రేపటి నుంచే ‘ఆహార భద్రత’
లబ్ధిదారులకు 6 కిలోల బియ్యం
అర్హులందరికీ సరఫరా చేసేలా టీ సర్కారు ఏర్పాట్లు
డీలర్లకు కోటా విడుదల
సాక్షి, హైదరాబాద్: జనవరి 1 నుంచి ఆరంభం కానున్న ఆహార భద్రత చట్టం అమలుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇప్పటివరకు ఉన్న 4 కిలోల బియ్యానికి బదులు 6 కిలోలు ఇచ్చేలా ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాగాన్ని సిద్ధంచేసింది. సుమారు 2.30 కోట్లకు పైగా లబ్ధిదారులు ఈ పథకం కిందకి వస్తారని పౌర సరఫరాల శాఖ ప్రాథమిక అంచనా. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న రేషన్ కార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆహార భద్రత కార్డులు జారీచేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం ఇప్పటికే లబ్ధిదారుల నుంచి సుమారు 97 లక్షల దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వీటి పరిశీలనను డిసెంబర్ 26తో ముగించింది. అర్హుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో అర్హుల సంఖ్య ఎంతన్నది స్పష్టం కాలేదు. అయితే ఎలాంటి అభ్యంతరాలు లేని అర్హులకు మాత్రం జనవరి 2 నుంచి కుటుంబ సభ్యుల సంఖ్యపై పరిమితి లేకుండా 6 కిలోల బియ్యం సరఫరా చేయాలని పౌర సరఫరాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
గతంలో రాష్ట్రంలో 2.70 కోట్ల మంది అర్హులుగా ఉండగా, నెలకు 1.6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమయ్యేది. ఆహార చట్టం కింద గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం, పట్టణ ప్రాంతాల్లో 40 శాతం మందికి బియ్యం పంపిణీ చేసేందుకు ముందుకొచ్చిన కేంద్రం రాష్ట్రంలో 1.91 కోట్ల మందిని అర్హులుగా గుర్తించి ఏడాదికి 13.32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసేందుకు అంగీకరించింది. అయితే ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య కేంద్రం గుర్తించిన దానికంటే ఎక్కువగా ఉండటం, కోటా పెంపు దృష్ట్యా బియ్యం అవసరాలు మరింత పెరిగే అవకాశముంది. బియ్యం సబ్సిడీ భారం సైతం భారీగా పెరిగే అవకాశం ఉంది. పెంచిన కోటా మేరకు బియ్యం విడుదల చేయాల్సిన బాధ్యతను పౌర సరఫరాల శాఖ ఆయా జిల్లాల కలెక్టర్లకు కట్టబెట్టింది. వారంతా డిసెంబర్ 25 నాటికే కోటాను రేషన్ డీలర్లకు విడుదల చేశారు. ఇక ప్రస్తుతం బీపీఎల్ కుటుంబాలకు ఉన్న తెల్ల రేషన్ కార్డుల స్థానంలో గులాబీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించినా అది జనవరి 15 తర్వాత మొదలుపెట్టి ఫిబ్రవరి 15 నాటికి పూర్తిచేసే అవకాశముంది. గులాబీ కార్డులను రేషన్ సరుకులకు మాత్రమే పరిమితం చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
గ్యాస్‌కు నగదు బదిలీ సైతం..
ఇక దీంతోపాటు కేంద్రం తీసుకొచ్చిన వంటగ్యాస్‌కు న గదు బదిలీ పథకం సైతం జనవరి 1 నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల్లోప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని 32 లక్షల మంది ఈ పథకం కిందకురాగా జనవరి నుంచి 61 లక్షల మంది వినియోగదారులు ఈ పథకంలోకి రానున్నారు. బ్యాంక్ ఖాతాను, ఆధార్ సంఖ్యను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా వినియోగదారుడి ఖాతాలోకి వెళుతుంది. మొదటి మూడు నెలలపాటు ఈ పథకంలో చేరకపోయినా, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినా రాయితీ ధరకే సిలిండర్ ఇస్తారు. అయితే తర్వాతి మూడు నెలలపాటు రాయితీ ధరకు ఇవ్వకున్నా.. రాయితీని మాత్రం బ్యాంకు ఖాతాను ఎప్పుడైతే అనుసంధానిస్తే అప్పుడు ఖాతాలో జమచేస్తారు.