ప్రభుత్వ సేవల హామీ ముసాయిదా బిల్లు విడుదల | Maharashtra: Government's Public Services Bill draft is weak, inadequate | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సేవల హామీ ముసాయిదా బిల్లు విడుదల

Published Tue, Jan 27 2015 11:18 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Maharashtra: Government's Public Services Bill draft is weak, inadequate

ముంబై : నిర్దిష్ట వ్యవధిలోగా ప్రభుత్వ సేవలు అందించకుంటే సదరు అధికారికి జరిమానా విధించే మహారాష్ట్ర ప్రభుత్వ సేవల హామీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ ముసాయిదా బిల్లుపై ప్రభుత్వం సలహాలు, సూచనలు ఆహ్వానించింది. ముసాయిదా బిల్లు ప్రకారం, ‘‘ప్రతి అర్హుడు నిర్దిష్ట వ్యవధిలోగా కొన్ని సేవలను పొందే హక్కు కలిగి ఉంటాడు. ప్రతి ప్రభుత్వ సంస్థ తమ కార్యాలయంలో లభించే సేవలను గూర్చిన సమాచారాన్ని తమ నోటీస్ బోర్డుపై తెలియచేయాలి.

నియమిత అధికారి (దరఖాస్తులను పరిశీలించే వారు) వివరాలను, ‘తొలి పునర్విచారణ అధికారి’, రెండో పునర్విచారణ అధికారి’ వివరాలను కూడా తెలియపరచాలి. దరఖాస్తు సమర్పించిన తేదీ నుంచి నిర్దిష్ట వ్యవధి మొదలవుతుంది. దరఖాస్తును స్వీకరించిన అనంతరం సదరు దరఖాస్తుదారునికి రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ విధానంలో ‘ప్రత్యేక దరఖాస్తు సంఖ్య’ను కేటాయిస్తారు. దరఖాస్తులో కోరిన సదరు సేవను అందించే వ్యవధిని కూడా దానిలోనే పేర్కొంటారు.

అధికారి నిర్దిష్ట వ్యవధిలోగా సదరు సేవను అందించాలి లేదా కారణాలు చూపుతూ దరఖాస్తును తిరస్కరించాలి. ‘ప్రత్యేక సంఖ్య’ ఆధారంగా దరఖాస్తుదారుడు ఆన్‌లైన్‌లో తన దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. తనకు లభించిన సేవను బట్టి అసంతృప్తికి గురైనా లేక దరఖాస్తు తిరస్కరణకు గురైనా దరఖాస్తుదారుడు 30 రోజులలోగా తొలి పునర్విచారణ అధికారిని ఆశ్రయించవచ్చు. సరైన కారణం లేకుండా సేవను అందించడంలో విఫలమైనందుకు సదరు అధికారికి పునర్విచారణ అధికారి జరిమానా విధించవచ్చు.

రెండో పునర్విచారణ అధికారికి కూడా అప్పీలు చేసుకోవచ్చు. అధికారికి విధించిన జరిమానాను అతని వేతనంలో నుంచి మినహాయించాలని రెండో పునర్విచారణ అధికారి అకౌంట్స్ ఆఫీసర్‌ను ఆదేశించవచ్చు. ఇదిలా ఉండగా, సేవలందించడంలో విఫలమైన అధికారిది ‘దుష్ర్పవర్తన’గా పరిగణించరాదని కూడా ముసాయిదా బిల్లు పేర్కొంటోంది. నిర్దిష్ట వ్యవధిలో సేవలందించేందుకు నియమిత అధికారులకు, అపెల్లేట్ అధికారులకు శిక్షణనిస్తామని ప్రభుత్వం తెలిపింది. నియమితి అధికారులు ఏడాది కాలంలో ఒక్క పొరపాటుకూడా చేయకపోతే వారికి నగదు ప్రోత్సహకాలు కూడా ఇస్తామని పేర్కొంది.

ప్రభుత్వం ప్రజా సేవల అమలు కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి (పాలనా సంస్కరణల విభాగం), పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక విభాగాలకు చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శులు ఉంటారు. ఈ కమిటీ ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందచేసే చర్యలను సిఫార్సు చేస్తుంది. అలాగే ప్రభుత్వ అధికారుల పనితీరును విశ్లేషిస్తుంది. ఈ కమిటీ వార్షిక నివేదికను విధానసభలో ప్రవేశపెడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement