెవెన్యూ, ఆర్థిక లోటులోకి నెట్టేశారని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ నెల నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రకారం 3 శాతం మేర బడ్జెట్‌లో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.32,000 కోట్లు అప్పు చేసేందుకు అనుమతించాలని కేంద్ర ఆర్థికశాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే దీన్ని పరిగణనలోకి తీసుకోబోమని, తమ లెక్కల ప్రకారమే ఎంత మేర అప్పులను అనుమతించాలో నిర్ధారిస్తామని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. నాలుగు నెలలకు మాత్రమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించినందున ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.8,000 కోట్ల అప్పులకు అనుమతించింది.
ఎన్నికల ముందు భారీగా అప్పు
మరోవైపు కొత్త ఆర్థిక ఏడాదిలో సెక్యూరిటీల విక్రయం ద్వారా ఓపెన్ మార్కెట్‌లో భారీ అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అయింది. అయితే ఆర్బీఐ ఏప్రిల్ 2వ తేదీన సెక్యూరిటీల విక్రయాన్ని రద్దు చేసింది. అనంతరం 9వ తేదీన సెక్యూరిటీల విక్రయానికి అనుమతించింది. దీంతో రాష్ట్రంలో పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల విక్రయం ద్వారా ఓపెన్ మార్కెట్‌లో రూ.5,000 కోట్ల అప్పు చేసింది. 8.18 శాతం వడ్డీకి ఈ అప్పు తీసుకుంది. ఒక్క నెలలోనే రూ.5,000 కోట్ల అప్పు చేయడంతో ఇక మూడు నెలల్లో ఓపెన్ మార్కెట్ ద్వారా ఇక రూ.3,000 కోట్ల అప్పు చేసేందుకు మాత్రమే అనుమతి ఉంది.
ఓపెన్ మార్కెట్ రుణాలు కష్టమే!
14వ ఆర్థిక సంఘం కాలపరిమితి ఈ ఆర్థిక సంవత్సరంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతం లోపల అప్పులు చేశారా? అంతకు మించి అప్పులు చేశారా? అనే లెక్కలను కేంద్ర ఆర్థికశాఖ సేకరించనుంది. మూడు శాతానికి మించి అప్పులు చేస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకునే అప్పులో ఆ మేరకు కోత విధించనుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ఈ ఆర్థిక ఏడాదిలో ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పులు తెచ్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉండదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరిలో అదనంగా తీసుకున్న రూ.6 వేల కోట్ల అప్పులను ఈ ఆర్థిక ఏడాదిలో తగ్గించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు కచ్చితంగా అప్పులు పుట్టని స్థితిలోకి రాష్ట్రాన్ని గెంటేశారని స్పష్టమవుతోంది.
అధిక వడ్డీలకు అప్పులపై సీఎస్ ఆరా
ఇష్టానుసారంగా అధిక వడ్డీలకు అప్పులు తేవడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్పుబట్టారు. 8 శాతం లోపలే వడ్డీ ఉండాలని తొలుత జీవోలు జారీ చేసి ఆ తరువాత అంతకన్నా ఎక్కువ వడ్డీతో అప్పులకు ఎలా అనుమతించారని ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ప్రశ్నించారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ఏకంగా 9 శాతానికిపైగా వడ్డీలతో అప్పులు చేసేందుకు అనుమతివ్వడం, వాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంపైనా సీఎస్ ఆరా తీశారు. నియమ నిబంధనలను తాము ప్రభుత్వం దృష్టికి తెచ్చినా కేబినెట్ ద్వారా ఆమోదించుకోవడంతో ఏమి చేయలేకపోయామని ఆర్థికశాఖ అధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీన మరో వెయ్యి కోట్ల రూపాయల అప్పు చేయాలని ఆర్థిక శాఖ ప్రయత్నించినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందుకు అనుమతించలేదు.
Comments
Please login to add a commentAdd a comment