నిరుద్యోగులకు ఎదురుచూపులే!
రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆలస్యమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఇక లేనట్టే. కొత్త రాష్ట్రాలు ఏర్పడే వరకు నియామకాలు అంతే సంగతులు. కేంద్ర మంత్రిమండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లును ఆమోదించిన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ ఉద్యోగాల భర్తీ ఆలస్యం కానుంది. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పని చేస్తుందని ముసాయిదా బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పడే వరకు తెలంగాణకు అవసరమైన సేవలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అందిస్తుందని ఆ బిల్లులో పేర్కొంది.
ఈ లెక్కన కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అసెంబ్లీ, హైకోర్టులతోపాటు నూతన రాష్ట్రానికి సర్వీస్ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రూల్స్‌ను ఆయా రాష్ట్రాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఉద్యోగాల భర్తీ అంత త్వరగా సాధ్యం కాదు. వీటితోపాటు అవసరమనుకుంటే ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతాలతో కొత్తగా జోన్లను ఏర్పాటు చేసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఉన్న జోన్లను కొనసాగించడం కాకుండా కొత్త జోన్లను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ ఉద్యోగాల భర్తీలో మరింత ఎక్కువ జాప్యం అయ్యే అవకాశమూ ఉంది. దీంతో నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు మరో ఏడాది, ఏడాదిన్నర కాలం ఎదురు చూడక తప్పేలా లేదు.
పక్క రాష్ట్రానికి అప్పగించే అవకాశం ఉన్నా: రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం రెండు రాష్ట్రాలకు ఒకే సర్వీస్ కమిషన్ ఉండొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో మాత్రం కేంద్రం అలా చేయలేదు. కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ ఏర్పడే వరకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సేవలను యూపీఎస్సీ అందిస్తుందని పేర్కొంటూ ఆ అధికారాన్ని తమ వద్ద పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న కమిషన్ ఆంధ్రప్రదేశ్‌కే పని చేస్తుందని అందులో పేర్కొంది.
అన్ని ఉద్యోగాల భర్తీ వాయిదా: రాష్ట్రంలో గడిచిన ఐదారు నెలల్లో దాదాపు 65 వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారానే 12 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ ప్రకటించినపుడే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. గ్రూపు-1, 2, 4, లెక్చరర్స్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. అయితే ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ లోగా తెలంగాణ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపడంతో ఇక నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. మరోవైపు సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు మొదలవ్వడంతో ఈ నెల 22 లేదా వచ్చే నెల 5న నిర్వహించాలని భావిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వాయిదా వేయక తప్పదని అధికారులు పేర్కొంటున్నారు.