‘బోగస్’పై సీరియస్ | focus on bogus ration cards, pensions removing | Sakshi
Sakshi News home page

‘బోగస్’పై సీరియస్

Published Sat, Jul 26 2014 1:12 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

focus on bogus ration cards, pensions removing

ముకరంపుర: సర్కారు సొమ్మును కాజేస్తున్న అక్రమార్కుల ఆటలు కట్టించి.. అర్హులకే సంక్షేమ ఫలాలు అందించేలా ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం బోగస్ రేషన్ కార్డులు, పింఛన్ల ప్రక్షాళన చేపడుతోంది. ఇరవై రోజులుగా రెండింటిని ప్రాధాన్యాంశాలుగా ఎంచుకుని ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 16,116 రేషన్‌కార్డులను బోగస్‌గా గుర్తించిన అధికారులు వాటిని రద్దు చేశారు.

 ఆధార్‌తో లింకు..
 రేషన్‌కార్డులను ఆధార్ కార్డుతో లింకుపెట్టి బోగస్ చిట్టాను సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో డీలర్లను అప్రమత్తం చేసి ఒత్తిడి పెంచుతున్నారు. మండలాల వారీగా డీలర్లు ఎవరెన్ని కార్డులు అప్పగించారు? వాటిలో ఎన్ని యూనిట్లు రద్దయ్యాయి? అని ప్రతి రోజు పక్కాగా సమాచారం సేకరిస్తున్నారు. శుక్రవారం వరకు 16,116 బోగస్ కార్డులను రద్దు చేశారు. వీటిని రేషన్ డీలర్లతో పాటు లబ్ధిదారులు స్వచ్ఛందంగా తెచ్చి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. తద్వారా 1,33,889 యూనిట్లు తొలిగిపోయినట్లు లెక్క తేల్చారు.

కార్డుల గుర్తింపునకు డీలర్లు ముందుకు రాకున్నా బినామీలు తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రాప్‌బాక్స్‌లో వేస్తున్నారు. డబుల్ కార్డులు ఉన్న 1,808 మంది తమంతట తాము సరెండర్ చేశారు. రేషన్‌డీలర్లు 14,308 కార్డులను అప్పగించినట్లు డీఎస్‌వో చంద్రప్రకాష్ పేర్కొన్నారు. అత్యధికంగా పెద్దపల్లి డివిజన్‌లో 4,987 కార్డులను సరెండర్ చేశారు. కరీంనగర్ డివిజన్‌లో 4,836, జగిత్యాలలో 3,334, సిరిసిల్లలో 2,408, మంథనిలో 1,661 బోగస్ కార్డులు అధికారులకు అప్పగించారు.

 బోగస్ పింఛన్లు..
 పింఛన్ల పంపిణీలోనూ ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతున్నట్లు గుర్తించిన సర్కారు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 1,78,914 మంది వృద్ధులు, 94,567 మంది వితంతువులు, 64,855 మంది వికలాంగులు, 11,668 మంది చేనేత, 6,033 మంది గీతకార్మికులు, 40,846 మందికి అభయహస్తం పింఛన్లు ఉన్నాయి. మే వరకు 3,94,699 మంది పింఛన్లు పొందుతున్నారు. వీరి లో అనర్హులను గుర్తించేందుకు అధికారులు బయోమెట్రిక్ విధానం ద్వారా చేతివేళ్ల గుర్తులు, ఫొటోలు, ఆధార్ కార్డుతో అనుసంధానం తప్పనిసరి చేశారు.

ఇవి సమర్పించని 27,056 మందికి జూన్‌లో అధికారులు నిలిపివేశారు. జూన్ నెలాఖరు వరకు 21,250 మంది ఎన్‌రోల్ చేసుకోవడంతో వారికి ఆగస్టు నుంచి పింఛన్లు అందనున్నాయి. మిగిలిన 5,806 మంది లబ్ధిదారులు స్పందించడం లేదు. వీరిలో చేతులు లేనివారు కొందరు ఉండడంతో వారు ఏం చేయాలో తెలియక సర్కారు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. మిగిలినవి బోగస్ పింఛన్లుగా భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement