కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న విద్యార్థి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమయింది. కిడ్నాపయినట్టు భావిస్తున్న ముకరంపురకు చెందిన ముజఫీరుద్దీన్ క్షేమంగా తిరిగొచ్చాడు. అయితే ఈ కిడ్నాప్ ఉదంతంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలకు వెళ్లడం ఇష్టంలేక అతడే ఇంటి నుంచి వెళ్లిపోయి కిడ్నాప్ డ్రామా ఆడినట్టు అనుమానిస్తున్నారు. ముజఫీరుద్దీన్ తండ్రి మునాజీరుద్దీన్ ప్రభుత్వ టీచర్ పని చేస్తున్నారు. ముజఫీరుద్దీన్ ఓ ప్రైవేట్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు లాగే ఈరోజూ ఉదయం 7గంటలకు ఇంట్లో నుంచి స్కూల్కి బయలుదేరి వెళ్ళాడు. అయితే 8 గంటలకు స్కూల్కు రాలేదని పాఠశాల యాజమన్యం తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించారు. కాసేపటికే ఆ విద్యార్థి తల్లికి ఫోన్ వచ్చింది. తామే ముజఫీరుద్దీన్ కిడ్నాప్ చేశామని 20లక్షలు ఇవ్వాలని ఆమెను ఆగంతకులు ఫోన్లో బెదిరించారు. పోలీసులకు సమాచారం ఇవ్వవద్దని కూడా హెచ్చరించారు. కిడ్నాప్ విషయమై వారు పోలీసులను ఫిర్యాదు చేశారు. అయితే ముజఫీరుద్దీన్ క్షేమంగా తిరిగి రావడంతో కిడ్నాప్పై ఆరా తీస్తున్నారు. కిడ్నాప్ జరిగిన తీరు గురించి ముజఫీరుద్దీన్ పొంతన లేకుండా చెబుతుండడం అనుమానాలను రేకిస్తోంది. తమ కొడుకు సురక్షితంగా తిరిగిరావడంతో ముజఫీరుద్దీన్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.