సాక్షి,అమరావతి: ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా రెండో ఏడాది పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయడంపై రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పటికీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు సకాలంలో అందించేవారు కాదని, కానీ సంక్షేమ పథకాలకు క్యాలండర్ ప్రకటించి నిధులు ఇస్తున్నట్లుగానే పరిశ్రమలకు ఇవ్వడం.. పరిశ్రమలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియచేస్తోందని పేర్కొంటున్నారు.
కోవిడ్ కష్టకాలంలో నిధుల ఇబ్బంది ఉన్నప్పటికీ పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయడం ద్వారా ఆయా సంస్థలు మూతపడకుండా నిలదొక్కుకోవడమే కాకుండా 12 లక్షల మంది జీవితాలకు భరోసా కల్పించినట్లయిందని చెబుతున్నారు. గతంలో వలే మూడునాలుగేళ్లు బకాయిలు పెట్టకుండా సకాలంలో రాయితీలు అందిస్తుండటంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తాయని, తద్వారా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశలు మెరుగుపడతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండో ఏడాది కూడా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేయడంపై వివిధ పారిశ్రామిక ప్రతినిధులు ఏమంటున్నారో.. వారి మాటల్లోనే..
నమ్మకం పెంచింది
ప్రోత్సాహకాలను సకాలంలో విడుదల చేయడం.. పరిశ్రమలకు ప్రభుత్వంపై నమ్మకం పెంచింది. కష్టకాలంలో ఎంఎస్‌ఎంఈలకు రూ.440 కోట్లు విడుదల చేయడం ద్వారా వారి వర్కింగ్ క్యాపిటల్ వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇదే సమయంలో స్పిన్నింగ్ మిల్లులకు రూ.684 కోట్లు విడుదల చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడింది. వివిధ సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచడం ద్వారా రాష్ట్రంలో వివిధ ఉత్పత్తులకు, సేవలకు, ఆర్థికవ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తోంది. సీఎం జగన్‌కు సీఐఐ ఏపీ చాప్టర్ అభినందనలు తెలియజేస్తోంది.
– దాట్ల తిరుపతిరాజు, చైర్మన్, సీఐఐ ఏపీ చాప్టర్
చేయూతనందించింది
కోవిడ్‌తో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చేయూతనందించింది. ప్రోత్సాకాల రూపంలో పరిశ్రమలకు రూ.1,124 కోట్లు ఇవ్వడం ద్వారా చిన్న పారిశ్రామికవేత్తలతో పాటు పెద్ద పెట్టుబడిదారుని వరకు రాష్ట్రంపై నమ్మకాన్ని పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2020–23 పారిశ్రామిక పాలసీల్లో ఎంఎస్‌ఎంఈలకు అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక రాయితీలను ప్రకటించారు. కేంద్రం కూడా ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ రంగాన్ని మరింత ప్రోత్సహించేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చే విధంగా మేం చర్యలు తీసుకుంటున్నాం. – సీవీ అచ్యుతరావు, ప్రెసిడెంట్, ఫ్యాప్సీ
సకాలంలో ప్రోత్సాహకాలు
గతంలో పరిశ్రమలు ప్రోత్సాహకాల కోసం కనీసం మూడు నాలుగేళ్లు ఎదురు చూడాల్సి వచ్చేది. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ బకాయిలను చెల్లించడమే కాకుండా వరుసగా రెండో ఏడాది కూడా సకాలంలో ప్రోత్సాహకాలను ఇచ్చింది. సంక్షేమ పథకాలకు క్యాలండర్ ప్రకటించినట్లుగానే ప్రోత్సాహకాలకు ముందుగానే తేదీని ప్రకటించడం పరిశ్రమల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచింది. ‘వైఎస్సార్ నవోదయం’ ద్వారా కష్టాల్లో ఉన్న అనేక పరిశ్రమలు నిలబడ్డాయి. – ఏపీకే రెడ్డి, ప్రెసిడెంట్, ఎఫ్‌ఎస్‌ఎంఈ
పరిశ్రమలు నిలదొక్కుకున్నాయి
గతేడాది లాక్‌డౌన్‌లో ఎంఎస్‌ఎంఈలు సిబ్బందికి కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితులున్న సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ పేరుతో ప్రభుత్వం ఆదుకుంది. దేశవ్యాప్తంగా సగటున 30% చిన్న పరిశ్రమలు మూతపడినప్పటికీ ఇక్కడ కష్టకాలాన్ని తట్టుకుని నిలబడటానికి ఇది ఉపయోగపడింది. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రోత్సాహకాలను విడుదల చేయడం నమ్మకాన్ని పెంచింది. ఇలా వెంటవెంటనే ప్రోత్సాహకాలు ఇవ్వడంతో క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోగలమన్న ధైర్యం వచ్చింది. ఈ నిధులు ముడిసరుకు కొనుగోలుకు, జీతాలకు ఉపయోగపడతాయి.
– వి.మురళీకృష్ణ, ప్రెసిడెంట్, ఫ్యాప్సియా
పారిశ్రామిక హబ్‌గా ఏపీ
ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రం పారిశ్రామికహబ్‌గా తయారుకానుంది. గత ప్రభుత్వం పార్టనర్‌షిప్ సమ్మిట్ల పేరుతో ప్రచారం చేసిందే కానీ పరిశ్రమలకు సకాలంలో రాయితీలను చెల్లించకపోవడంతో ఈ రంగం పూర్తిగా దివాలా తీసింది. అలాగే పొరుగు రాష్ట్రంలో కూడా 2018 నుంచి ప్రోత్సాహకాలను ఇవ్వడం లేదు. సుమారు రూ.2,500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో పాత బకాయిలను కూడా చెల్లించడంతో పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉన్నారు. – మామిడి సుదర్శన్, జాతీయ అధ్యక్షుడు, దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్
టెక్స్‌టైల్ హబ్‌గా ఏపీ
కష్టాల్లో ఉన్న ఈ రంగానికి ఈ ప్రోత్సాహకాలు పెద్ద చేయూతనందిస్తాయి. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న 75 వేలమందిని ప్రత్యక్షంగా సీఎం ఆదుకున్నట్లయింది. అంతేకాదు ఈ రంగానికి కీలకమైన ముడిసరుకు పత్తిని పండించే రైతులకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రంలో టెక్స్‌టైల్ రంగంలో కొత్త పెట్టుబడులు వచ్చి కొత్తవారికి ఉపాధి కలిగే అవకాశం ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో స్పిన్నింగ్ నుంచి గార్మెంట్ వరకు రాష్ట్రం టెక్స్‌టైల్ హబ్‌గా ఎదుగుతుందన్న నమ్మకం ఏర్పడింది.
– దండ ప్రసాద్, గౌరవాధ్యక్షుడు, ఏపీ టెక్స్‌టైల్ మిల్స్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment