-
వరంగల్ జిల్లాలోకి హసన్‌పర్తి, శాయంపేట
-
హన్మకొండలోకి దేవరుప్పుల
-
ముసాయిదాకు తుది రూపు
-
సర్కారుకు నివేదించిన కలెక్టర్ కరుణ
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా(డ్రాఫ్ట్) నివేదికను జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఆదివారం సాయంత్రం భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) రేమండ్ పీటర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు పంపించారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనకు సంబంధించిన సమగ్ర వివరాలను పొందుపరిచారు. రెవెన్యూ శాఖకు సంబంధించి మండలం, డివిజన్, జిల్లా స్థాయి అధికారులతో పలుమార్లు సంప్రదింపులు జరిపి నివేదిక రూపొందించారు. కలెక్టర్ పంపిన నివేదికను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి, తుది మార్పులు చేయనుంది. పునర్విభజన ముసాయిదా ప్రకటనను సోమవారం జారీ చేయనుంది. కలెక్టర్ వాకాటి కరుణ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం రూపొందించిన నివేదికలో చివరి క్షణం వరకు మార్పు లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొత్త మండలాల్లో కలిపే గ్రామాలపై ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయి. ఒక నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండేలా చూసుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. మొదట రూపొందించేది ముసాయిదా నివేదికే కావడంతో అధికారులు సైతం ఈ విషయంలో కాస్త ఉదారంగానే వ్యవహరిస్తున్నారు.
జిల్లా యంత్రాంగం రూపొందించిన ముసాయిదా నివేదికలో రోజురోజుకు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వరంగల్ జిల్లాను... వరంగల్, హన్మకొండ, ఆచార్య జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా పునర్విభజించాలని నివేదికలో పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 51 మండలాలు ఉన్నాయి. కొత్తగా ఖిలావరంగల్(వరంగల్), కాజీపేట(హన్మకొండ), ఐనవోలు(వర్ధన్నపేట), వేలేరు(ధర్మసాగర్), చిల్పూరు(స్టేçÙన్‌ఘన్‌పూర్) మండలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న జమ్మికుంట... కొత్తగా ఏర్పడుతున్న హన్మకొండ జిల్లాలో కలవనుంది. జమ్మికుంటలోని ఇల్లందకుంటను కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి వివరాలను మరోసారి పరిశీలించి జిల్లా యంత్రాంగం ఆదివారం తుది ముసాయిదా నివేదికను రూపొందించింది. శనివారం వరకు హన్మకొండ జిల్లాలో ఉన్న హసన్‌పర్తిని ఇప్పుడు వరంగల్ జిల్లాలోకి మార్చారు. అలాగే మొదట యాదాద్రి జిల్లాలో కలపాలని నివేదిక రూపొందించిన దేవరుప్పుల మండలాన్ని హన్మకొండ జిల్లాలో కలిపేలా ముసాయిదాలో పేర్కొన్నారు. మొదట వరంగల్ జిల్లాలో, తర్వాత భూపాలపల్లి జిల్లాలో కలపాలని పేర్కొన్న శాయంపేట మండలం తుది నివేదికలో వరంగల్ జిల్లాలోనే ఉంది. వరంగల్ జిల్లాలో 17, హన్మకొండ జిల్లాలో 19, ఆచార్య జయశంకర్ జిల్లాలో 15, మానుకోట జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. కొత్తగా హన్మకొండ, హుజూరాబాద్, భూపాలపల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. తుది ముసాయిదాకు ప్రభుత్వ స్థాయిలో మార్పులు జరిగే అవకాశం ఉంది.
ముసాయిదా నివేదికలోని వివరాలు ఇవీ...
వరంగల్ జిల్లా : వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, గీసుకొండ, సంగెం, ఆత్మకూరు, పరకాల, శాయంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ.
హన్మకొండ జిల్లా : హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, వేలేరు(కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు(కొత్తది), జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇలందకుంట(కొత్తది).
ఆచార్య జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కాటారం, మల్హర్‌రావు, మహాముత్తారం, మహదేవపూర్.
మానుకోట : మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సిం హులపేట, కొత్తగూడ, తొర్రూరు, గార్ల, బయ్యారం.
యాదాద్రి జిల్లా : జనగామ, బచ్చన్నపేట, లింగాలఘనపురం.
సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు.