టీచర్లపై కొత్త నిబంధనల కత్తి! | New Regulations attack on teachers! | Sakshi
Sakshi News home page

టీచర్లపై కొత్త నిబంధనల కత్తి!

Published Sat, Aug 25 2018 4:10 AM | Last Updated on Sat, Aug 25 2018 11:40 AM

New Regulations attack on teachers! - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఏ ఇతర ప్రభుత్వ శాఖల్లో లేని నిబంధనలను ప్రవేశపెడుతూ ప్రత్యేక చట్టాలు చేయడంపై ప్రభుత్వ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ పరిపాలనా (టీచర్‌ అడ్మినిస్ట్రేషన్‌ యాక్ట్‌), ఉపాధ్యాయ బదిలీ (టీచర్‌ ట్రాన్సఫర్‌ యాక్ట్‌)లకు వేర్వేరుగా ప్రత్యేక చట్టాలను తెస్తుండడంపై టీచర్లు రగిలిపోతున్నారు. ఈ రెండు చట్టాలకు సంబంధించిన ముసాయిదా బిల్లులను పాఠశాల విద్యాశాఖ ఇటీవల వెబ్‌సైట్లో పెట్టి టీచర్ల అభిప్రాయాలను కోరింది. ఈ చట్టాలపై కోర్టులు సైతం జోక్యం చేసుకోవడానికి వీల్లేని నిబంధనలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల మెరుగు మాటున తెస్తున్న ఈ చట్టాలు సర్కారు బడుల్లో పనిచేస్తున్న1.80 లక్షల మంది టీచర్ల పాలిట శాపంగా మారనున్నాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. పాఠశాలల నిర్వహణ, టీచర్లకు సంబంధించి చట్టా్టలు, జీఓలు అనేకమున్నాయని.. వాటిని సమర్ధంగా అమలుచేస్తే చాలని, ఈ కొత్త చట్టాలు తేవడం వెనుక ప్రభుత్వ ఆంతర్యం వేరేగా ఉన్నట్లు స్పష్టమవుతోందని విద్యారంగ నిపుణులు  విశ్లేషిస్తున్నారు.
ఉపాధ్యాయ పరిపాలనా బిల్లు కొత్తగా తీసుకొస్తున్న చట్టంలో టీచర్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి వారి  పనితీరును అంచనా వేసేలా అనేక ప్రమాణాలు నిర్దేశిస్తున్నారు. 

- బయోమెట్రిక్‌ అటెండెన్సు, సమ్మేటివ్‌ పరీక్షల్లో విద్యార్థుల ప్రమాణాల మెరుగుకు చర్యలు, జాతీయ, రాష్ట్రీయ అవార్డులు గెల్చుకోవడం, విధులు నిర్వహిస్తూనే ప్రభుత్వ కార్యక్రమాల అమలులో పనిచేయడం వంటివి ఇందులో పొందుపర్చారు. 
విద్యార్థులను పై తరగతులకు తగిన సామర్థ్యాలతో వెళ్లేలా చేయడం, చేరికలు పెంచడం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులతో సహ విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో ప్రభుత్వానికి సమర్పించడం, పాఠశాల యాజమాన్య కమిటీల సమావేశాల నిర్వహణ, టెన్త్‌లో విద్యార్థుల ప్రమాణాల పెంపు, పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వామ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. 
వీటిని అనుసరించి ఇన్సెంటివ్‌లను ఆయా ఉపాధ్యాయులకు మంజూరు చేయనున్నారు. ఇన్సెంటివ్‌ స్కీముకు సంబంధించి టీచర్లకు వ్యక్తిగత పనితీరుకు 70 పాయింట్లు, సంస్థాగత పనితీరుకు 30 పాయింట్లు ఇస్తారు. 
ఉపాధ్యాయులు తప్పుడు మార్గాలు అనుసరిస్తే వారిని సర్వీసు నుంచి తప్పించే అధికారం విద్యాశాఖకు ఉంటుంది. దీనిపై కోర్టులు కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదని నిబంధనలు పెట్టారు.

బదిలీల్లోనూ అనేక నిబంధనలు
ఇక టీచర్ల బదిలీలకు సంబంధించి అనేక నిబంధనలను ప్రభుత్వం బదిలీల చట్టంలో పెడుతోంది. ఇతర శాఖలకు లేని అనేక షరతులు, నిబంధనలు ఇందులో ఉన్నాయి. 
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని టీచర్ల బదిలీల ప్రక్రియను ఒక క్రమపద్ధతిలో చేపట్టేందుకు వీలుగా ఈ చట్టాన్ని తెస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. 
కార్పొరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, గ్రామాల్లో స్కూళ్లను 4 విభాగాలుగా విభజిస్తున్నారు. 
హెచ్‌ఆర్‌ఎ, ప్రయాణ సదుపాయం, టీచర్, విద్యార్థుల నిష్పత్తి తదితరాలను అనుసరించి ఈ బదిలీల నిబంధనలు రూపొందించారు. 
ఈ చట్టం ప్రకారం కొత్తగా నియమితులైన టీచర్లు, గతంలో గ్రామీణ ప్రాంతంలో చేయని వారికి నాలుగు, మూడు కేటగిరీల స్కూళ్లలో నియామక, బదిలీలు ఉంటాయి. 
కొత్త టీచర్లు.. ఐదేళ్లలోపు సర్వీసులోని వారు నియమితులైన గ్రామీణ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతానికి బదిలీకి అవకాశం కల్పించరు. 
భార్యాభర్తల విషయంలో.. వారు పనిచేస్తున్న సమీప ప్రాంత స్కూల్లో ఖాళీలను అనుసరించి బదిలీకి అవకాశమిస్తారు. 
కొత్త చట్టంలో గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లకు టీచర్లు అందుబాటులో ఉండేలా ప్రాధాన్యమిస్తారు. 
డీఎస్సీ ద్వారా నియమితులయ్యే కొత్త టీచర్లను గ్రామీణ ప్రాంత స్కూళ్లలోని ఖాళీల్లోనే తొలుత నియమిస్తారు. ఇది తప్పనిసరి చేస్తున్నారు. 
ఎవరైనా క్రిమినల్‌ ఛార్జెస్, పెనాల్టీలను ఎదుర్కొంటున్నట్లయితే వారు నిర్ణీత సర్వీసు పూర్తికాకపోయినా వారిని తప్పనిసరిగా 4వ కేటగిరీకి బదిలీ చేస్తారు. 
టీచర్లకు రొటేషన్‌ పద్ధతిలో బదిలీలకు ఈ చట్టంలో అవకాశం కల్పిస్తున్నారు. 
బదిలీ కౌన్సెలింగ్‌ సందర్భంలో తప్పుడు సమాచారం, తప్పుడు పత్రాలు ఇచ్చే వారికి క్రమశిక్షణ చర్యలు.. ఇతర పెనాల్టీలు విధించేలా చట్టంలో నిబంధనలు పెడుతున్నారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లేందుకు ఆస్కారం ఉండదు. 

‘సుప్రీం’ తీర్పూ బేఖాతరు
ఇదిలా ఉంటే.. విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయం కూడా లేకుండా ఉపాధ్యాయులకు అనేక ఇతర కార్యక్రమాలను ప్రభుత్వం నిర్దేశిస్తోందని, ఇక ముఖ్యులు వచ్చినప్పుడు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో టీచర్లను విద్యార్థులను ఆయా కార్యక్రమాలకు తరలిస్తున్నారని సంఘాలు మండిపడుతున్నాయి. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం టీచర్లకు ఒక్క ఎన్నికల సంఘ కార్యక్రమాల్లో మినహాయించి బోధనేతర కార్యక్రమాల్లో నియమించరాదని తీర్పులు ఇచ్చినా ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని ఆరోపిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు బోధన చేసే సమయం ఉండడంలేదని పేర్కొంటున్నాయి. ఈ తరుణంలో ప్రమాణాలు సాధించడానికి ఆస్కారం ఎక్కడుంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా, స్థానిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఇతరత్రా కారణాలవల్ల విద్యార్థులు సరైన ప్రమాణాలు సాధించలేకపోతే అందుకు టీచర్లను బాధ్యులను చేసేలా చట్టం తేవడం సరికాదంటున్నారు.

చట్టాలపై ఉన్న దృష్టి చదువుపై లేదు
ప్రస్తుత చట్టాల్లో అనేక నిబంధనలున్నాయి, వాటిని సమర్థంగా అమలుచేయించి విద్యార్థులకు మెరుగైన బోధన సాగించాల్సి ఉన్నా ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసి కొత్త చట్టాలు తేవడం విచిత్రంగా ఉంది. పైగా ఏ శాఖలో లేని నిబంధనలు టీచర్లకే పెట్టడమేమిటి? టీచర్లపై బోధనేతర కార్యక్రమాలను రుద్దుతున్నారు. అనేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు.. వీటిని సరిచేయకుండా కొత్త చట్టాలెందుకు?     – వి. బాలసుబ్రహ్మణ్యం, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ

పోలవరం ప్రాజెక్టుపై టీచర్లు ప్రచారమా?
ఇటీవల పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిస్తే ఆ పనులు టీచర్లకు అప్పగించారు. దానిపై విమర్శలు రావడంతో ఉపసంహరించుకున్నారు. ఇంతకన్నా దారుణమేమంటే పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయాలని ఆదేశిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు టీచర్లకు సంబంధం ఏమిటి? కోర్టుల జోక్యానికీ తావులేని రీతిలో నిబంధనలు పెట్టి ప్రజాస్వామ్య హక్కులను హరించడం అన్యాయం.      – బాబురెడ్డి, యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పనితీరు పాయింట్ల నిబంధనలు సరికాదు
పాఠశాలల్లోని ప్రమాణాలకు అనేక స్థితిగతులు కారణమవుతాయి. ఈ పరిస్థితిలో టీచర్ల పనితీరును అంచనా వేసి పాయింట్లు ఎలా కేటాయిస్తారు? బోధనేతర సిబ్బంది ఏ పాఠశాలలో కూడా లేరని.. వారి  పనులనూ టీచర్లకే అప్పగిస్తున్నారు. పైగా అలాంటి పనులకు పాయింట్లు అంటూ టీచర్లకు ప్రత్యేక చట్టాల ద్వారా నిబంధనలు పెట్టడం సరికాదు. 
    – ఎస్‌. సింహాచలం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement