సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలు, నూతన ఒరవడి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాల రిజర్వేషన్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరిస్తామని తాజాగా మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ప్రత్యేక చట్టం తెచ్చిన విషయం విదితమే. ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు, ఇతర రాయితీలు పొందుతున్న పరిశ్రమలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
- స్థానికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం వారి నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఈ చట్టం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.
- స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను ఏపీ ప్రభుత్వం నెరవేర్చిందని నిపుణులు ప్రశంసించారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని ఇతర రాష్ట్రాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలోనూ ఈ చట్టాన్ని తేవాలని ఉద్యమిస్తున్నారు.
- మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ ఇటీవల ఆ రాష్ట్ర శాసనమండలిలో మాట్లాడుతూ ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఆదర్శప్రాయమని ప్రకటించారు. మహారాష్ట్రలోనూ ఈ విధమైన చట్టాన్ని తేవాలని నిర్ణయించామన్నారు.
- స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ప్రైవేట్ పరిశ్రమలను తమ ప్రభుత్వం ఆదేశించినా సానుకూలంగా స్పందించనందున ఏపీ తరహాలో ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు సుభాష్ దేశాయ్ వెల్లడించారు. ఈమేరకు చట్టం చేస్తామని ప్రకటించారు.
- ఉద్దవ్ ఠాక్రే సర్కారు నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ఆకాంక్షలను గుర్తించడం, అందుకు సరైన విధానాన్ని రూపొందించడంలో మహారాష్ట్రకు ఏపీ ప్రభుత్వం దిశా నిర్దేశం చేసిందని నిపుణులు అభినందిస్తున్నారు.
- ఈ చట్టాన్ని అమలు చేసే పరిశ్రమలకే తక్కువ ధరలకు భూములు, పారిశ్రామిక రాయితీలు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ఆంధ్రప్రదేశ్ తరహాలో తాము కూడా ‘దిశ’ చట్టాన్ని తెస్తామని మహారాష్ట్ర ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment