తిండి గింజకూ కరువు!
ఆహార భద్రతకు పొంచి ఉన్న ముప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార భద్రతకు భారీ ముప్పు ఏర్పడింది. కనీసం తిండి తినడానికి కూడా గడ్డుపరిస్థితులు ఏర్పడనున్నాయి. రాష్ట్ర అవసరాల మేరకు కూడా పండించుకునే పరిస్థితి లేకుండా పోయింది. బియ్యం, పప్పుధాన్యాల కొరత తీవ్రమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2015-16 ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల దిగుబడి గణనీయంగా పడిపోనుంద ని ప్రభుత్వం అంచనా వేసింది. వరి, పప్పుధాన్యాలు సహా ఇతర చిరుధాన్యాల దిగుబడి 21.75 శాతానికి పడిపోతుందని వ్యవసాయశాఖ మొదటి ముందస్తు అంచనా నివేదిక స్పష్టం చేసింది. వరి దిగుబడి 20.98 శాతానికి పడిపోనుందని పేర్కొంది.
నిరాశపరచిన ఖరీఫ్: ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. అయితే ఖరీఫ్ అధ్వానంగా ముగుస్తోంది. జూన్‌లో రుతుపవనాలు సకాలంలో వచ్చి రైతుకు ఆశ చూపించాయి. దీంతో రైతులు పెద్దఎత్తున పంటల సాగు మొదలుపెట్టారు. తర్వా త వర్షాలు ముఖం చాటేశాయి. ఆగస్టులో అడపాదడపా, సెప్టెంబర్‌లో సంతృప్తికరమైన స్థాయిలో వర్షాలు కురిసినా పంటలకు ప్రయోజనం లేకుండాపోయింది. ఈ ఖరీఫ్‌లో 1.03 కోట్ల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా 87.82 లక్షల ఎకరాల్లో (85%) సాగు జరిగింది. అయితే అందులో ఆహారధాన్యాల సాగు 51.62 లక్షల ఎకరాలకు గాను... 35.10 లక్షల ఎకరాల్లోనే (68%) అయింది. కీలకమైన వరి 26.47 లక్షల ఎకరాలకు గాను, 14.90 లక్షల ఎకరాల్లోనే (56%) సాగయింది.
పడిపోనున్న దిగుబడులు: 2015-16 ఖరీఫ్‌లో ఆహారధాన్యాల దిగుబడుల లక్ష్యం 81.99 లక్షల మెట్రిక్ టన్నులు కాగా... 17.83 లక్షల మెట్రిక్ టన్నులకు (21.75%) పడిపోనుందని ప్రభుత్వం అంచ నా వేసింది. వరి లక్ష్యం 53.25 లక్షల మెట్రిక్ టన్నులు కాగా... 11.17 లక్షల మెట్రిక్ టన్నులకు (20.98%) పడిపోనుందని పేర్కొంది. మొక్కజొన్న లక్ష్యం 23.94 లక్షల మెట్రిక్ టన్నులు కాగా... 5.63 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోనుంది. కంది లక్ష్యం 1.79 లక్షల మెట్రిక్ టన్నులు కాగా... 61 వేలకు పడిపోనుంది. పెసర లక్ష్యం 1.10 లక్షల మెట్రిక్ టన్నులు కాగా... 9 వేల మెట్రిక్ టన్నులకే పరిమితం కానుంది.
ఆహార అవసరాలకు దెబ్బ: రాష్ట్రంలో పీడీఎస్ ద్వారా పేదలకు 18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. అదిగాక ఇతర వినియోగదారులకు మరో 7 లక్షల టన్నులు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ వరి దిగుబడి 11.17 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోతుండటంతో బియ్యం కొరత ఏర్పడనుంది. వరిని బియ్యంగా మార్చితే ఈ ఖరీఫ్‌లో దిగుబడి కేవలం 8.34 లక్షల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి అవుతుంది.
మన అవసరాలకు 25 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. అంటే మూడో వంతు అవసరాలకు కూడా బియ్యం ఉత్పత్తి చేసుకునే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఇప్పుడే మార్కెట్లో కిలో రూ. 35 నుంచి రూ. 45 పైనే బియ్యం ధరలుండగా... రానున్న రోజుల్లో రూ.70కి పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే ఏటా 1.90 లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరాలు ఉండగా 61 వేల మెట్రిక్ టన్నులే దిగుబడి అవుతోంది. కంది ధర ఇప్పటికే రూ. 140 దాటింది. ఇక పెసర, మినప పప్పుల దిగుబడి కూడా పడిపోతుండటంతో వాటి ధరలకూ రెక్కలొచ్చే అవకాశాలున్నాయి.