Mukarampura
-
కొత్త భోజనం
ఆహార భద్రత నేటి నుంచి రేషన్ పంపిణీ 9,68,784 లబ్ధిదారుల గుర్తింపు ముకరంపుర : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆహారభద్రత పథకం నేటినుంచి అమల్లోకి వస్తోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ గురువారం నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉన్నా పరిమితి లేకుండా బియ్యాన్ని అందించనున్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్ మండలం చెల్పూర్లో లాంఛనంగా ప్రారంభిస్తారు. జిల్లాలో 12,35,810 కుటుంబాలుండగా, ఆహారభద్రత కార్డుల కోసం 11,57,053 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతం నుంచి 9,34,934, పట్టణ ప్రాంతం నుంచి 2,22,119 అర్జీలు అందాయి. అధికారులు ఇల్లిల్లు తిరిగి, విచారణ చేసి జిల్లాలో 9,68,784 కుటుంబాలను ఆహారభద్రతకు అర్హులుగా తేల్చారు. ఈ కార్డులకు సంబంధించి 30,15,909 యూనిట్లకు ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. జిల్లాలో 64,234 మందిని అంత్యోదయకు అర్హులుగా గుర్తించగా, 1,60,585 యూనిట్లకు 35 కిలోల చొప్పున బియ్యం అందిస్తారు. ఇప్పటికే జిల్లాలోని 2080 రేషన్‌డీలర్లు పెరిగిన కోటాకు అనుగుణంగా డీడీలు చెల్లించారు. ఈ మేరకు సంబంధిత రేషన్ దుకాణాలకు బియ్యంతో పాటు ఇతర సరుకులను సరఫరా చేస్తున్నారు. గతంలో జిల్లాలో 11,88,974 రేషన్‌కార్డులు ఉండేవి. ఇందులో గులాబీ కార్డులు, 99,806 కాగా, 10,89,168 తెల్లకార్డులు. ఇంతకుముందు తెల్లకార్డు గల కుటుంబాల్లో ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున గరిష్టంగా 20 కిలోలు ఇచ్చేవారు. ఏఏవై కార్డున్న కుటుంబానికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డున్న కుటుంబానికి 10 కిలోల చొప్పున అందజేశారు. జిల్లాలో ప్రతినెల 16,159,528 టన్నులు పంపిణీ జరిగేది. ఆహారభద్రత పథకంలో కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని ఎలాంటి గరిష్ట పరిమితి లేకుండా అందజేస్తారు. దీంతో బియ్యం కోటా 20 లక్షల టన్నులకు పెరిగినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అర్హుల జాబితా ఆధారంగా బియ్యం పంపిణీ చేస్తారు. ఆహారభద్రత కార్డులు వచ్చే నెలలో జారీ చేసే అవకాశముంది. సన్నబియ్యం భోజనం జిల్లాలో నేటినుంచి అమలు 3.20 లక్షల మందికి {పయోజనం కరీంనగర్ ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అందిం చే మధ్యాహ్నభోజనంతో పా టు సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు గురువారం నుంచి సన్నబియ్యం భో జనం వడ్డించనున్నారు. రాష్ట్ర ఆర్థి క, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ క మలాపూర్ మండలం వసతిగృహంలో ప్రా రంభిస్తారు. జిల్లాలో 309 వసతిగృహాలు, 3071 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులతో పాటు కేజీబీవీ, మోడల్‌స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల విద్యార్థులకు ఈ భోజనం అందనుంది. మొత్తం 3.20 లక్షల మంది విద్యార్థులకు నెలకు 1429 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరమవుతాయని అధికారులు పేర్కొన్నారు. బియ్యాన్ని డిసెంబర్ 30లోగా అన్ని వసతిగృహాలకు నేరుగా పంపించారు. పాఠశాలలకు సంబంధిత చౌకధరల దుకాణాల నుంచి సరఫరా చేశారు. జిల్లాలోని 15 ఎంఎల్ఎస్ పాయింట్లు (మండల్ లెవల్ స్టాక్) గోదాముల నుంచి బియ్యం పంపి ణీ చేశారు. ఈ పథకం అమలుతో జిల్లాలో ప్ర తినెలా రూ.4.8 కోట్లు, సంవత్సరానికి రూ. 50 కోట్లు ప్రభుత్వానికి ఖర్చవుతుందని అధికారులు లెక్క తేల్చారు. జిల్లాలో ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో వంద హాస్టళ్లు ఉండగా, వీటిలో 6317 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత నివేదికల ప్రకారం వీరు నెలకు 586 క్వింటాళ్ల బియ్యం వినియోగిస్తున్నారు. కళాశాలల హాస్టళ్లు 13 ఉండగా 6736 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 905 క్వింటాళ్ల బియ్యం అవసరముంటాయి. ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 25 వసతిగృహాల్లో 2651 మంది, తొమ్మిది ఆశ్రమ పాఠశాలల్లో 2162 మంది విద్యార్థులు ఉండగా 608 క్విం టాళ్ల బియ్యం వినియోగిస్తున్నారు. బీసీ సంక్షేమ పరిధిలో 52 వసతిగృహాల్లో 3954 మంది విద్యార్థులుండగా 325 క్వింటాళ్లు, 26 కాలేజ్ హాస్టళ్లలో 1725 మంది విద్యార్థులుండగా 230 క్వింటాళ్లు, 52 కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో 7377 మంది విద్యార్థులకు 729 క్వింటాళ్ల బియ్యం అవసరముంటాయి. సన్నబియ్యం రూ.25 కిలో చొప్పున కొనుగోలు చేసి ఇతర ఖర్చులు కలుపుకుని కిలోకు రూ.36 ప్రభుత్వం భరించనుంది. వన్ ఫుల్ మీల్ మంకమ్మతోట : జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, శిశువులకు ఒక పూట పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 2వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నం ‘సంపూర్ణ భోజనం’ అందించనున్నారు. మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో అంగన్వాడీ కేంద్రంలో ఫుల్ మీల్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 2012-13 నుంచి మంథని, మహదేవపూర్, మల్యాలలో ఐసీడీఎస్‌ల పరిధిలో, 2013-14 నుంచి గంగాధర, హుస్నాబాద్, భీమదేవరపల్లి ప్రాజెక్టుల పరిధిలో ఇందిరమ్మ అమృతహస్తం పథకం కింద ఒక పూట భోజనం అందిస్తున్నారు. ఈ పథకాన్నే సంపూర్ణ భోజనంగా జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లో అమలు చేస్తున్నారు. దీనికింద ఒక్కొక్కరికి రూ.15 ఖర్చవుతుంది. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి ఐసీడీఎస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆహార వస్తువులు, గ్యాస్‌స్టౌవ్‌లు సరఫరా చేశారు. జిల్లాలోని 16 ప్రాజెక్టుల పరిధిలో 3573 అంగన్వాడీ కేంద్రాలు, 145 మిని అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో గర్భిణులు 31,577మంది, బాలింతలు 31,510, పిల్లలు 1,69,218 మంది.. మొత్తం 2,32,305 మంది ఉన్నారు. వీరందరికి ఒక పూట సంపూర్ణ భోజనం అందించనన్నారు. పప్పులు, ఆకుకూరలు, కాయకూరలు, గుడ్లు, పాలు ఇస్తారు. నెలలో ఆదివారాలు మినహా అన్ని రోజులు సంపూర్ణ భోజనం విడ్డిసారు. ఆదివారం సెలవుదినం అయినందున ఆ రోజు ఇచ్చే ఆహారంలోని గుడ్లను వారానికోసారి కోడిగుడ్డు కూర, వారంలో రెండుసార్లు పెరుగు భోజనంలో అందిస్తారు. ప్రతిరోజు పెద్దలకు రూ.15, పిల్లలకు రూ.7.20 ఖర్చుచేయనుంది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం 11 మందితో కమిటీలను వేసింది. ఒక్కో కేంద్రానికి సర్పంచ్ లేదా వార్డు మెంబర్ చైర్‌పర్సన్‌గా ఉంటారు, స్థానిక ఆశా వర్కర్, ఇద్దరు తల్లులు, ఒకరు సైన్స్ టీచర్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, కేంద్రానికి వచ్చే చిన్నారి తల్లిదండ్రులు, ఇద్దరు గ్రామ అధికారులు, అంగన్వాడీ టీచర్ సభ్యులుగా ఉంటారు. పథకం అమలు తీరుపై వారానికి ఒక రోజు సమీక్షిస్తారు. -
అ‘టెన్షన్’
ముకరంపుర : ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్ అడిగిన ప్రశ్నలకు తెలిసిన మేరకు సమాధానాలు చెప్పాలి. ఆధారం కోసం జిరాక్స్ పత్రాలు చూపితే సరిపోతుంది. ఎలాంటి పత్రాలు కూడా ఎన్యూమరేటర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన వివరాలు మాత్రమే ఎన్యూమరేటర్లు రాసుకుంటారు. చెప్పిన వివరాలు రాసుకున్న తర్వాత వాటిని చదివి వినిపిస్తారు. ఆ తర్వాతే మీరు సంతకం చేయాలి. సర్వే ముగిసిన తర్వాత ఇంటి గోడపై ఇప్పటికే అతికించిన స్టిక్కర్‌పై సర్వే పూర్తయినట్లు ఎన్యూమరేటర్లు రాసి సంతకం చేస్తారు. కుటుంబంలో ఒకరుంటే చాలు.. ఎన్యూమరేటర్లు వచ్చినపుడు కుటుంబసభ్యులందరూ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇంటి యజమాని లేదా బాధ్యత కలిగిన వ్యక్తులు సమాచారం ఇస్తే సరిపోతుంది. ఇంట్లో లేనివారికి సంబంధించిన ఏమైనా రుజువులు చూపించి వారి వివరాలు నమోదు చేయించవచ్చు. వంట గది ప్రామాణికం కాదు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇంట్లో ఉండే వంట గదులను ప్రామాణికంగా తీసుకోకుండా నివసిస్తున్న కుటుంబాల సంఖ్యను నమోదు చేస్తారు. ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలైతే నివసిస్తున్నాయో.. ఆ కుటుంబాలన్నింటికీ వేర్వేరుగా ఇంటి నంబర్లు వేశారు. దీంతో కుటుంబాల సంఖ్య పెరిగింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం కావడంతో వంట గదులను ప్రామాణికంగా తీసుకోవడం లేదు. వేసిన నంబర్ల ఆధారంగానే.. సర్వే సిబ్బంది ఇళ్లపై వేసిన నంబర్ల ఆధారంగానే వివరాలు నమోదు చేస్తారు. ఓటరు లిస్టు లేదా మరే ఇతర గుర్తింపు కార్డు ఆధారంగా చెప్పిన వివరాలను నమోదు చేయరు. అద్దెగృహాల్లో ఉండే వారికి ‘బై’ నంబర్లు.. అద్దె గృహాల్లో నివసిస్తున్న వారి వివరాలు సేకరించేందుకు అద్దెకు ఉంటున్న ఇళ్లకే ‘బై’ నంబర్లు వేశారు. బై నంబర్లు వేయకుంటే సంబంధిత వీఆర్వో, వీఆర్ఏలు లేదా తహశీల్దార్లను సంప్రదించవచ్చు. రేషన్ కార్డు రద్దు కాకూడదనుకుంటే... ఒకచోట రేషన్‌కార్డు.. మరోచోట స్థిర, చరాస్తులు ఉన్నట్లయితే.. రేషన్‌కార్డు ఉన్న చోటనే సర్వేలో నమోదు చేసుకుంటే మంచిది. అప్పుడే రేషన్‌కార్డు రద్దు కాదు. స్థిర, చరాస్తులు ఉన్నచోట సర్వేలో పాల్గొంటే.. అప్పుడు కచ్చితంగా రేషన్‌కార్డు రద్దయ్యే అవకాశముంది. సదరెం సర్టిఫికెట్ తప్పనిసరి.. వికలాంగులు సదెరం సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒకవేళ సదరెం సర్టిఫికెట్ లేకున్నా వికలాంగుల వివరాలు నమోదు చేస్తారు. కానీ వికలాంగుల పెన్షన్ పొందడానికి సదరెం సర్టిఫికెట్ తప్పనిసరి చేయనున్నారు. ఖాతా నంబరు చెబితే నష్టమేమీ లేదు.. కుటుంబ యజమాని తన బ్యాంకు అకౌంటు నంబరు చెప్పడం వల్ల ఎలాంటి ముప్పు లేదు. అకౌంట్ నంబరు చెప్పడం.. చెప్పకపోవడం యజమాని ఇష్టమే. ప్రభుత్వం నుంచి పొందే లబ్దిని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వేయడానికి మాత్రమే అకౌంట్ నంబరు అడుగుతున్నారు (బ్యాంకు ఖాతా వంటి వ్యక్తిగత వివరాలు అడగరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా సర్వే నమూనా పత్రాల్లో మాత్రం బ్యాంకు ఖాతా వివరాలు తెలపాలని ముద్రించారు). ఇతర ప్రాంతాలవారు రావాల్సిన పనిలేదు ఉపాధి కోసం దుబాయి, ముంబయి, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు వెళ్లినవారు సర్వే కోసం రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ సొంతగ్రామాలకు వచ్చి సర్వేలో నమోదు చేసుకుని తిరిగి వెళ్లిపోతే అధికారులు మళ్లీ విచారణ చేపట్టి వారి పేర్లను తొలగిస్తారు. ఆదాయం ఎంతో చెబితే చాలు కుటుంబ ఆదాయం ఎంతో చెబితే చాలు. ఆదాయ మార్గాల వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా అనాథలే.. తల్లిదండ్రులు లేని పిల్లలు తాతలు లేదా సమీప బందువుల వద్ద పెరుగుతున్నా వారిని అనాథలుగానే పరిగణిస్తారు. వీరితోపాటు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, తల్లి లేదా తండ్రి వదిలేసినవారు, కొడుకులు లేదా కూతుళ్లు వదిలేసిన తల్లిదండ్రులను అనాథలుగానే పరిగణిస్తారు. సర్వే నుంచి వీరికి మినహాయింపు ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులను సర్వే నుంచి మినహాయించారు. అందుకు తగిన ఆధారాలను (అడ్మిషన్, ఫీజుల రశీదులు వగైరా) చూపిస్తే సర్వే పత్రంలో నమోదు చేస్తారు. గర్భిణులు, వివిధ కారణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని సర్వే నుంచి మినహాయించారు. ఇంటికి తాళం వేసి ఉంటే.. సర్వే జరిగే రోజు ఇంటికి తాళం వేసి ఉంటే.. పొరుగువారి నుంచి ఆ కుటుంబ యజమాని పేరు మాత్రమే నమోదు చేస్తారు. అలాంటి ఇళ్లకు ప్రత్యేకంగా మార్కువేస్తారు. నకిలీ ఎన్యుమరేటర్లను నమ్మొద్దు.. సర్వే కోసం నియమించిన ఎన్యూమరేటర్లకు గుర్తింపుకార్డు తప్పనిసరి చేశారు. గుర్తింపుకార్డు లేకుండా సర్వేకు వచ్చామని చెప్పేవారికి ఎలాంటి వివరాలూ చెప్పొద్దు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆస్తుల వివరాలు అడిగితే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. తప్పుడు సమాచారం చెప్పొద్దు.. సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవాలే తెలపాలి. తప్పుడు సమాచారం ఇస్తే ప్రభుత్వం నుంచి అమలయ్యే సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తించే అవకాశముంది. కుటుంబ సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సమగ్రంగా చెబితేనే రేషన్‌కార్డులు, ఇళ్లు పెన్షన్లకు అర్హత పొందుతారు. ఇది రహస్య సమాచారం సమగ్ర సర్వే ద్వారా సేకరించిన సమాచారం అంతా కూడా రహస్యంగా ఉంటుంది. మూడోవ్యక్తికి కుటుంబ వివరాలు చెప్పరు. సర్వే ఫారం జిరాక్స్‌లను బయటకు ఇవ్వడానికి వీల్లేదు (ఇంటింటి సర్వేలో పాల్గొనడం అనేది ప్రజల ఇష్టంపై (ఐచ్ఛికం) ఆధారపడి ఉంటుందని, ఎలాంటి ఒత్తిడీ చేయరాదని ఇటీవల హైకోర్టు సూచించింది). -
కొలిక్కిరాని భూ పంపిణీ గ్రామాల ఎంపిక
ముకరంపుర : ప్రభుత్వం చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమానికి లబ్ధి పొందాల్సిన గ్రామాల ఎంపిక ఇంకా కొలిక్కిరాలేదు. ఇప్పటివరకు ఈ ప్రక్రియపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి లో మార్గదర్శకాలు జారీ కాకపోవడం.. ఆగస్టు 15న భూపం పిణీ కార్యక్రమం చేపడతామని ప్రకటించడంతో అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. 40 శాతం ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేయా లా..? భూములు ఉన్న గ్రామాలను ఎంపిక చేయాలా..? అని తర్జనభర్జన పడుతున్నారు. భూములున్న చోట దళితులు ఉండడం లేదు. 40 శాతం దళిత జనాభా ఉన్న చోట భూములు లేకపోవడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. దళిత కుటుంబాలను సర్వే చేయాలని ప్రభుత్వం డీఆర్‌డీఏను ఆదేశించడంతో గ్రామాల ఎంపిక పూర్తికానప్పటికీ.. షెడ్యూల్లో భాగంగా శుక్రవారం నగరంలోని స్వశక్తి కళాశాలలో జగిత్యాల, మంథని డివిజన్లకు చెందిన వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు, వీఎస్ఏ (విలేజ్ సోషల్ ఆడిటర్)కు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఇప్పటివరకు ఎంపిక చేసిన గ్రామాలకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆమోదం తెలపలేదు. ఒకవేళ మార్పులుచేర్పులు ఉంటే అందుకనుగుణంగా సిద్ధంగా ఉం డేందుకు ఆయా గ్రామాల సిబ్బంది కి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం పెద్దపల్లి, సిరిసిల్ల, 28న కరీంనగర్ డివిజన్ల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. -
‘బోగస్’పై సీరియస్
ముకరంపుర: సర్కారు సొమ్మును కాజేస్తున్న అక్రమార్కుల ఆటలు కట్టించి.. అర్హులకే సంక్షేమ ఫలాలు అందించేలా ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం బోగస్ రేషన్ కార్డులు, పింఛన్ల ప్రక్షాళన చేపడుతోంది. ఇరవై రోజులుగా రెండింటిని ప్రాధాన్యాంశాలుగా ఎంచుకుని ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 16,116 రేషన్‌కార్డులను బోగస్‌గా గుర్తించిన అధికారులు వాటిని రద్దు చేశారు. ఆధార్‌తో లింకు.. రేషన్‌కార్డులను ఆధార్ కార్డుతో లింకుపెట్టి బోగస్ చిట్టాను సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో డీలర్లను అప్రమత్తం చేసి ఒత్తిడి పెంచుతున్నారు. మండలాల వారీగా డీలర్లు ఎవరెన్ని కార్డులు అప్పగించారు? వాటిలో ఎన్ని యూనిట్లు రద్దయ్యాయి? అని ప్రతి రోజు పక్కాగా సమాచారం సేకరిస్తున్నారు. శుక్రవారం వరకు 16,116 బోగస్ కార్డులను రద్దు చేశారు. వీటిని రేషన్ డీలర్లతో పాటు లబ్ధిదారులు స్వచ్ఛందంగా తెచ్చి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. తద్వారా 1,33,889 యూనిట్లు తొలిగిపోయినట్లు లెక్క తేల్చారు. కార్డుల గుర్తింపునకు డీలర్లు ముందుకు రాకున్నా బినామీలు తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రాప్‌బాక్స్‌లో వేస్తున్నారు. డబుల్ కార్డులు ఉన్న 1,808 మంది తమంతట తాము సరెండర్ చేశారు. రేషన్‌డీలర్లు 14,308 కార్డులను అప్పగించినట్లు డీఎస్వో చంద్రప్రకాష్ పేర్కొన్నారు. అత్యధికంగా పెద్దపల్లి డివిజన్లో 4,987 కార్డులను సరెండర్ చేశారు. కరీంనగర్ డివిజన్లో 4,836, జగిత్యాలలో 3,334, సిరిసిల్లలో 2,408, మంథనిలో 1,661 బోగస్ కార్డులు అధికారులకు అప్పగించారు. బోగస్ పింఛన్లు.. పింఛన్ల పంపిణీలోనూ ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతున్నట్లు గుర్తించిన సర్కారు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 1,78,914 మంది వృద్ధులు, 94,567 మంది వితంతువులు, 64,855 మంది వికలాంగులు, 11,668 మంది చేనేత, 6,033 మంది గీతకార్మికులు, 40,846 మందికి అభయహస్తం పింఛన్లు ఉన్నాయి. మే వరకు 3,94,699 మంది పింఛన్లు పొందుతున్నారు. వీరి లో అనర్హులను గుర్తించేందుకు అధికారులు బయోమెట్రిక్ విధానం ద్వారా చేతివేళ్ల గుర్తులు, ఫొటోలు, ఆధార్ కార్డుతో అనుసంధానం తప్పనిసరి చేశారు. ఇవి సమర్పించని 27,056 మందికి జూన్‌లో అధికారులు నిలిపివేశారు. జూన్ నెలాఖరు వరకు 21,250 మంది ఎన్రోల్ చేసుకోవడంతో వారికి ఆగస్టు నుంచి పింఛన్లు అందనున్నాయి. మిగిలిన 5,806 మంది లబ్ధిదారులు స్పందించడం లేదు. వీరిలో చేతులు లేనివారు కొందరు ఉండడంతో వారు ఏం చేయాలో తెలియక సర్కారు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. మిగిలినవి బోగస్ పింఛన్లుగా భావిస్తున్నారు. -
విద్యార్థి కిడ్నాప్ ఉదంతం సుఖాంతం
-
విద్యార్థి కిడ్నాప్ ఉదంతం సుఖాంతం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న విద్యార్థి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమయింది. కిడ్నాపయినట్టు భావిస్తున్న ముకరంపురకు చెందిన ముజఫీరుద్దీన్ క్షేమంగా తిరిగొచ్చాడు. అయితే ఈ కిడ్నాప్ ఉదంతంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలకు వెళ్లడం ఇష్టంలేక అతడే ఇంటి నుంచి వెళ్లిపోయి కిడ్నాప్ డ్రామా ఆడినట్టు అనుమానిస్తున్నారు. ముజఫీరుద్దీన్ తండ్రి మునాజీరుద్దీన్ ప్రభుత్వ టీచర్ పని చేస్తున్నారు. ముజఫీరుద్దీన్ ఓ ప్రైవేట్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు లాగే ఈరోజూ ఉదయం 7గంటలకు ఇంట్లో నుంచి స్కూల్‌కి బయలుదేరి వెళ్ళాడు. అయితే 8 గంటలకు స్కూల్‌కు రాలేదని పాఠశాల యాజమన్యం తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించారు. కాసేపటికే ఆ విద్యార్థి తల్లికి ఫోన్ వచ్చింది. తామే ముజఫీరుద్దీన్ కిడ్నాప్ చేశామని 20లక్షలు ఇవ్వాలని ఆమెను ఆగంతకులు ఫోన్లో బెదిరించారు. పోలీసులకు సమాచారం ఇవ్వవద్దని కూడా హెచ్చరించారు. కిడ్నాప్ విషయమై వారు పోలీసులను ఫిర్యాదు చేశారు. అయితే ముజఫీరుద్దీన్ క్షేమంగా తిరిగి రావడంతో కిడ్నాప్‌పై ఆరా తీస్తున్నారు. కిడ్నాప్ జరిగిన తీరు గురించి ముజఫీరుద్దీన్ పొంతన లేకుండా చెబుతుండడం అనుమానాలను రేకిస్తోంది. తమ కొడుకు సురక్షితంగా తిరిగిరావడంతో ముజఫీరుద్దీన్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.