ఫుడ్‌ వెరీ బ్యాడ్‌ | Food Security Act failed in the city | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ వెరీ బ్యాడ్‌

Published Sat, Apr 29 2017 12:11 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

ఫుడ్‌ వెరీ బ్యాడ్‌ - Sakshi

ఫుడ్‌ వెరీ బ్యాడ్‌

నగరంలో ‘ఆహార భద్రత చట్టం’ విఫలం
హోటళ్లలో జోరుగా కల్తీ, అపరిశుభ్ర ఆహారం
కోటి మందికి ఇద్దరే ఫుడ్‌ సేఫ్టీ అధికారులు
తూతూమంత్రపు తనిఖీలతో ప్రయోజనం సున్నా
ప్రహసనంగా శాంపిల్స్‌ సేకరణ


కుళ్లిన మాంసం..రోజుల కొద్దీ ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన ఆహారం.. అపరిశుభ్రత మధ్యే వంటలు..డ్రైనేజీల పక్కనే గ్యాస్‌ స్టౌవ్‌లు..అడ్డగోలుగా రంగులు గుప్పించిన పదార్థాలు...బాబోయ్‌ నగరంలో హోటళ్లకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన హోటళ్ల తనిఖీల్లో భయంకర వాస్తవాలు వెలుగుచూశాయి. సిబ్బంది కొరత.. ఏళ్లుగా తనిఖీలు లేకపోవడం.. ఆహార భద్రత చట్టాన్ని తుంగలో తొక్కడం..ఫుడ్‌ సేఫ్టీపై నిర్లక్ష్యం వల్లే హోటల్‌ యజమానులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ‘ఫుడ్‌ సేఫ్టీ’పై సాక్షి ఫోకస్‌...
 
సిటీబ్యూరో
:జీహెచ్‌ఎంసీ అధికారులు గత 25 రోజులుగా నిర్వహిస్తున్న హోటళ్ల తనిఖీల్లో  ప్రతినిత్యం కుళ్లిన మాంసం.. అపరిశుభ్ర వంటగదులు, శుచీ శుభ్రతల లేమితో తినడానికి పనికిరాని ఆహారాన్ని గుర్తిస్తున్నారు. తనిఖీల తంతుగా జరిమానాలు విధిస్తున్నారు. అయినప్పటికీ, హోటళ్లలో పరిస్థితులు మారాయా ?అంటే లేదు. ఇలా ఎన్ని రోజులు తనిఖీలు చేసినా మారుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే గ్రేటర్‌లో ఉండాల్సినంతమంది ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు లేరు. 30 మంది ఉండాల్సిన చోట ముగ్గురు కూడా లేరు. కోటి జనాభా దాటిన నగరంలో లక్షకు పైగా హోటళ్లను తనిఖీ చేయడం వీరివల్ల కాదని హోటల్‌ నిర్వాహకులకు తెలుసు. అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతేకాదు తనిఖీలు కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి.

అన్ని హోటళ్లలో జరగడం లేవు. ఎక్కువమంది ప్రజలు హోటళ్లకు వెళ్లే బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వంటి ప్రాంతాల్లో తనిఖీల్లేవు. జీహెచ్‌ఎంసీ  స్లాటర్‌హౌస్‌ల్లో స్టాంప్‌ వేసిన (తినడానికి యోగ్యమైనదిగా) మాంసాన్ని వినియోగిస్తున్నారా లేదా అన్న అంశంపై తప్ప ఆహారకల్తీపై శ్రద్ధ చూపడం లేదు. మాంసం కల్తీని అరికట్టేందుకు ఈ తనిఖీలు అవసరమే అయినా.. మాంసం తప్పమరెందులోనూ కల్తీ జరగదా అంటే సమాధానం లేదు. అంతేకాదు.. కుళ్లినమాంసాన్ని, వాడి పారేసిన  మాంసాన్ని తిరిగి వినియోగిస్తున్నారని పేర్కొంటున్నారు.  ఆ మేరకు  ఫొటోలతో ప్రకటనలు గుప్పిస్తున్నారు   మినహా  శాంపిల్స్‌ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపుతున్న దాఖలాల్లేవు.  ల్యాబ్‌లలో పరీక్షిస్తే.. కల్తీ తీవ్రత ఎంతో.. ఎంత ప్రాణాంతకమో తెలుస్తుంది. నిబంధనల కనుగుణంగా, సేకరించిన శాంపిల్స్‌ను  నిర్ణీత వ్యవధిలో ల్యాబ్‌కు  పంపే యంత్రాంగం సైతం లేదు.   మొక్కుబడిగా జరిమానాలు రాసి హోటళ్లవారితో లాలూచీ పడుతున్నారు తప్ప  నిజంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన యంత్రాంగమే జీహెచ్‌ఎంసీలో లేదు. ఆ మాటకొస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇదే దుస్థితి.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ ఎక్కడ?
ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించిన  ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ(‘ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌–2002) నగరంలో అమలు కావడం లేదు.  దేశంలోని ఇతర నగరాల్లో  2011 ఆగస్టునుంచి ఇది అమల్లోకి వచ్చినప్పటికీ, నగరంలో  అమలవుతున్న జాడ లేదు. ఈ చట్టం మేరకు,  ఆస్తిపన్ను వివరాల మాదిరిగా ప్రతి ఆహార విక్రయ కేంద్రం వివరాలు జీహెచ్‌ఎంసీ వద్ద ఆన్‌లైన్‌లో జాబితా  ఉండాలి. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు జరగాలి. కల్తీని గుర్తించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలు.. కల్తీని బట్టి కఠినచర్యలుండాలి. కానీ.. ఇవేవీ లేవు. దీంతో ప్రజారోగ్యం.. వైద్యాధికారుల దాడులు ప్రహసనంగా మారాయి. రాష్ట్రంలో ఫుడ్‌సేఫ్టీ అథారిటీలో తగినంతమంది అధికారులతోపాటు జీహెచ్‌ఎంసీకి సంబంధించి కావాల్సినంతమంది అధికారులు లేరు. గతంలో ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఫుడ్‌ అడల్టరేషన్‌ (పీఎఫ్‌ఏ)  చట్టం అమల్లో ఉన్నప్పుడున్న హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లుగా ఉన్నవారే కొత్త ఫుడ్‌ సేఫ్టీ చట్టం వచ్చాక ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నారు. కొత్త  చట్టం  మేరకు జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్లకు 30 మంది ఫుడ్‌ సేఫ్టీ  ఆఫీసర్లు, ఐదు జోన్లకు ఐదుగురు డిజిగ్నేటెడ్‌ ఆఫీసర్లు (డీఓలు) ఉండాలి. వీరిపైన అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌(ఏఎఫ్‌సీ)ఉండాలి.  కానీ ఒక ఏఎఫ్‌సీ(అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్, ఇద్దరు ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు.

డాక్టర్లు ‘చెత్త’ పనులకు..
చట్టం పకడ్బందీగా అమలు కావాలంటే  ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు, డిజిగ్నేటెడ్‌ ఆఫీసర్లుగా డాక్టర్లుంటే మేలు. పలు రాష్ట్రాల్లో డాక్టర్లే ఈ విధులు నిర్వహిస్తుండగా, జీహెచ్‌ఎంసీ ఆరోగ్యం–పారిశుధ్యం విభాగంలోని డాక్టర్లు మాత్రం చెత్త పనుల్ని పర్యవేక్షిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. ఫుడ్‌ సేఫ్టీ, డిజిగ్నేటెడ్‌ ఆఫీసర్లుగా వారు వ్యవహరిస్తే పరిస్థితి కొంతైనా మారే వీలుంది.  అరుణాచల్‌ ప్రదేశ్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా, పాండిచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర , ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో డాక్టర్లే ఈ పోస్టుల్లో ఉన్నారు.

శిక్షణ లేమి..
డీఓ, ఎఫ్‌ఎస్‌ఓలుగా నియమితులైన వారు కల్తీని నిరోధించే అంశంలో ప్రత్యేక శిక్షణ పొందాలి.  ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ ధ్రువీకరించిన సంస్థలో శిక్షన పొందాలి.  అయితే నగరంలో ప్రస్తుతమున్న ఇద్దరు ఎఫ్‌ఎస్‌ఓలు ఎలాంటి శిక్షణ పొందలేదని సమాచారం. ఈ నేపథ్యంలో నగరజీవి ఆరోగ్యం.. దైవాదీనంగా మారింది.

తనిఖీలు.. జరిమానాలు..
గడచిన 25 రోజుల్లో ..
తనిఖీ చేసిన హోటళ్లు : 363
జరిమానా విధించిన హోటళ్లు: 201
విధించిన జరిమానా మొత్తం : రూ. 16,62,100

కోటి మంది జనాభాకు ఇద్దరే ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు..
జీహెచ్‌ఎంసీలో 2012లో ముగ్గురు డిజిగ్నేటెడ్‌ ఆఫీసర్‌ (డీఓ)లను మాత్రం నియమించారు. వారిలో ఒకరు 2013లో  రిటైరయ్యారు. 2016లో ఒకరు అసిస్టెంట్‌ఫుడ్‌ కంట్రోలర్‌ (ఏఎఫ్‌సీ)గా పదోన్నతి పొందారు. మరొకరు 2016లో మాతృసంస్థకు(పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌)  బదిలీ అయ్యారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో ఒక ఏఎఫ్‌సీ, ఇద్దరు ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లు (ఎఫ్‌ఎస్‌ఓ) మాత్రం ఉన్నారు. ఏఎఫ్‌సీయేగా బాధ్యతలు నిర్వహిస్తున్నవారే ఐదు జోన్లకు ఇన్‌ఛార్జి డీఓగా వ్యవహరిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన సెలవులో ఉన్నారు. ప్రస్తుతం కేవలం ఇద్దరు ఎఫ్‌ఎస్‌ఓలు మాత్రమే ఉన్నారు.

శాంపిల్స్‌ సేకరిస్తున్నాం
తనిఖీల సందర్భంగా జరిమానాలు విధించడంతోపాటు శాంపిల్స్‌ సేకరణ కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు 30 శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాం. వాటి రిపోర్టు రావడానికి నెలరోజులు పడుతుంది. వచ్చాక కల్తీని బట్టి అవసరమైన కఠినచర్యలు తీసుకుంటాం.
– డా.బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement