సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని విస్తృత స్థాయి లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని రూపొందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి రంగంలో కొత్త పరిశ్రమల స్థాపనకు భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానానికి రూపకల్పన చేస్తోంది. విద్యుత్, కార్మిక, రహదారులు, పన్నులు.. తదితర శాఖలతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర పరిశ్రమల శాఖ ఈ విధానానికి ముసాయిదాను రూపొందిస్తోంది.
ఈ వాహనాల ఉత్పత్తిరంగంలో సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50 వేలమందికి ఉపాధి కల్పిం చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ విధానంలో ప్రభు త్వం పలు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ త్వరలో వివిధ ప్రభుత్వ శాఖలతో సమావేశం నిర్వహించి ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలకు అందించాల్సిన సహాయ, సహకారాలపై చర్చించనున్నారని తెలిసింది.
అనంతరం విధాన ముసాయిదాకు తుదిరూపం ఇస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఇప్పటికే మహీంద్ర, ఎంఆర్‌ఎఫ్ తదితర పరిశ్రమలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలు సైతం రాష్ట్రానికి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో కర్ణాటక రాష్ట్రం కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రా ల్లో ప్రకటించిన విధానాలను పరిశీలించి దేశంలోనే అత్యుత్తమ ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment