industries departments
-
పారిశ్రామిక జిల్లాగా అనకాపల్లి
సాక్షి, అనకాపల్లి: పారిశ్రామిక జిల్లాగా అనకాపల్లి అభివృద్ధి చెందుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అచ్యుతాపురం, అనకాపల్లి రాష్ట్ర ముఖచిత్రంలో పారిశ్రామిక ప్రాంతాలుగా నిలవనున్నాయన్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పూడిలో ‘యమ రిబ్బన్ కంపెనీ’ నిర్మాణానికి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే రమణమూర్తిరాజులతో కలిసి అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చైనాకు చెందిన యమ రిబ్బన్ కంపెనీ సుమారు రూ.300 కోట్ల వ్యయంతో 15.76 ఎకరాల్లో తమ శాఖను ఏర్పాటు చేస్తోందన్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్, హెచ్‌పీసీఎల్, షిప్‌యార్డ్, బీహెచ్ఈఎల్ వంటి పరిశ్రమలతో విశాఖ పెద్ద పారిశ్రామిక నగరంగా వెలుగొందుతోందని గుర్తు చేశారు. ఇదే సమయంలో అచ్యుతాపురం సెజ్‌లో మరిన్ని పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయంటే.. పారిశ్రామిక ప్రగతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్నారు. యమ రిబ్బన్ కంపెనీ ద్వారా సుమారు రెండు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో అధిక సంఖ్యలో మహిళలకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. అందుబాటులో 25 వేల ఎకరాల భూమి.. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్ర తీరప్రాంతంలో అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, తుని, కాకినాడ వరకు పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఇప్పటికే 25 వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉందన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినా వాటికి భూమి కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. యలమంచిలి నియోజకవర్గం పూడిమడకలో త్వరలోనే ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారన్నారు. అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ తమ ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీని నంబర్‌వన్ స్థానంలో నిలిపిందని తెలిపారు. టెక్స్టైల్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ యమ రిబ్బన్ కంపెనీ ద్వారా 2వేల మందికి ప్రత్యక్షంగా, మరో 2వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. చైనా జనరల్ కాన్సులేట్ జాలియో మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు, న్యూఢిల్లీలో చైనా ఎంబసీ కార్యదర్శులు యు యాంగ్ డబ్లు్య జూన్ నిమి, ఏపీఐఐసీ జెడ్ఎం త్రినాథ్‌రావు, చైనా జనరల్ కాన్సులేట్ (కోల్‌కతా) జాలియు, యమ రిబ్బన్ కంపెనీ ఇండియన్ డైరెక్టర్ శివప్రసాద్, మేనేజర్లు పాల్గొన్నారు. -
సులభతర వాణిజ్యంలో తెలంగాణకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్య విధానం (ఈవోడీబీ) ర్యాంకుల్లో 2020కి సంబంధించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమలకు శాఖకు అనుబంధంగా ఉండే పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐ ఐటీ) ఏటా ప్రకటించే సులభతర వాణిజ్యం ర్యాంకులను గురువారం వెల్లడించింది. గతంలో ఉన్న ర్యాంకుల విధా నానికి స్వస్తి పలుకుతూ ఈ ఏడాది రాష్ట్రాలను టాప్ అఛీవర్స్, అఛీవర్స్, అస్పైరర్స్, ఎమర్జింగ్ ఇకో సిస్టమ్స్ అనే 4 కేటగిరీ లుగా విభజించింది. అయితే టాప్ అఛీవర్స్ జాబితాలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరి యాణా, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. బిజినెస్ రిఫారŠమ్స్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా 301 అంశాల్లో సంస్కరణలు చేపట్టాలని డీపీఐఐటీ ఆదే శించింది. అం దులో భాగంగా తెలంగాణ 301 అంశాల్లోనూ సంస్క రణలు చేపట్టి నూటికి నూరు శాతం మార్కులు సాధించింది. అయితే గతంలో ర్యాంకుల ప్రకట నలో ఎదురైన అస్పష్టతను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది కేటగిరీ లుగా వెల్లడించింది. 301 సంస్కరణల్లో కొన్ని రాష్ట్రాలకు ఒకటి, రెండు అంశాల్లోనూ అగ్రస్థానం దక్కిం దని, తెలంగాణ మాత్రం అనేక నిబంధనల్లో అగ్రస్థానం దక్కించు కుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. 2015లో ఈవోడీబీ ర్యాంకుల విధానం ప్రారంభంకాగా తొలిసారి 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ 2017లో రెండు, 2019లో మూడోస్థానంలో నిలిచింది. కాగా, ఈవోడీబీ ర్యాంకింగ్‌లో తెలంగాణకు టాప్ అఛీవర్స్ జాబితాలో చోటుదక్కడంపై పరిశ్రమల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో సులభతర వాణిజ్యంతో ప్రశాంత వాణిజ్యం కూడా సాధ్యమని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ టాప్.. వరుసగా రెండవ ఏడాది పూర్తిగా సంస్కరణల ప్రయో జనాలు పొందిన వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ఈవోడీబీ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానాన్ని సాధించింది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న తోడ్పాటుకు ప్రపంచస్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. సర్వేలో 92 శాతం మార్కులు దాటిన ఏడు రాష్ట్రాలను టాప్ అచీవర్స్‌గా ప్రకటించగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ 97.89%తో మొదటిస్థానంలో నిలిచింది. -
Andhra Pradesh: రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
సాక్షి,అమరావతి: ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా రెండో ఏడాది పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయడంపై రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పటికీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు సకాలంలో అందించేవారు కాదని, కానీ సంక్షేమ పథకాలకు క్యాలండర్ ప్రకటించి నిధులు ఇస్తున్నట్లుగానే పరిశ్రమలకు ఇవ్వడం.. పరిశ్రమలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియచేస్తోందని పేర్కొంటున్నారు. కోవిడ్ కష్టకాలంలో నిధుల ఇబ్బంది ఉన్నప్పటికీ పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయడం ద్వారా ఆయా సంస్థలు మూతపడకుండా నిలదొక్కుకోవడమే కాకుండా 12 లక్షల మంది జీవితాలకు భరోసా కల్పించినట్లయిందని చెబుతున్నారు. గతంలో వలే మూడునాలుగేళ్లు బకాయిలు పెట్టకుండా సకాలంలో రాయితీలు అందిస్తుండటంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తాయని, తద్వారా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశలు మెరుగుపడతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండో ఏడాది కూడా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేయడంపై వివిధ పారిశ్రామిక ప్రతినిధులు ఏమంటున్నారో.. వారి మాటల్లోనే.. నమ్మకం పెంచింది ప్రోత్సాహకాలను సకాలంలో విడుదల చేయడం.. పరిశ్రమలకు ప్రభుత్వంపై నమ్మకం పెంచింది. కష్టకాలంలో ఎంఎస్ఎంఈలకు రూ.440 కోట్లు విడుదల చేయడం ద్వారా వారి వర్కింగ్ క్యాపిటల్ వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇదే సమయంలో స్పిన్నింగ్ మిల్లులకు రూ.684 కోట్లు విడుదల చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడింది. వివిధ సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచడం ద్వారా రాష్ట్రంలో వివిధ ఉత్పత్తులకు, సేవలకు, ఆర్థికవ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తోంది. సీఎం జగన్‌కు సీఐఐ ఏపీ చాప్టర్ అభినందనలు తెలియజేస్తోంది. – దాట్ల తిరుపతిరాజు, చైర్మన్, సీఐఐ ఏపీ చాప్టర్ చేయూతనందించింది కోవిడ్‌తో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చేయూతనందించింది. ప్రోత్సాకాల రూపంలో పరిశ్రమలకు రూ.1,124 కోట్లు ఇవ్వడం ద్వారా చిన్న పారిశ్రామికవేత్తలతో పాటు పెద్ద పెట్టుబడిదారుని వరకు రాష్ట్రంపై నమ్మకాన్ని పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2020–23 పారిశ్రామిక పాలసీల్లో ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక రాయితీలను ప్రకటించారు. కేంద్రం కూడా ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత ప్రోత్సహించేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చే విధంగా మేం చర్యలు తీసుకుంటున్నాం. – సీవీ అచ్యుతరావు, ప్రెసిడెంట్, ఫ్యాప్సీ సకాలంలో ప్రోత్సాహకాలు గతంలో పరిశ్రమలు ప్రోత్సాహకాల కోసం కనీసం మూడు నాలుగేళ్లు ఎదురు చూడాల్సి వచ్చేది. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ బకాయిలను చెల్లించడమే కాకుండా వరుసగా రెండో ఏడాది కూడా సకాలంలో ప్రోత్సాహకాలను ఇచ్చింది. సంక్షేమ పథకాలకు క్యాలండర్ ప్రకటించినట్లుగానే ప్రోత్సాహకాలకు ముందుగానే తేదీని ప్రకటించడం పరిశ్రమల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచింది. ‘వైఎస్సార్ నవోదయం’ ద్వారా కష్టాల్లో ఉన్న అనేక పరిశ్రమలు నిలబడ్డాయి. – ఏపీకే రెడ్డి, ప్రెసిడెంట్, ఎఫ్‌ఎస్‌ఎంఈ పరిశ్రమలు నిలదొక్కుకున్నాయి గతేడాది లాక్డౌన్లో ఎంఎస్ఎంఈలు సిబ్బందికి కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితులున్న సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ పేరుతో ప్రభుత్వం ఆదుకుంది. దేశవ్యాప్తంగా సగటున 30% చిన్న పరిశ్రమలు మూతపడినప్పటికీ ఇక్కడ కష్టకాలాన్ని తట్టుకుని నిలబడటానికి ఇది ఉపయోగపడింది. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రోత్సాహకాలను విడుదల చేయడం నమ్మకాన్ని పెంచింది. ఇలా వెంటవెంటనే ప్రోత్సాహకాలు ఇవ్వడంతో క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోగలమన్న ధైర్యం వచ్చింది. ఈ నిధులు ముడిసరుకు కొనుగోలుకు, జీతాలకు ఉపయోగపడతాయి. – వి.మురళీకృష్ణ, ప్రెసిడెంట్, ఫ్యాప్సియా పారిశ్రామిక హబ్‌గా ఏపీ ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రం పారిశ్రామికహబ్‌గా తయారుకానుంది. గత ప్రభుత్వం పార్టనర్షిప్ సమ్మిట్ల పేరుతో ప్రచారం చేసిందే కానీ పరిశ్రమలకు సకాలంలో రాయితీలను చెల్లించకపోవడంతో ఈ రంగం పూర్తిగా దివాలా తీసింది. అలాగే పొరుగు రాష్ట్రంలో కూడా 2018 నుంచి ప్రోత్సాహకాలను ఇవ్వడం లేదు. సుమారు రూ.2,500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో పాత బకాయిలను కూడా చెల్లించడంతో పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉన్నారు. – మామిడి సుదర్శన్, జాతీయ అధ్యక్షుడు, దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ టెక్స్టైల్ హబ్‌గా ఏపీ కష్టాల్లో ఉన్న ఈ రంగానికి ఈ ప్రోత్సాహకాలు పెద్ద చేయూతనందిస్తాయి. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న 75 వేలమందిని ప్రత్యక్షంగా సీఎం ఆదుకున్నట్లయింది. అంతేకాదు ఈ రంగానికి కీలకమైన ముడిసరుకు పత్తిని పండించే రైతులకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రంలో టెక్స్టైల్ రంగంలో కొత్త పెట్టుబడులు వచ్చి కొత్తవారికి ఉపాధి కలిగే అవకాశం ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో స్పిన్నింగ్ నుంచి గార్మెంట్ వరకు రాష్ట్రం టెక్స్టైల్ హబ్‌గా ఎదుగుతుందన్న నమ్మకం ఏర్పడింది. – దండ ప్రసాద్, గౌరవాధ్యక్షుడు, ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ -
ఏపీ: ఆగస్టు 15న డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్ఛ్సేంజ్ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఇకపై రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నెలకు రెండు సార్లు మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఆగస్టు 15న డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్ఛ్సేంజ్ ప్రారంభించనునట్లు తెలిపారు. గురువారం ఆయన ఐటీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈఎంసీ, ఐటీ ప్రమోషన్, పాలసీ తదితర అంశాలపై చర్చించారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్కిల్ కాలేజీల పనుల పురోగతి, నిధుల సమీకరణలో వేగానికి చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకులతో సంప్రదించి నిధులు తెచ్చుకునే మార్గాలపై అన్వేషించాలని సూచించారు. స్కిలింగ్ కోర్సులు, ట్రైనింగ్, ప్రమోషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్తో ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్‌ని అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ ప్రాధాన్యత పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. స్కిల్ కాలేజీలను ప్రభుత్వం నిర్దేశించిన రూ.20 కోట్ల బడ్జెట్లో అత్యాధునికంగా తీర్చిదిద్దే డిజైనింగ్‌లు కూడా పూర్తయ్యాయని మంత్రికి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు వివరించారు. నెల్లూరు జిల్లాలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి, కర్నూలు జిల్లా డోన్ స్కిల్ కాలేజీల భూ సేకరణ పనుల పురోగతిపై మంత్రి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు. అత్యాధునిక కోర్సుల ద్వారా శిక్షణ అందిస్తే ఉద్యోగాల కల్పన సులభమవుతుందని మంత్రి వెల్లడించారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న స్కిల్ కాలేజీ భూసేకరణ పనిని త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. -
ఏపీ సర్కార్ మాకు ఆదర్శం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలు, నూతన ఒరవడి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాల రిజర్వేషన్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరిస్తామని తాజాగా మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ప్రత్యేక చట్టం తెచ్చిన విషయం విదితమే. ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు, ఇతర రాయితీలు పొందుతున్న పరిశ్రమలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది. - స్థానికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం వారి నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఈ చట్టం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. - స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను ఏపీ ప్రభుత్వం నెరవేర్చిందని నిపుణులు ప్రశంసించారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని ఇతర రాష్ట్రాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలోనూ ఈ చట్టాన్ని తేవాలని ఉద్యమిస్తున్నారు. - మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ ఇటీవల ఆ రాష్ట్ర శాసనమండలిలో మాట్లాడుతూ ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఆదర్శప్రాయమని ప్రకటించారు. మహారాష్ట్రలోనూ ఈ విధమైన చట్టాన్ని తేవాలని నిర్ణయించామన్నారు. - స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ప్రైవేట్ పరిశ్రమలను తమ ప్రభుత్వం ఆదేశించినా సానుకూలంగా స్పందించనందున ఏపీ తరహాలో ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు సుభాష్ దేశాయ్ వెల్లడించారు. ఈమేరకు చట్టం చేస్తామని ప్రకటించారు. - ఉద్దవ్ ఠాక్రే సర్కారు నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ఆకాంక్షలను గుర్తించడం, అందుకు సరైన విధానాన్ని రూపొందించడంలో మహారాష్ట్రకు ఏపీ ప్రభుత్వం దిశా నిర్దేశం చేసిందని నిపుణులు అభినందిస్తున్నారు. - ఈ చట్టాన్ని అమలు చేసే పరిశ్రమలకే తక్కువ ధరలకు భూములు, పారిశ్రామిక రాయితీలు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ఆంధ్రప్రదేశ్ తరహాలో తాము కూడా ‘దిశ’ చట్టాన్ని తెస్తామని మహారాష్ట్ర ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. -
పెట్రోలియం పరిశ్రమల్లో నిర్లక్ష్యం వద్దు
సాక్షి, హైదరాబాద్: పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల పరిశ్రమల్లో పనిచేసే సిబ్బంది తమ భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్ అన్నారు. ‘పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల సురక్షితమైన నిర్వహణ, ప్రమాదాల తగ్గింపు’అంశంపై 2 రోజుల వర్క్‌షాప్ హైదరాబాద్‌లోని మేరిగోల్డ్ హోటల్లో మంగళవారం ప్రారం భమైంది. రాష్ట్ర పరిశ్రమల విభాగం ఆధ్వర్యంలో జాతీయ భద్రతా మండలి రాష్ట్ర విభాగం, పెట్రోలియం, సహజ వాయువు పీఎస్‌యూ కంపెనీలు ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, గెయిల్ సంస్థలు సంయుక్తంగా ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. పెట్రోలియం, సహజ వాయువు పరిశ్రమల్లో భద్రతకు తీసుకోవాల్సిన అంశాలపై ప్రారంభమైన ఇలాంటి వర్క్‌షాప్‌లను క్రమంతప్పకుండా నిర్వహించాలని అన్నారు. ఈ తరహా పరిశ్రమల్లో అందుబాటులోకి వచ్చిన నూతన సౌకర్యాలు, ఆవిష్కరణల గురించి వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల రాష్ట్ర పరిశ్రమల శాఖకు ప్రశంసలతోపాటు రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడ్డాయని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల విభాగం డైరెక్టర్ పీఎం చంద్రమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జాతీయ భద్రతా మండలి రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి వర్క్‌షాప్ ఇదేనని చెప్పా రు. ఈ తరహా పరిశ్రమల భద్రత విషయంలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉండాలని, దీనికోసం రాష్ట్ర పరిశ్రమల విభాగం, తెలంగాణ జాతీయ భద్రతా మండలి తరఫున పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. పరిశ్రమల శాఖ జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ రాజగోపాల రావు మాట్లాడుతూ.. పెట్రోలియం ఉత్పత్తుల పరిశ్రమల్లో భద్రత అత్యంత ముఖ్యమైందని అన్నారు. ఈ వర్క్‌షాప్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రతినిధులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల విభాగం అధికారులు, పీఎస్‌యూ ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులతోపాటు ఎల్పీజీ, ప్రొపేన్‌ను ఇంధనంగా వినియోగిస్తున్న ప్రైవేటు రంగానికి చెందిన ప్రతినిధులు సుమారు 100 మంది వరకు పాల్గొన్నారు. -
షాబాద్‌లో ‘వెల్స్పన్’ పరిశ్రమలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 3 పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను మంజూరు చేసింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెల్లిలో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమలకు సంబంధించి.. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి పెట్టుబడి రాయితీతోపాటు పెట్టుబడి రుణాలపై 8 ఏళ్లపాటు ఏడా దికి 8% చొప్పున వడ్డీ రీయింబర్స్మెంట్, పదేళ్ల పాటు ఉత్పత్తులపై రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు తదితర రాయితీలు అందజేస్తున్నారు. ఉలెన్, నాన్ ఉలెన్ వస్త్రాల పరిశ్రమ ఉలెన్ వస్త్రాలు, నాన్–ఉలెన్ వస్త్రాల ఉత్పత్తికి రూ.409 కోట్లతో 150 ఎకరాల్లో టెక్నికల్ టెక్స్ టైల్స్ మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి పెట్టుబడి రాయితీ కింద రూ.40 కోట్లు ఇస్తున్నారు. దీని ద్వారా 686 మందికి ప్రత్యక్షంగా.. 1000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. కార్పెట్ల తయారీ పరిశ్రమ నేలపై వేసే ఫ్లోర్ కవరింగ్ కార్పెట్లు, ఎల్వీటీ తదితర ఉత్పత్తుల కోసం రూ.1,261 కోట్లతో 500 ఎకరాల్లో మరో టెక్నికల్ టెక్స్టైల్స్ మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి రూ.80 కోట్ల పెట్టుబడి రాయితీ ఇస్తుండగా 1,000 మందికి ప్రత్యక్షంగా.. 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. లైన్‌పైప్‌ల తయారీ పరిశ్రమ: లైన్‌పైప్‌ల తయారీకి 266 కోట్లతో 150 ఎకరాల్లో పరిశ్రమను నిర్మించనున్నారు. దీనికి ప్రభుత్వం 10% పెట్టుబడి రాయితీ, ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. -
ఎలక్ట్రిక్ వాహన విధానంపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని విస్తృత స్థాయి లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని రూపొందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి రంగంలో కొత్త పరిశ్రమల స్థాపనకు భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానానికి రూపకల్పన చేస్తోంది. విద్యుత్, కార్మిక, రహదారులు, పన్నులు.. తదితర శాఖలతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర పరిశ్రమల శాఖ ఈ విధానానికి ముసాయిదాను రూపొందిస్తోంది. ఈ వాహనాల ఉత్పత్తిరంగంలో సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50 వేలమందికి ఉపాధి కల్పిం చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ విధానంలో ప్రభు త్వం పలు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ త్వరలో వివిధ ప్రభుత్వ శాఖలతో సమావేశం నిర్వహించి ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలకు అందించాల్సిన సహాయ, సహకారాలపై చర్చించనున్నారని తెలిసింది. అనంతరం విధాన ముసాయిదాకు తుదిరూపం ఇస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఇప్పటికే మహీంద్ర, ఎంఆర్ఎఫ్ తదితర పరిశ్రమలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలు సైతం రాష్ట్రానికి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో కర్ణాటక రాష్ట్రం కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రా ల్లో ప్రకటించిన విధానాలను పరిశీలించి దేశంలోనే అత్యుత్తమ ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారవర్గాలు తెలిపాయి. -
ఇక ప్రత్యేక ‘సెల్ పాలసీ’!
* మొబైల్ ఫోన్ల తయారీకి ప్రత్యేక పార్కు * పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా విధానాలు * విధి విధానాలపై పరిశ్రమల విభాగం కసరత్తు సాక్షి, హైదరాబాద్: సెల్‌ఫోన్ తయారీ పరిశ్రమ రాష్ట్రంలో వేళ్లూనుకునేలా ప్రత్యేక ‘సెల్ పాలసీ’ని రూపొందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ అధికారులు నూతన విధానంపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ తరహాలో ‘సెల్ పాలసీ’ కూడా పెట్టుబడిదారులను ఆకర్షించేలా రూపొందిస్తున్నారు. త్వరలో సీఎంకు నూతన పాలసీ విధి విధానాలు సమర్పించేందుకు సన్నద్ధమవుతున్నారు. చైనా ఆధారితంగా ఉన్న మొబైల్ ఫోన్ల పరిశ్రమ దేశంలో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలి మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం భూమితో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించడం ద్వారా ఈ రంగంలో సుమారు 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొబైల్ హబ్ ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పరిధిలోని మంచిరేవుల, రావిర్యాల అనుకూలంగా ఉంటాయని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. దీంతో మొబైల్ హబ్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించడంపై టీఎస్ఐఐసీ దృష్టి సారించింది. పొరుగు రాష్ట్రాల నుంచి పోటీ మైక్రోమాక్స్, సెల్కాన్, కార్బన్ తదితర సెల్ కంపెనీలు రాష్ట్రంలో ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అంతర్జాతీయ స్థాయి కలిగిన మైక్రోమాక్స్ తొలి దశలో రూ.80 కోట్ల పెట్టుబడులతో ముందుకు రాగా ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేసింది. ప్రతిష్టాత్మక శామ్సంగ్ కంపెనీ పెట్టుబడుల కోసం సర్కారు ప్రయత్నిస్తోంది. ఇండియా సెల్యులార్ సంఘం సభ్యులు కొందరు పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. అయితే పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మొబైల్ పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. ప్రత్యేక విధానం రూపొందించి రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా పోటీ తట్టుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేవలం ‘సెల్ పాలసీ’కే పరిమితం కాకుండా ప్రైవేటు రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్న ఫార్మా, ఫుడ్‌ప్రాసెసింగ్ తదితర రంగాలకూ ప్రత్యేక విధానాలు రూపొందించాలని నిర్ణయించింది.