ఇక ప్రత్యేక ‘సెల్ పాలసీ’!
* మొబైల్ ఫోన్ల తయారీకి ప్రత్యేక పార్కు
* పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా విధానాలు
* విధి విధానాలపై పరిశ్రమల విభాగం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: సెల్‌ఫోన్ తయారీ పరిశ్రమ రాష్ట్రంలో వేళ్లూనుకునేలా ప్రత్యేక ‘సెల్ పాలసీ’ని రూపొందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ అధికారులు నూతన విధానంపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ తరహాలో ‘సెల్ పాలసీ’ కూడా పెట్టుబడిదారులను ఆకర్షించేలా రూపొందిస్తున్నారు. త్వరలో సీఎంకు నూతన పాలసీ విధి విధానాలు సమర్పించేందుకు సన్నద్ధమవుతున్నారు. చైనా ఆధారితంగా ఉన్న మొబైల్ ఫోన్ల పరిశ్రమ దేశంలో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలి మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం భూమితో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించడం ద్వారా ఈ రంగంలో సుమారు 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొబైల్ హబ్ ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పరిధిలోని మంచిరేవుల, రావిర్యాల అనుకూలంగా ఉంటాయని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. దీంతో మొబైల్ హబ్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించడంపై టీఎస్‌ఐఐసీ దృష్టి సారించింది.
పొరుగు రాష్ట్రాల నుంచి పోటీ
మైక్రోమాక్స్, సెల్‌కాన్, కార్బన్ తదితర సెల్ కంపెనీలు రాష్ట్రంలో ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అంతర్జాతీయ స్థాయి కలిగిన మైక్రోమాక్స్ తొలి దశలో రూ.80 కోట్ల పెట్టుబడులతో ముందుకు రాగా ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేసింది. ప్రతిష్టాత్మక శామ్‌సంగ్ కంపెనీ పెట్టుబడుల కోసం సర్కారు ప్రయత్నిస్తోంది. ఇండియా సెల్యులార్ సంఘం సభ్యులు కొందరు పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. అయితే పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మొబైల్ పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. ప్రత్యేక విధానం రూపొందించి రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా పోటీ తట్టుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేవలం ‘సెల్ పాలసీ’కే పరిమితం కాకుండా ప్రైవేటు రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్న ఫార్మా, ఫుడ్‌ప్రాసెసింగ్ తదితర రంగాలకూ ప్రత్యేక విధానాలు రూపొందించాలని నిర్ణయించింది.