సీఎం, సీఎంవో కనుసన్నల్లో... | Financial transactions in the CM and CEO concepts | Sakshi
Sakshi News home page

సీఎం, సీఎంవో కనుసన్నల్లో ఆర్థిక శాఖ లావాదేవీలు

Published Sat, Mar 16 2019 5:33 AM | Last Updated on Sat, Mar 16 2019 7:42 AM

Financial transactions in the CM and CEO concepts - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా సీఎం చంద్రబాబు, ఆయన కార్యాలయ ఉన్నతాధికారులు పరోక్షంగా ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ తన వంతు తోడ్పాటు అందిస్తోంది. సీఎం, ఆయన కార్యాలయ ఉన్నతాధికారుల కనుసన్నల్లో నగదు లావాదేవీల్ని నిర్వహిస్తోంది. ఓట్లు రాల్చని బిల్లులన్నింటినీ పెండింగ్‌లో పెట్టేయాలని, కేవలం ఓట్లు రాల్చే పథకాలకోసం నిధులను అందుబాటులో ఉంచాలని స్వయంగా సీఎం ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ మేరకు రెగ్యులర్‌ బిల్లులను పెండింగ్‌లో పెట్టాలన్న ఆయన ఆదేశాల్ని ఆర్థిక శాఖ తూచా తప్పక పాటిస్తోంది.

ఇందులో భాగంగా వివిధ రకాలకు చెందిన రూ.25,600 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టేసింది. అదే సమయంలో సీఎంతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు సూచించిన వాటికే బిల్లులు చెల్లిస్తోంది. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఒకఉన్నతాధికారి ఈ బిల్లుల చెల్లింపు వ్యవహారంలో కమీషన్లు సైతం కాజేస్తున్నారని సచివాలయ వర్గాలు చెబుతుండడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఓట్లు రాల్చే పథకాలకు ఇచ్చేందుకు వీలుగా అప్పులు తీసుకోవాలని, ఎక్కువ వడ్డీకైనా వెనుకాడవద్దని సీఎం ఆదేశాలిచ్చారు. దీంతో ఆర్థికశాఖ ప్రభుత్వరంగ సంస్థలన్నింటికీ 9 శాతానికిపైగా అప్పులు తెచ్చుకోవడానికి అనుమతిస్తూ రహస్య జీవోను జారీ చేసింది.

అంతా పెండింగ్‌..
సీఎం ఆదేశాల నేపథ్యంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలను నెలల తరబడి చెల్లించకుండా ఆర్థికశాఖ పెండింగ్‌లో పెట్టేసింది. మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్రం విడుదల చేసిన నిధులను దారిమళ్లించేసింది. కేంద్రం తనవాటా కింద నిధులను విడుదల చేయగా.. వాటికి రాష్ట్ర వాటాను జమ చేసి ఆయ శాఖలకు విడుదల చేయాల్సిన రాష్ట్ర సర్కారు కేంద్రం వివిధ పథకాల కింద ఇచ్చిన రూ.మూడు వేల కోట్లను ఇతర వినియోగానికి మళ్లించింది. 

- ఇటీవల పెద్దఎత్తున వివిధ రంగాల ప్రాజెక్టులకు టెండర్లు ఖరారు చేశారు. అలా టెండర్లు ఖరారు చేసిన కాంట్రాక్టు సంస్థలకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇవ్వడానికి వీలుగా మిగతా రంగాలకు చెందిన బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టేశారు. కోటి రూపాయల బిల్లుకోసం మాజీ ఎమ్మెల్యే నెలరోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా బిల్లును పాస్‌ చేయకపోవడం దీనికి నిదర్శనం. మరోవైపు మున్సిపాలిటీల్లో రూ.50 లక్షల విలువగల చిన్న చిన్న పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకూ బిల్లులు నిలుపుదల చేశారు. ఆ కాంట్రాక్టర్లు సైతం సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండట్లేదు. 

గ్రంథాలయ సంస్థలకు చెందిన పీడీ ఖాతాల్లో నిధులను కూడా రాష్ట్రప్రభుత్వం లాగేసుకుంది. ఒక్కో జిల్లా గ్రంథాలయ సంస్థల పీడా ఖాతాల్లో ఉన్న రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు గల నిధులను వెనక్కు తీసేసుకుంది. దీంతో గ్రంథాలయ సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులు 1,000 మందికి వేతనాలు డిసెంబర్‌ నుంచి రావట్లేదు. అలాగే పదవీ విరమణ చేసిన 1,500 మందికి పెన్షన్‌ రావట్లేదు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు కోన దేవదాస్‌ మంగళవారం సచివాలయంలో ఆర్థికశాఖ కార్యదర్శిని కలసి వినతిపత్రం సమర్పించారు. మరోవైపు జిల్లా గ్రంథాలయ సంస్థల్లో పనిచేస్తున్న 283 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పెంచిన వేతనాల్ని 2016 నుంచి ఇవ్వకుండా నిలుపుదల చేశారు.  

ఎన్టీఆర్‌ వైద్యసేవలో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న 1,600 మందికి సైతం జనవరి నుంచి వేతనాలివ్వకుండా నిలుపుదల చేశారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మూడేసి నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. 

సంక్షేమ గురుకులాల్లో విద్యార్ధులకు శిక్షణ ఇచ్చే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. వారికి ఆరు నెలలనుంచి వేతనాల్ని నిలుపుదల చేశారు. ఇక విద్యాశాఖకు చెందిన ఆహార, రేషన్‌ బిల్లుల్నీ ప్రభుత్వం నిలిపేసింది. ఔట్‌సోర్సింగ్‌లో వివిధ ప్రభుత్వశాఖలకు వాహనాలను నడుపుతున్న స్వయం ఉపాధి వారికీ చెల్లింపులు ఆపేశారు.

సీఎం సహాయనిధి నుంచి పేదలు, మధ్యతరగతి రోగులకు వైద్యంకోసం మంజూరు చేసే నిధులనూ పెండింగ్‌లో పెట్టేశారు. దీంతో రోగులు అవస్థలు పడుతున్నారు. సీఎం లేదా ఆయన కార్యాలయ అధికారులు చెప్పే బిల్లులకే ఆర్థికశాఖ ఆమోదం తెలుపుతోంది. ఇలా చేయడం వల్ల అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ కేటాయింపులకు విలువ ఏముంటుందని, ఆయా రంగాలకు కేటాయించిన నిధులను ఇతర రంగాలకివ్వడం అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ను అపహాస్యం చేయడమేనంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

ఔట్‌సోర్సింగ్‌ వారికి తక్షణం వేతనాలివ్వాలి..
అసలే తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలివ్వకుండా రాష్ట్రప్రభుత్వం ఇతర అవసరాలకు నిధులివ్వడాన్ని ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల రాష్ట్ర సమాఖ్య తప్పుపట్టింది. సమాఖ్య ప్రతినిధులు వెంకటరామిరెడ్డి, అర్వాపాల్‌ మాట్లాడుతూ తక్షణం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా గ్రంథాలయాలకు చెందిన నిధుల్ని వారి ఖాతాల్లోంచి ప్రభుత్వం లాగేసుకోవడం దారుణమన్నారు. వారి ఖాతాలకు తిరిగి వారి నిధులను ప్రభుత్వం తక్షణం జమ చేయాలని డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement