ఆహార, ఆరోగ్య భద్రత! | Food, health care! | Sakshi
Sakshi News home page

ఆహార, ఆరోగ్య భద్రత!

Published Mon, Jun 2 2014 12:54 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

ఆహార, ఆరోగ్య భద్రత! - Sakshi

ఆహార, ఆరోగ్య భద్రత!

 ప్రకృతి వ్యవసాయం దిశగా తొలి అడుగు..
 - తొలకరికి ముందే మట్టి పరుపుల(బెడ్‌‌స)ను సిద్ధం చేసి.. కాలువలు, కందకాలు తవ్వాలి..
 - బెడ్‌‌సపై పంటలతోపాటే పండ్ల మొక్కలు..  నాటడానికి గుంతలు తవ్వి ఎండబెట్టాలి..  
  పనుల వెనుక గుర్తెరగాల్సిన ప్రయోజనాలెన్నో!
 

అన్నపూర్ణ పంటల నమూనా ప్రకారం అరెకరంలో ఎవరికి వారే ప్రకృతి వ్యవసాయం చేసుకోవడం వల్ల వారి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల ఆహార పదార్థాలు లభించడంతోపాటు శరీరానికి కావలసిన వ్యాయామం కూడా అందుతుంది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేని సురక్షితమైన ఆహారం అందడంతోపాటు రోజూ రెండు, మూడు గంటలు వ్యవసాయ అనుబంధ పనులు చేయడం వల్ల చక్కెర వ్యాధి, కీళ్లనొప్పులు, రక్తపోటు తదితర వ్యాధుల బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు. కూలీలను ఎక్కువగా వినియోగిస్తే ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతాయి. ఒక కుటుంబం ఆహార భద్రత నమూనాగానే దీన్ని ఆచరించాలి. ప్రతి కుటుంబం వారికి సరిపడా సహజాహారాన్ని సురక్షితమైన ప్రకృతి విధానంలో సంపాదించుకోవడానికి అవకాశం ఉంది.

 మట్టి పరుపుల ఏర్పాటుతో శుభారంభం..!
 అన్నపూర్ణ నమూనాలో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఆచరించే వారు ముందుగా చేయవలసింది పొలం ఎంపిక, నిర్మాణం. ఈ వారం కందకాలు, కాలువల ఏర్పాటు, మట్టి పరుపుల నిర్మాణం, పండ్ల మొక్కలకు గోతులు తీయడం.. వీటి వల్ల లాభాల గురించి తెలుసుకుందాం.

 కందకాల ఏర్పాటు: అర ఎకరం పొలం గట్టు చుట్టూ.. గట్టు లోపలి అంచు నుంచి ఒకటిన్నర అడుగుల వెడల్పు, అడుగు లోతులో కందకం తవ్వుకోవాలి. ఇలా కందకం తవ్వుకునేటప్పుడు మొదటి అర అడుగు లోతు వరకూ తవ్వే మట్టిని పొలం లోపలకు వేయాలి. మిగిలిన అర అడుగు లోతు వరకు తవ్వే మట్టిని చుట్టూ గల గట్టుపై వేసుకోవాలి. కందకం వల్ల లాభాలు: గట్టు చుట్టూ కందకం తవ్వుకోవడం వల్ల చాలా వరకు నీరు ఇంకడంతోపాటు.. వర్షాలు కురిసినప్పుడు అదనపు నీటిని సులువుగా బయటకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. అదనపు నీరు నిలబడకుండా బయటకు వెళ్లిపోవడంతోపాటు, పంటలకు నష్టం వాటిల్లదు.

మట్టి పరుపులకు నీరు అందించాల్సి వచ్చినప్పుడు కావలసిన మట్టి పరుపునకు ఈ కాలువ ద్వారా నీటిని సరఫరా చేసుకోగలుగుతాము. నీటి కోతకు గురైన సారవంతమైన మట్టిని వృథాగా బయటకు పోకుండా కూడా కందకాలు నిలువరిస్తాయి.
 మట్టి పరుపులు(బెడ్స్): 7 అడుగుల వెడల్పుతో తూర్పు- పడమరల దిశగా మట్టి పరుపులను ఏర్పాటు చేసుకోవాలి. మట్టి పరుపులపైన మట్టిని మెత్తగా చేసి ఉపరితలంపై సమతలంగా పరచుకోవాలి. అందుబాటులో ఉన్న సహజ ఎరువులైన పెంట గెత్తం (పశువుల ఎరువు)/ ఒండ్రుమట్టి / వర్మీకంపోస్టు / కోళ్ల పెంట / చెరువు మట్టి మొదలైన ఎరువుల్లో ఒకటి లేదా రెండు రకాల ఎరువును మట్టి పరుపులపై ఆరు అంగుళాల (అర అడుగు) మందంలో వేసి.. మట్టిలో కలుపుకొని.. సమతలంగా పరచుకోవాలి.


 మట్టి పరుపుల వల్ల లాభాలు: మట్టి పరుపు నేలను గుల్లగా ఉంచుతుంది. మొక్కలు-పంటలు నీటి ముంపునకు గురికాకుండా సహాయ పడుతుంది. మట్టిలో తేమ త్వరగా ఆరిపోకుండా ఉంచుతుంది. మొక్కల వేళ్లు లోతుగా విస్తరించడానికి, తగిన పోషకాలను మొక్కకు సులువుగా అందేలా చేయడానికి ఉపయోగపడుతుంది. మట్టి పరుపును కేంద్రంగా చేసుకొని ఒక్కొక్క లేదా రెండేసి పంటలు వేసుకుంటూ పంటల వైవిధ్యం ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. పంట మార్పిడిని సులభతరం చేస్తుంది. ఎత్తయిన మట్టి పరుపులు ఏర్పాటు చేసుకోవడం వల్ల తదనంతరం దుక్కి చేయవలసిన అవసరం రాదు. పంట ఉరకెత్తే అవకాశం ఉండదు. పంట విత్తుకోవటం, కోసుకోవటం సులువు అవుతుంది. నీటి ఆదా జరుగుతుంది. అతివృష్టి సమయంలో నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి నేలకోతను అరికడుతుంది.

తల్లి కాలువలు: మట్టి పరుపునకు ఆనుకొని 2 అడుగుల వెడల్పు, అడుగు లోతులో తల్లి కాలువలను ‘ఠి’ ఆకారంలో తవ్వుకోవాలి. ఇలా అర ఎకరం పొలమంతా మట్టి పరుపులు, తల్లి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. పొలానికి చివర పల్లంలో 10 అడగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతుతో నీటికుంట తవ్వుకోవాలి.తల్లి కాలువల వల్ల లాభాలు: తల్లి కాలువలు వర్షాకాలంలో వీలైనంత ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకించేందుకు ఉపయో గపడతాయి. మట్టిలో తేమ ఎప్పుడూ ఉండేందుకు సహాయపడతాయి. భూసారం కొట్టుకు పోకుండా పరిరక్షిస్తాయి. ఎక్కువ వర్షాలు కురిసేటప్పుడు మొక్కల మధ్య నీరు నిలబడకుండా జార విడుస్తాయి.

దీని వల్ల కూరగాయల పంటలకు నష్టం రాకుండా నివారిస్తుంది. నీటి వృథాను అరికడుతుంది. భూగర్భ జలాలను పెంచుతుంది. సేంద్రియ ఎరువులు, క్రిమి సంహారిణులు వేసుకోవడానికి, అంతరకృషి చేసుకోవడానికి, పంటలు విత్తుకోవటానికి- కోసుకోవడానికి వీలుకల్పిస్తాయి. కలుపు మొక్కలు, పంటల అవశేషాలను ఎరువుగా మార్చుకునేందుకు కూడా ఉపయోగపడతాయి. నీరు లభ్యత గల ప్రాంతాల్లో ఏ మట్టి పరుపునకు నీరు, తేమ అవసరమవుతుందో ఆ మట్టి పరుపునకే అందించేందుకు ఉపకరిస్తాయి.
 (‘జట్టు’ సౌజన్యంతో వచ్చే వారం మరికొన్ని విషయాలు..)
- ‘సాగుబడి’ డెస్క్
 (అన్నపూర్ణ పంటల నమూనా ప్రకారం ఏ మట్టి పరుపులో ఏ యే పంటలను ఎలా పండించేదీ తెలిపే చార్టును http://saagubadi.blogspot.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏ3 ప్రింట్ అవుట్ తీసుకుంటే స్పష్టంగా కనిపిస్తుంది.)
 
 రైతుల స్పందన అపూర్వం..!
 గత వారం ‘సాగుబడి’ (13.5.2014)లో ప్రచురితమైన ‘అన్నపూర్ణ బాటలో ఏరువాక సాగారో..’ కథనానికి రైతు సోదర సోదరీమణుల నుంచి, మేధావుల నుంచి  లభిస్తున్న అపూర్వ స్పందనకు కృతజ్ఞతలు.  మన రాష్ట్రం నుంచే కాకుండా బెంగళూరు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగువారు కూడా పత్రికలో ఈ కథనం చదివి స్పందిస్తున్నారు. తాము కూడా అన్నపూర్ణ నమూనా పంటల విధానాన్ని అమలు చేయాలను కుంటున్నామని, శిక్షణ పొందాలనుకుంటున్నామని పేర్లు నమోదు చేయించు కుంటున్నారు. కొంత మంది నేరుగా వచ్చి శిక్షణ పొందుతామంటున్నారు. మరికొంతమంది తమ ప్రాంతాల్లో రైతులను బృందంగా ఏర్పాటు చేస్తామని, నిపుణులను పంపి శిక్షణ ఇప్పించమని అడుగుతున్నారు. వీరి పేర్లను నమోదు చేసుకొని విడతల వారీగా శిక్షణ ఇవ్వబోతున్నాం. ఆయా తేదీలను వారికి ఫోన్ ద్వారా తెలియజేస్తాం.
 - డి. పారినాయుడు (9440164289),
 ‘అన్నపూర్ణ’ పంటల నమూనా రూపశిల్పి, జట్టు సంస్థ వ్యవస్థాపకులు
 
 శిక్షణ పొందగోరే రైతు సోదరులు, సంస్థలు సంప్రదించాల్సిన చిరునామా:
 జట్టు ఆశ్రమం, తోటపల్లి పోస్టు, రావి వలస(ఎస్.ఓ.), పార్వతీపురం వయా, విజయనగరం జిల్లా- 535525.
 ఫోన్: 08963 227228 (ఉదయం 9 గం. నుంచి రాత్రి 8 గం. వరకు).
 ఎం. నూకంనాయుడు(ప్రాజెక్టు మేనేజర్)- 94400 94384
 email: jattutrust1@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement