బియ్యం కోటా పెంచండి
కేంద్రానికి టీ సర్కారు వినతి
మరో 8 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాలని విన్నపం
జనవరి నుంచి ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తాం
కేంద్ర ఆహార శాఖ
సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ పార్థసారథి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆహార భద్రత చట్టాన్ని జనవరి నుంచి అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. అయితే కేంద్రం చెబుతున్న లబ్ధిదారుల సంఖ్యకు, రాష్ట్రంలోని లబ్ధిదారుల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం, దీనికి తోడు లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యం ఇచ్చేందుకు రాష్ట్రం సిద్ధపడినందున అందుకు తగ్గట్టుగా కేంద్రం అదనంగా ఏటా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కోటా పెంచాలని కోరింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్‌పాశ్వాన్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశానికి రాష్ట్రం తరఫున పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.పార్థసారథి హాజరై అదనపు బియ్యం అవసరాలపై విజ్ఞాపన చేసినట్లు తెలిసింది. వచ్చే మార్చి వరకు గడువు కావాలని, ఏప్రిల్ నుంచి పథకాన్ని అమలు చేస్తామని మెజార్టీ రాష్ట్రాలు కేంద్రానికి విన్నవించగా, జనవరి నుంచే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కమిషనర్ స్పష్టం చేసినట్లు తెలిసింది.
తెలంగాణలో ప్రస్తుత లెక్కల మేరకు బీపీఎల్ కుటుంబాలు: 80,13,478
మొత్తం లబ్ధిదారులు: 2.68 కోట్లు
కొత్తగా ఆహార భద్రత కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు: 96,48,936
ఆహార భద్రత కింద కేంద్రం గుర్తించిన లభ్ధిదారులు: 1.91 కోట్లు
ఆహార భద్రత పథకం కింద రాష్ట్రంలోని 60.96 శాతం గ్రామీణ, 41.14 శాతం పట్టణ ప్రాంతాల్లోని బీపీఎల్ లబ్ధిదారునికి ఒక్కొక్కరికి రూ.3 చొప్పున 5 కేజీల బియ్యాన్ని అందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తంగా 1.91 కోట్ల మంది అర్హులకు ఏటా 13.367లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కేంద్రం గతంలోనే సుముఖత తెలిపింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లెక్కల మేరకు అదనంగా 80 లక్షల మంది లబ్ధిదారులున్నారని, దీనికితోడు కొత్తగా జారీచేయనున్న కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న విషయాన్ని ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీంతోపాటే ప్రతి లభ్ధిదారుడికి కోటాను 6 కేజీలకు పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో బియ్యం అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉందని వివరించింది. అదనపు బియ్యం అవసరం ఏటా 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉండగా ఈ భారం మొత్తంగా ప్రభుత్వంపై రూ.1,800 కోట్ల వరకు ఉంటుందని, ఈ దృష్ట్యా మెజార్టీ భారాన్ని కేంద్రం భరించేందుకు ముందుకు రావాలని కోరింది. దీనిపై కేంద్రం స్పందన ఎలా ఉండనుందో త్వరలోనే తేలుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.