
కొత్త భోజనం
ఆహార భద్రత
నేటి నుంచి రేషన్ పంపిణీ
9,68,784 లబ్ధిదారుల గుర్తింపు
ముకరంపుర : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆహారభద్రత పథకం నేటినుంచి అమల్లోకి వస్తోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ గురువారం నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉన్నా పరిమితి లేకుండా బియ్యాన్ని అందించనున్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్ మండలం చెల్పూర్‌లో లాంఛనంగా ప్రారంభిస్తారు. జిల్లాలో 12,35,810 కుటుంబాలుండగా, ఆహారభద్రత కార్డుల కోసం 11,57,053 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతం నుంచి 9,34,934, పట్టణ ప్రాంతం నుంచి 2,22,119 అర్జీలు అందాయి. అధికారులు ఇల్లిల్లు తిరిగి, విచారణ చేసి జిల్లాలో 9,68,784 కుటుంబాలను ఆహారభద్రతకు అర్హులుగా తేల్చారు.
ఈ కార్డులకు సంబంధించి 30,15,909 యూనిట్లకు ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. జిల్లాలో 64,234 మందిని అంత్యోదయకు అర్హులుగా గుర్తించగా, 1,60,585 యూనిట్లకు 35 కిలోల చొప్పున బియ్యం అందిస్తారు. ఇప్పటికే జిల్లాలోని 2080 రేషన్‌డీలర్లు పెరిగిన కోటాకు అనుగుణంగా డీడీలు చెల్లించారు. ఈ మేరకు సంబంధిత రేషన్ దుకాణాలకు బియ్యంతో పాటు ఇతర సరుకులను సరఫరా చేస్తున్నారు. గతంలో జిల్లాలో 11,88,974 రేషన్‌కార్డులు ఉండేవి. ఇందులో గులాబీ కార్డులు, 99,806 కాగా, 10,89,168 తెల్లకార్డులు. ఇంతకుముందు తెల్లకార్డు గల కుటుంబాల్లో ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున గరిష్టంగా 20 కిలోలు ఇచ్చేవారు.
ఏఏవై కార్డున్న కుటుంబానికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డున్న కుటుంబానికి 10 కిలోల చొప్పున అందజేశారు. జిల్లాలో ప్రతినెల 16,159,528 టన్నులు పంపిణీ జరిగేది. ఆహారభద్రత పథకంలో కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని ఎలాంటి గరిష్ట పరిమితి లేకుండా అందజేస్తారు. దీంతో బియ్యం కోటా 20 లక్షల టన్నులకు పెరిగినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అర్హుల జాబితా ఆధారంగా బియ్యం పంపిణీ చేస్తారు. ఆహారభద్రత కార్డులు వచ్చే నెలలో జారీ చేసే అవకాశముంది.
సన్నబియ్యం భోజనం
జిల్లాలో నేటినుంచి అమలు
3.20 లక్షల మందికి {పయోజనం
కరీంనగర్ ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అందిం చే మధ్యాహ్నభోజనంతో పా టు సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు గురువారం నుంచి సన్నబియ్యం భో జనం వడ్డించనున్నారు. రాష్ట్ర ఆర్థి క, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ క మలాపూర్ మండలం వసతిగృహంలో ప్రా రంభిస్తారు. జిల్లాలో 309 వసతిగృహాలు, 3071 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులతో పాటు కేజీబీవీ, మోడల్‌స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల విద్యార్థులకు ఈ భోజనం అందనుంది. మొత్తం 3.20 లక్షల మంది విద్యార్థులకు నెలకు 1429 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరమవుతాయని అధికారులు పేర్కొన్నారు. బియ్యాన్ని డిసెంబర్ 30లోగా అన్ని వసతిగృహాలకు నేరుగా పంపించారు. పాఠశాలలకు సంబంధిత చౌకధరల దుకాణాల నుంచి సరఫరా చేశారు. జిల్లాలోని 15 ఎంఎల్‌ఎస్ పాయింట్లు (మండల్ లెవల్ స్టాక్) గోదాముల నుంచి బియ్యం పంపి ణీ చేశారు. ఈ పథకం అమలుతో జిల్లాలో ప్ర తినెలా రూ.4.8 కోట్లు, సంవత్సరానికి రూ. 50 కోట్లు ప్రభుత్వానికి ఖర్చవుతుందని అధికారులు లెక్క తేల్చారు.
జిల్లాలో ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో వంద హాస్టళ్లు ఉండగా, వీటిలో 6317 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత నివేదికల ప్రకారం వీరు నెలకు 586 క్వింటాళ్ల బియ్యం వినియోగిస్తున్నారు. కళాశాలల హాస్టళ్లు 13 ఉండగా 6736 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 905 క్వింటాళ్ల బియ్యం అవసరముంటాయి. ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 25 వసతిగృహాల్లో 2651 మంది, తొమ్మిది ఆశ్రమ పాఠశాలల్లో 2162 మంది విద్యార్థులు ఉండగా 608 క్విం టాళ్ల బియ్యం వినియోగిస్తున్నారు. బీసీ సంక్షేమ పరిధిలో 52 వసతిగృహాల్లో 3954 మంది విద్యార్థులుండగా 325 క్వింటాళ్లు, 26 కాలేజ్ హాస్టళ్లలో 1725 మంది విద్యార్థులుండగా 230 క్వింటాళ్లు, 52 కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో 7377 మంది విద్యార్థులకు 729 క్వింటాళ్ల బియ్యం అవసరముంటాయి. సన్నబియ్యం రూ.25 కిలో చొప్పున కొనుగోలు చేసి ఇతర ఖర్చులు కలుపుకుని కిలోకు రూ.36 ప్రభుత్వం భరించనుంది.
వన్ ఫుల్ మీల్
మంకమ్మతోట : జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, శిశువులకు ఒక పూట పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 2వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నం ‘సంపూర్ణ భోజనం’ అందించనున్నారు. మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో అంగన్‌వాడీ కేంద్రంలో ఫుల్ మీల్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 2012-13 నుంచి మంథని, మహదేవపూర్, మల్యాలలో ఐసీడీఎస్‌ల పరిధిలో, 2013-14 నుంచి గంగాధర, హుస్నాబాద్, భీమదేవరపల్లి ప్రాజెక్టుల పరిధిలో ఇందిరమ్మ అమృతహస్తం పథకం కింద ఒక పూట భోజనం అందిస్తున్నారు. ఈ పథకాన్నే సంపూర్ణ భోజనంగా జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లో అమలు చేస్తున్నారు. దీనికింద ఒక్కొక్కరికి రూ.15 ఖర్చవుతుంది. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి ఐసీడీఎస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆహార వస్తువులు, గ్యాస్‌స్టౌవ్‌లు సరఫరా చేశారు. జిల్లాలోని 16 ప్రాజెక్టుల పరిధిలో 3573 అంగన్‌వాడీ కేంద్రాలు, 145 మిని అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో గర్భిణులు 31,577మంది, బాలింతలు 31,510, పిల్లలు 1,69,218 మంది.. మొత్తం 2,32,305 మంది ఉన్నారు.
వీరందరికి ఒక పూట సంపూర్ణ భోజనం అందించనన్నారు. పప్పులు, ఆకుకూరలు, కాయకూరలు, గుడ్లు, పాలు ఇస్తారు. నెలలో ఆదివారాలు మినహా అన్ని రోజులు సంపూర్ణ భోజనం విడ్డిసారు. ఆదివారం సెలవుదినం అయినందున ఆ రోజు ఇచ్చే ఆహారంలోని గుడ్లను వారానికోసారి కోడిగుడ్డు కూర, వారంలో రెండుసార్లు పెరుగు భోజనంలో అందిస్తారు. ప్రతిరోజు పెద్దలకు రూ.15, పిల్లలకు రూ.7.20 ఖర్చుచేయనుంది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం 11 మందితో కమిటీలను వేసింది. ఒక్కో కేంద్రానికి సర్పంచ్ లేదా వార్డు మెంబర్ చైర్‌పర్సన్‌గా ఉంటారు, స్థానిక ఆశా వర్కర్, ఇద్దరు తల్లులు, ఒకరు సైన్స్ టీచర్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, కేంద్రానికి వచ్చే చిన్నారి తల్లిదండ్రులు, ఇద్దరు గ్రామ అధికారులు, అంగన్‌వాడీ టీచర్ సభ్యులుగా ఉంటారు. పథకం అమలు తీరుపై వారానికి ఒక రోజు సమీక్షిస్తారు.