సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో టీడీపీ పునరాలోచనలో పడింది. సమావేశాలకు హాజరైతేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడారనే కారణాన్ని చూపించి చంద్రబాబు గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. సీఎం అయితేనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. మీడియా సమావేశం పెట్టి బోరున విలపించి అందరిలోనూ నవ్వుల పాలయ్యారు. అప్పట్లో ఆయనతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలను బహిష్కరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత సమావేశాల్లో చంద్రబాబు చేసిన శపథం, హడావుడి నేపథ్యంలో ఈ సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే విషయంపై టీడీపీలో చర్చ జరుగుతోంది.
అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని తెగేసి చెప్పి నానా హడావుడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు, టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేక చేతులెత్తేయడం, ఏడవడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు తీరును తప్పు పట్టారు. దీంతో తాను అసెంబ్లీకి రానని, ఎమ్మెల్యేలు వెళ్లాలని చంద్రబాబు చెబుతున్నట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం గతంలో శపథం చేసిన కారణంగా వెళ్లకపోతేనే బాగుంటుందని చెబుతున్నారు.
ఏ మొఖం పెట్టుకుని వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి నిరసనలు తెలపాలని సూచిస్తున్నారు. కనీసం గవర్నర్ ప్రసంగం వరకైనా ఉండాలని, లేకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఉండి తర్వాత నిరసన తెలిపి వచ్చినా బాగుంటుందని చెబుతున్నారు. చంద్రబాబు ఈ అంశంపై పలువురు నేతలతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. తాను వెళ్లకుండా పార్టీ ఎమ్మెల్యేలను పంపించాలని బాబు భావిస్తున్నట్లు తెలిసింది.
విద్యార్థులతో జూమ్‌లో మాట్లాడిన చంద్రబాబు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులకు ఆర్థిక సాయమందిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. విద్యార్థులతో రెండో రోజూ శనివారం ఆయన జూమ్ కాల్‌లో మాట్లాడారు. విద్యార్థులకు సహాయం చేసేందుకు ఉక్రెయిన్, పోలండ్, హంగేరీలలో స్థిరపడిన తెలుగువారు (ఎన్నారైలు)ని చంద్రబాబు సంప్రదించారు. విద్యార్థులకు అవసరమైన డబ్బు, ఆహారం, హోటల్ ఖర్చులు అందించాలని వారిని కోరారు. ఆ ఖర్చును టీడీపీ నుంచి తిరిగి చెల్లిస్తామని తెలిపారు. పరిస్థితి క్లిష్టంగానే ఉందని, ఎవరూ వారి ప్రాంతాల నుంచి బయటకు రావద్దన్న ఇండియన్ ఎంబసీ సూచనలను పాటించాలని చెప్పారు.
Assembly Budget Session: నేను రాను.. మీరు వెళ్లండి
Published Sun, Feb 27 2022 4:31 AM | Last Updated on Sun, Feb 27 2022 9:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment