వర్క్‌షాప్‌నకు హాజరైన అధికారులు శశాంక్ గోయల్, పీఎం చంద్రమోహన్, రాజగోపాల రావు తదితరులు
సాక్షి, హైదరాబాద్: పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల పరిశ్రమల్లో పనిచేసే సిబ్బంది తమ భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్ అన్నారు. ‘పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల సురక్షితమైన నిర్వహణ, ప్రమాదాల తగ్గింపు’అంశంపై 2 రోజుల వర్క్‌షాప్ హైదరాబాద్‌లోని మేరిగోల్డ్ హోటల్‌లో మంగళవారం ప్రారం భమైంది. రాష్ట్ర పరిశ్రమల విభాగం ఆధ్వర్యంలో జాతీయ భద్రతా మండలి రాష్ట్ర విభాగం, పెట్రోలియం, సహజ వాయువు పీఎస్‌యూ కంపెనీలు ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, గెయిల్ సంస్థలు సంయుక్తంగా ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. పెట్రోలియం, సహజ వాయువు పరిశ్రమల్లో భద్రతకు తీసుకోవాల్సిన అంశాలపై ప్రారంభమైన ఇలాంటి వర్క్‌షాప్‌లను క్రమంతప్పకుండా నిర్వహించాలని అన్నారు. ఈ తరహా పరిశ్రమల్లో అందుబాటులోకి వచ్చిన నూతన సౌకర్యాలు, ఆవిష్కరణల గురించి వివరించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల రాష్ట్ర పరిశ్రమల శాఖకు ప్రశంసలతోపాటు రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడ్డాయని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల విభాగం డైరెక్టర్ పీఎం చంద్రమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జాతీయ భద్రతా మండలి రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి వర్క్‌షాప్ ఇదేనని చెప్పా రు. ఈ తరహా పరిశ్రమల భద్రత విషయంలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉండాలని, దీనికోసం రాష్ట్ర పరిశ్రమల విభాగం, తెలంగాణ జాతీయ భద్రతా మండలి తరఫున పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. పరిశ్రమల శాఖ జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ రాజగోపాల రావు మాట్లాడుతూ.. పెట్రోలియం ఉత్పత్తుల పరిశ్రమల్లో భద్రత అత్యంత ముఖ్యమైందని అన్నారు. ఈ వర్క్‌షాప్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రతినిధులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల విభాగం అధికారులు, పీఎస్‌యూ ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులతోపాటు ఎల్పీజీ, ప్రొపేన్‌ను ఇంధనంగా వినియోగిస్తున్న ప్రైవేటు రంగానికి చెందిన ప్రతినిధులు సుమారు 100 మంది వరకు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment