Bogus ration cards
-
బోగస్‌కు ఇక శుభం కార్డు !
బోగస్ కార్డుల అసలు రంగు తేలిపోనుంది. దర్జాగా అనుభవిస్తున్నవారి బండారం బయటపడనుంది. వేలకువేలు జీతాలు తీసుకుంటున్నా... ఇంకా నిరుపేదలకు అందించే సౌకర్యాలకోసం వెంపర్లాడేవారికి గుణపాఠం కలగనుంది. డీలర్ల వ్యవస్థలో గుట్టుగా సాగిపోయిన ఈ వ్యవహారానికి ఇక చెక్‌పడనుంది. ఆధార్ కార్డుల అనుసంధానంతో ఈ రహస్యం కాస్తా బట్టబయలవుతోంది. కొందరు ఉద్యోగుల కుటుంబీకులు తాము అర్హులమేననీ... తమ పిల్లలకు ఉద్యోగం ఉన్నంతమాత్రాన తామెలా అనర్హులమని విన్నవించుకోవడంతో సర్వేకు సన్నాహాలు మొదలయ్యాయి. సాక్షి, విజయనగరం: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ... వేలాది రూపాయల వేతనం తీసుకుంటున్న వారిలో చాలా మంది దారిద్య్రరేఖకు దిగువనున్నవారికోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలు పొందుతున్నారు. ఈ విషయం ఆధార్ అనుసంధానంతో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అధికారులు వారి కార్డులు తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. కొందరి కార్డులు ఆగిపోగా... తాము అర్హులమేనని, అయినా తమ కార్డులు తీసేశారని పలువురు వినతులు కూడా ఇవ్వడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని అర్హులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించవద్దని అధికారులను ఆదేశించింది. ఇప్పుడు అధికారులు విచారణ చేపట్టి నిజమైన ఉద్యోగులెవరో తేల్చాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతవరకు రేషన్ సరుకుల సరఫరా కొనసాగించాలని నిర్ణయించారు. ఉద్యోగుల వద్ద 7,204 కార్డులుప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఇతర అవసరాల కోసం తమ ఆధార్ నంబరు లింక్ చేశారు. అంతేగాకుండా ఉద్యోగులకు సంక్రమించే పలు ప్రయోజనాల కోసం వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు నమోదు చేశారు. ఈ వివరాలను తీసుకున్న పౌరసరఫరాలశాఖ అధికారులు రేషన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఈ విధంగా రరేషన్కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు గుర్తించారు. జిల్లాలో మొత్తం 7,12,303 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఆధార్ అనుసంధానంతో ఇందులో 7,204 రేషన్‌కార్డులు ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ సెప్టెంబర్ నెలలో రేషన్ ఆపేశారు. రేషన్‌కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగి కార్డుగా గుర్తించారు. అయితే పదేళ్ల కిందట కార్డులు ఇవ్వడంతో ఇందులో కొందరు ఉద్యోగం పొందిన తర్వాత కార్డులు పొందగా కొందరు మాత్రం ఉద్యోగం రాకముందు కార్డులు పొందారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వారు కార్డులు రద్దు చేసుకోపోవడం విశేషం. పిల్లలకు ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు కూడా బీపీఎల్ నుంచి బయటకు వస్తారు. కానీ ఉద్యోగం పిల్లలది కాబట్టి తమకు ఉద్యోగం లేదని వాదిస్తున్నారు. ఈ విధంగా ఇందులో అనేకమంది తాము పేదలమేనని, తమకు ఉద్యోగాలు లేవని అధికారులకు విన్నవించారు. కొందరు మాత్రం తప్పుగా ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు కావడంతో కార్డులు ఆగినట్లు సమాచారం. దీంతో వీరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ తమ కార్డులు కొనసాగించాలని వేడుకున్నారు. దీనిపై గందరగోళ పరిస్థితి తలెత్తడంతో వెంటనే ఆపేసిన కార్డులు పునరుద్ధరించి సరుకులు సరఫరా యధాతథంగా కొనసాగించి, తదుపరి చర్యలు మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా విచారణ కార్డులన్నింటినీ విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఉన్నతాధికారులు జిల్లా అధి కారులకు ఆదేశాలు జారీ చేసి విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి విచారణ చేయాలని మండల పౌరసరఫరాల అధికారులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి వ్యక్తిగతంగా పరిశీలించాలని, అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో గుర్తించాలని ఆదేశించారు. అంతా కలిసి ఉన్నారా? లేకుంటే వేర్వేరుగా ఉన్నారా? అన్నది విచారించాలని ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొనడంతో ఆ విధంగా ముందుకెళ్లాలని జేసీ సూచించారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత కార్డుకు అర్హులవునో కాదో తేల్చాలి. ఈ మేరకు సర్వే ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఇంటిస్థలాలకు లబ్ధిదారులు, స్థలాల గుర్తింపు పనిలో బిజీగా ఉన్నారు. దీనికితోడు ఎన్నికలు, ఇతర విధులు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు పూర్తయిన తర్వాత రేషన్‌కార్డులపై దృష్టి పెడతారని సమాచారం. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ ఉద్యోగుల కార్డుల్లో ఎన్ని బోగస్‌వి ఉన్నా యో తేలిపోతుంది. అందులో తెల్లదొరలు బయటకు వస్తారు. విచారణ జరగాల్సి ఉంది ప్రభుత్వ ఉద్యోగులుగా భావంచి ఆపేసిన తెల్లకార్డులను పదిరోజుల్లోనే పునరుద్ధరించాం. సరుకులు ఇస్తున్నాం. కానీ ఇందులో బోగస్ ఎన్ని అన్నది ప్రతి ఇంటికి వెళ్లి విచారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇంకా విచారణ జరగాల్సి ఉంది. అందులో అనర్హులని తేలితే కార్డులు ఆపేస్తారు. – ఎ. పాపారావు, డీఎస్ఓ, విజయనగరం -
విచిత్రం
సాధారణంగా జిల్లాలో కుటుంబాల కంటే రేషన్ కార్డులు తక్కువగా ఉంటాయి. లేదంటే కొన్ని సందర్భాల్లో కుటుంబాల సంఖ్యకు సరిసమానంగా అయినా రేషన్ కార్డులుండటం సహజం. అయితే జిల్లాలో పరిస్థితి మాత్రం విచిత్రం. కుటుంబాల సంఖ్యకు ఏమాత్రం పొంతన లేకుండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు లక్ష వరకు అధికంగా రేషన్ కార్డులు ఉన్నాయి. డబుల్ ఎంట్రీలు, బోగస్ రేషన్ కార్డులు ఇలా అన్ని కలుపుకుని లక్ష వరకు అదనంగా కార్డులు జిల్లాలో ఉండటం గమనార్హం. ఇటీవలే ఈపాస్ మిషన్లను కూడా ట్యాంపరింగ్ చేసిన ఘనులు జిల్లాలో ఉన్నారు. దీంతో ప్రతి నెలా వందల టన్నుల రేషన్ బియ్యం జిల్లాలో పక్కదారి పడుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో మొత్తం 1,873 మంది రేషన్ డీలర్ల ద్వారా 8,74,120 మందికి తెల్లరేషన్ కార్డుదారులకు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇది అధికారిక గణాంకాలు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రం 7,78,420 కుటుంబాలు ఉన్నాయి. జిల్లా జనాభా సుమారు 29.64 లక్షలు ఉంది. వాస్తవానికి దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటుంబాలను గుర్తించి వారికే ప్రతి నెలా రేషన్ సరఫరా చేయాల్సి ఉంది. వార్షిక ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని వారిని గుర్తిస్తారు. ప్రతి పదేళ్లకోసారి జనగణన జరుగుతుంది. అది కూడా సగటున జిల్లా జనాభా ప్రతి పదేళ్లకు 5 నుంచి 10 శాతం లోపు పెరుగుతుంది. ఉద్యోగరీత్యా జిల్లాకు వచ్చే వారు, వ్యాపార నిమిత్తం వచ్చే వారు ఇలా అనేక కేటగిరీల వ్యక్తులు ఉన్నారు. ఈ క్రమంలో సగటున 10 శాతం పెంపుదలను ప్రామాణికంగా తీసుకున్నా వారిలో 6 శాతం మంది దారిద్య్రరేఖ దిగువున ఉన్న మిగిలిన వారు మధ్యతరగతి వారు ఉన్నారు. జిల్లాలో పరిస్థితి మాత్రం గణాంకాలకు పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటికే కుటుంబాల సంఖ్య కంటే 94 వేల కార్డులు అధికంగా ఉన్నాయి. వీటిలో డబుల్ ఎంట్రీలు, బోగస్ కార్డులు వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే అధికారుల వాదన దీనికి భిన్నంగా ఉంది. గడిచిన ఏడేళ్లలో పెళ్లిళ్లు ఎక్కువ జరిగి వేరు కాపురాలు, కొత్తగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన కుటుంబాల సంఖ్య 2.50 లక్షల వరకు ఉంది. అంటే ఇప్పటికే సగటున 7 నుంచి 10 లక్షలు జిల్లా జనాభా పెరిగింది. దీనిని ప్రామాణికంగా తీసుకుంటే ఉన్న కార్డులు పెద్ద ఎక్కువేమీ కాదని వాఖ్యానిస్తున్నారు. ఈ–పాస్ ట్యాంపరింగ్ ఘనులు రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాలో ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్ జిల్లాలోనే జరిగింది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు డీలర్లతో కుమ్మక్కై ఈ–పాస్‌లను ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వ విలువ ప్రకారం రూ.20 లక్షలు విలువ చేసే బియ్యాన్ని బహిరంగ మార్కెట్లోకి తరలించి విక్రయించారు. ఈ వ్యవహరంలో కంప్యూటర్ ఆపరేటర్‌తో కలిపి 46 మందిని అరెస్ట్ చేశారు. ఈక్రమంలో 41 మంది డీలర్లను సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన దుకాణలకు సమీపంలోని డీలర్లకు ఇన్చార్జిలుగా నియమించారు. అలాగే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి టి.ధర్మారెడ్డిని బాధ్యుడ్ని చేసి సరెండర్ చేశారు. ఆయన స్థానంలో గత నెలలో నూతన డీఎస్‌ఓగా ఎంవీ రమణను నియమించారు. అయితే జిల్లాలో గతంలో సస్పెండ్ అయిన డీలర్ల వల్ల 30 డిపోలు, తాజాగా సస్పెండ్ అయిన 41 మంది వల్ల మరో 41 దుకాణాల డీలర్ల పోస్టులు ఖాళీలయ్యాయి. జిల్లాలో డబుల్ ఎంట్రీలు, బోగస్ కార్డుల సంఖ్య కొంత ఎక్కుగానే ఉంది. అనధికారిక సమాచారం ప్రకారం వీటి సంఖ్య 10 నుంచి 12 వేల వరకు ఉండవచ్చు ముఖ్యంగా కోవూరు, నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట, ఉదయగిరి, వెంకటగిరిలో అధికంగా ఉన్నాయి. ఇంటి పేరుతో సçహా ఒక కార్డు, ఇంటి పేరు లేకుండా మరో కార్డు.. ఇలా డబుల్ ఎంట్రీ కార్డులతో పాటు, వేల సంఖ్యలో బోగస్ కార్డులు ఉన్నాయి. అధికారులు నామాత్రంగా తనిఖీలు నిర్వహించి మామూళ్లతో సరిపెట్టుకోవటంతో కార్డులు ఎక్కువగా చెలామణిలో ఉన్నాయి. జిల్లాకు తాను కొత్తగా వచ్చానని అన్నింటినీ పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎంవీ రమణ సాక్షి ప్రతినిధికి తెలిపారు. అన్నింటినీ పరిశీలించి బోగస్ ఉంటే తొలగించటంతో పాటు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
1.6 కోట్ల బోగస్ రేషన్ కార్డుల తొలగింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి 1.6 కోట్ల బోగస్ రేషన్ కార్డులను తొలగించడం ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం మిగిలిందని కేంద్ర ఆర్ధిక కార్యదర్శి అశోక్ లావాసా వెల్లడించారు. ఎల్ పీజీ గ్యాస్ ను అందించే విధానంలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రభుత్వానికి మరో రూ.14,872 కోట్లు ఆదా అయినట్లు, దీంతో ఈ యేడాది 150 కొత్త పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుందని ఆయన తెలిపారు. -
కొత్త కార్డులు లేనట్లే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రజాపంపిణీ వ్యవస్థలో అవకతవకలు అరికట్టడం, బోగస్‌రేషన్ కార్డుల ఏరివేత లక్ష్యంగా ఆహార భద్రత కార్డులు(ఎఫ్ఎస్సీ) జారీచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ 10వ తేదీ నుంచి సుమారు 20రోజుల పాటు క్షేత్రస్థాయిలో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 10.80లక్షల మంది ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక పింఛన్లు, ఆహార భద్రత కార్డుల కోసం కుప్పలుగా దరఖాస్తులు రావడం తో కొత్త రేషన్‌కార్డుల(ఎఫ్ఎస్సీ) జారీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేశారు. సామాజిక పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి రావడంతో ఆహార భద్రత కార్డుల జారీపై దృష్టి సారించారు. కాగా, 2015 జనవరి 1వ తేదీన నాటికి కొత్తకార్డులు జారీ చేయడంతో పాటు రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. గడువు సమీపిస్తున్నా ఆహార భద్రత కార్డులకు అర్హులను తేల్చడంలో అధి కార యంత్రాంగం విఫలమైంది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయినా వివరాలు కంప్యూటరీకరణ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇప్పటివరకు 10.71 లక్షల దరఖాస్తుల పరిశీలన (99.14శాతం) పూర్తి చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వాటిలో 30 శాతం లబ్ధిదారుల వివరాలు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే ఆహారభద్రత కార్డులకు అర్హుల సంఖ్య స్పష్టమవుతోంది. కార్డల సంఖ్యలో కోత? ఈ ఏడాది ఆగస్టులో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం జిల్లాలో 9,85,557 కుటుంబాలుగా తేల్చారు. అయితే వివిధ కేటగిరీల కింద పౌరసరఫరాల శాఖ అధికారులు 11,73,988 రేషన్‌కార్డులు జారీచేశారు. ఈ నేపథ్యంలో బోగస్ కార్డులను తొలగిస్తూ వాటి స్థానంలో ఆహారభద్రత కార్డులు జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు దరఖాస్తుల పరిశీలన, కంప్యూటరీకర ప్రక్రియ పూర్తయితే కార్డుల సంఖ్యలో భారీగా కోత పడనుంది. కార్డులు, యూనిట్ల సంఖ్య గతంతో పోలిస్తే తగ్గడంఖాయమని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని ‘సాక్షి’కి సూచనప్రాయంగా వెల్లడించారు. గతంలో ఒక్కోయూనిట్‌కు రూపాయికి కిలో చొప్పున నాలుగు కిలోల బియ్యాన్ని పంపిణీ చేసేవారు. ప్రస్తుతం యూనిట్ కు ఆరు కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కార్డుల జారీప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో పాత కార్డులపైనే యూనిట్‌కు ఆర కిలోల చొప్పున ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీంతో గతంలో ఉన్న కార్డులు, యూనిట్ల సంఖ్య ఆధారంగానే జనవరి కోటాకు సంబంధించి డీలర్ల నుంచి డీడీలు తీసుకుంటున్నారు. జనవరి కోటాకు సంబంధించి 2310 మం డీలర్లలో 1572 మంది డీడీలు సమాచారం. నెలాఖరులోగా ఆహారభద్రత కార్డల దరఖాస్తులను కంప్యూటరీకరించి అర్హుల సంఖ్యను తేల్చుతామని జిల్లా పౌరసరఫరాల అధికారి సయ్యద్ యాసీస్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
1.52 లక్షల కార్డులు ఏరివేశాం
మొయినాబాద్ రూరల్: జిల్లాలో లక్షా 52 వేల బోగస్ రేషన్ కార్డులను తొలగించామని జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి వెల్లడించారు. గురువారం మొయినాబాద్ మండలం బాకారం, ఎనికేపల్లి గ్రామాల్లో స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి రికార్డులను పరిశీలించారు. బాకారంలో రేషన్ కార్డుకు ఆధార్ సీడింగ్ సరిగా లేకపోవడం గమనించి రేషన్ డీలరుపై, సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పారదర్శకత కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా మీరు మొద్దునిద్రలో ఉండడమేంటని ప్రశ్నించారు. గ్రామంలోని 630 రేషన్ కార్డులకు 241 కార్డులకు ఆధార్ నంబర్లు సీడింగ్ కాలేదని పేర్కొన్నారు. బోగస్ రేషన్ కార్డులను గుర్తించే బాధ్యత మండల అధికారులదేనన్నారు. ఎన్ని రేషన్ కార్డులకు ఆధార్ సీడింగ్ అయింది, ఎన్నింటికి కాలేదన్న సమాచారాన్ని వెంటనే తెలియజేయాలని మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎనికేపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో కేవలం ఐదుగురు పిల్లలే ఉండడంతో రోజువారీ పిల్లల హాజరుపట్టికను పరిశీలించారు. అందులో 18 మంది పిల్లల పేర్లు ఉండగా ఐదుగురే ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. మధ్యాహ్నం ఒంటిగంట అవుతున్నా హాజరు ఎందుకు తీసుకోలేదని మండిపడ్డారు. అనంతరం జేసీ ఎంవీ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. పౌరసరఫరా శాఖలో నిధులు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, అందుకు జిల్లా పాలనా యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని తొమ్మిది లక్షల 31 వేల 390 రేషన్‌కార్డుల్లో లక్షా 52 వేల బోగస్ కార్డులను గుర్తించి వాటిని తొలగించినట్టు చెప్పారు. మొత్తం 20 శాతం బోగస్ కార్డుల్లో ఇప్పటివరకు 15 శాతం కార్డులను ఏరివేశామని, ఇంకా ఐదు శాతం మిగిలి ఉన్నాయని తెలిపారు. రేషన్ కార్డులకు ఆధార్‌కార్డు సీడింగ్ 93 శాతం పూర్తయిందని, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, ఘట్కేసర్లలో 85 శాతమే అనుసంధానం చేశారని చెప్పారు. ఇంకా పూర్తికాకపోవడంలో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని పేర్కొన్నారు. అధికారులు ఇంటింటికీ తిరిగి పూర్తి సమాచారం సేకరించాలని అన్నారు. బాకారంలో రేషన్ డీలర్ సరుకులను సరిగా సరఫరా చేయడం లేదని, రికార్డుల్లో రేషన్ తీసుకున్న వారి సంతకాలకు బదులు అన్ని వేలిముద్రలే ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ చంద్రకాంత్, తహసీల్దార్ గంగాధర్, మండల రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, వీఆర్ఓ శ్రీనివాస్‌రెడ్డి, బాకారం సర్పంచ్ సుధాకర్‌యాదవ్ పాల్గొన్నారు. -
కోటి మందికి రేషన్ కట్...!
-
అన్నిమండలాల్లోనూ...బోగస్ రచ్చ !
ఆధార్ అనుసంధానంతో బోగస్ కార్డులు వెలుగుచూస్తున్నాయి. రచ్చబండ సభల్లో పంపిణీ చేసిన సుమారు 48 వేల కార్డుల్లో 8,493 కార్డులను బోగస్ కార్డులుగా అధికారులు గుర్తించారు. ఈ బోగస్ ‘రచ్చ’ అన్ని మండలాల్లోనూ వెలుగు చూసింది. ఆధార్ అ నుసంధానం పూర్తయిన తరువాత తెల్లరేషన్ కార్డుల్లో ఎన్ని బోగస్ కార్డులున్నాయో బయటపడనుంది. విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో అన్ని మండలాల్లోనూ బోగస్ కార్డులున్నట్టు తేలింది. అయితే ప్రస్తుతానికి రచ్చబండలో మంజూరు చేసిన కార్డుల వ్యవహరం బయటపడింది. ఇక పెద్ద సంఖ్యలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుల బాగోతం కూడా త్వరలో తేటతెల్లంకానుంది. ప్రస్తుతానికి రచ్చబండ వేదికగా మంజూరు చేసిన రేషన్ కార్డుల్లో బోగస్ వివరాలు బయటపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 8,493 బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టు తేలింది. 34 మండలాల్లోనూ బోగస్ కార్డులుండడం విశేషం. రాజకీయ ప్రయోజనాల కోసం అప్పట్లో ఇబ్బడిముబ్బడిగా కార్డులు మంజూరు చేశారు. జిల్లాలో ఉన్నవారు,లేనివారు అన్న తేడా లేకుండా కార్డులు మంజూరుచేశారు. జిల్లాలో శాశ్వత నివాసం ఉండీ ఇతర ప్రాంతాల్లో రేషన్ కార్డులు పొందడంతో ఈ కార్డులు బోగస్విగా గుర్తించారు. ప్రస్తుతం ఈ నెల నుంచి ఈ కార్డులకు రేషన్ నిలిపివేశారు. ఇంత వరకూ ఈ కార్డులకు మంజూరయిన రేషన్ ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది. నెల్లిమర్ల,గుర్ల, భోగాపురం మండలాల్లో రచ్చబండ బోగస్‌కార్డులు అధికంగా ఉన్నట్టు బయటపడింది. నెల్లిమర్లలో 687, గుర్లలో 645, భోగాపురంలో 610 కార్డులుండగా, తక్కువగా పాచిపెంట మండలంలో 20 మాత్రమే బోగస్ కార్డులున్నట్టు తేలింది. ఇవి కేవలం రచ్చబండ రేషన్ కార్డుల లెక్క మాత్రమే. ఇక తెలుపు రేషన్ కార్డుల్లో ఎన్ని బోగస్‌వి ఉన్నాయో గుర్తించాలంటే మరికొద్ది రోజులాగాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం జిల్లాలో ఆధార్ సీడింగ్ ప్రక్రియ 80.90 శాతం జరిగింది. గతంలో ప్రతీ రోజూ 30 నుంచి 35 వేల దాకా యూనిట్ల ఆధార్ సీడింగ్ ప్రక్రియ జరుగుతుండేది. తరువాత అది పది నుంచి 15 వేలకు పడిపోయింది. నిత్యం అధికారులు ఒత్తిడి తెస్తున్నా ఇప్పుడది 5 నుంచి ఆరు వేలకు మాత్రమే జరుగుతోంది. మరి కొద్దిరోజుల్లో సీడింగ్ప్రక్రియ నిలిచిపోనుంది. ఎందుకంటే మిగిలినవి బోగస్ కార్డులే అయ్యి ఉంటాయని, అందుకే సీడింగ్‌కు తీసుకురావడం లేదన్న అనుమానాలు అధికారులకు కలుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 85 శాతమే ఆధార్ సీడింగ్ జరిగే అవకాశం ఉంది. దీంతో మిగతా 15 శాతం రేషన్ కార్డులు బోగస్‌వేనని తెలుస్తోంది. జిల్లాలో ఉన్న 5,40,849 తెల్ల కార్డుల్లో 81,127 రేషన్ కార్డులు బోగస్ వేనని భావిస్తున్నారు. -
అక్టోబర్ 2నుంచి అన్న క్యాంటిన్లు
గుంటూరు : రైతు రుణమాఫీ చేసి తీరుతామని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఆమె మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ అన్న క్యాంటిన్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. బోగస్ రేషన్ కార్డుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి జిల్లాల్లో ఎంపిక చేసిన నగరాల్లో అన్న క్యాంటిన్లు ప్రారంభం కానున్నట్లు పరిటాల సునీత వెల్లడించారు. మంత్రి గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో లెవీ విషయమై సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడే జిల్లా యంత్రాంగంతో సమీక్ష జరుపుతారు. సాయంత్రం నాలుగు గంటలకు రేపల్లె నియోజకవర్గం బేతపూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు -
రేషన్ అక్రమాలు
విజయనగరం కంటోన్మెంట్ : ఆధార్‌తో బోగస్ కార్డులు బయటపడుతున్నాయి. జిల్లాలో బోగస్ రేషన్ కార్డులతో పాటు, చనిపోయిన, వలస వెళ్లిన వారితో పాటు రెండేసి కార్డులున్న వారికి బియ్యం కేటాయింపులు జరుగుతున్న భాగోతం వెలుగుచూస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇలా ప్రతి నెలా 300 మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా పంపిణీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ఆధార్ అనుసంధానం పూర్తయిన తరువాత ఎంత మేర బియ్యాన్ని బొక్కేస్తున్నారో బహిర్గతం కానుంది. ఆధార్ అనుసంధానంతో అక్రమాల భాగోతం వెలుగులోకి వస్తుండడంతో ఆయా కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్న వారి గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆధార్ కార్డులున్న వారందరికీ సీడింగ్ జరగాలంటే ఇంకా సుమారు లక్షా 24వేల యూనిట్ల సీడింగ్ జరగాల్సి ఉంది. కానీ అన్ని కార్డులకూ జోరుగా జరిగినప్పటికీ ఈ లక్షా 24వేల యూనిట్ల వద్ద సీడింగ్ ఆలస్యమవుతోంది. దీంతో ఈ కార్డుల్లో చాలా వరకూ బోగస్వేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మొత్తం 23,85,607 మందికి పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రతీ నెలా నెలకు నాలుగు కిలోల చొప్పున బియ్యం సరఫరా అవుతున్నాయి. కేవలం బియ్యం మాత్రమే ఇలా కుటుంబ సభ్యుల సంఖ్యననుసరించి కేటాయింపులు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా 5,91,569 లక్షల రేషన్ కార్డులకు 95,42,428 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అక్రమాలను అరికట్టేందుకు ఆధార్ సీడింగ్ తప్పనిసరిగా చేశారు. జిల్లాలోని 23,85,607 మంది తెల్ల రేషన్ కార్డుదారులకుగాను 18,24,000 మందికి మాత్రమే ఆధార్ నమోదు జరిగింది. వీరందరికీ ఆధార్ సీడింగ్ చేపట్టి నకిలీ లబ్ధిదారులను తొలగించాలని నిర్ణయించారు. ఆధార్ నమోదు జరిగిన 17 లక్షల మందికి మాత్రమే సీడింగ్ జరిపారు. ఇంకా లక్షా 24వేల మందికి ఆధార్ సీడింగ్ జరుగాల్సి ఉంది. 17లక్షల మందికి ఆధార్ సీడింగ్ ఎంతో స్పీడుగా జరిగింది కానీ ఇప్పుడు ఉండిపోయిన లక్షా 24వేల మందికి మాత్రం ఆలస్యంగా జరుగుతోంది. దీనికి కారణం ఇందులో సగానికి పైగా బోగస్ ఉన్నాయని అంటున్నారు. అందుకే ఆలస్యమవుతున్నాయనీ, కొన్ని డీలర్ల వద్ద, మరికొన్ని వలసలు, చనిపోయిన వారి పేరునా ఉన్నాయనీ అంటున్నారు. సీడింగ్ జరుగని లక్షా 24వేల యూనిట్లలో పింక్ కార్డులు, వలస పోయిన వారు సుమారు 50వేల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. మిగతా 74వేల యూనిట్లు బోగస్‌వేనని భావిస్తున్నారు. ఈ లెక్కన 74వేల మందికి నెలకు నాలుగు కిలోల బియ్యం చొప్పున లెక్కేస్తే 300 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతీ నెలా అక్రమార్కులకు చేరుతోంది. అయితే ఈ కార్డుల్లో ఇంకా బోగస్ ఉంటే ప్రతీ నెలా నష్టం మరింత ఎక్కుస్థాయిలో ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం కిలోకు రూ.26లు ఖర్చవుతున్నాయి. దీనిని రూపాయికి అందిస్తున్నా డీలర్లకు 20 పైసల కమిషన్ పోను 80 పైసలే ప్రభుత్వానికి చేరుతుంది. దీనిని బట్టి చూస్తే బోగస్ కార్డుల వల్ల ప్రభుత్వానికి ఎంత నష్ట వస్తుందో అర్ధమవుతుంది. -
ఏపీలో 30 లక్షల బోగస్ కార్డులు
హైదరాబాద్ : రాష్ట్రంలో 30 లక్షల బోగస్ కార్డులు ఉన్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. బోగస్ కార్డులతో ప్రభుత్వానికి రూ.వెయ్యికోట్లు మేర నష్టం వాటిల్లుతుందని ఆమె అన్నారు. డీలర్లు అందరూ తమ వద్ద ఉన్న బోగస్ కార్డులను ప్రభుత్వానికి అందచేయాలన్నారు. ప్రతి మండలంలో కిరోసిన్ బంక్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నట్లు సునీత తెలిపారు. ఈపీఎఫ్‌వో పథకాలకు గరిష్టంగా 6,500 నుంచి పెంచుతున్నట్లు చెప్పారు. -
7,850 బోగస్ కార్డులు రద్దు
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లావ్యాప్తంగా 7,850 బోగస్ రేషన్ కార్డులను రద్దు చేస్తూ.. జేసీ బి. రామారావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే గతంలో సరెండర్ చేసిన 19 వేల కార్డులను కూడా రద్దు చేశారు. జిల్లాలో గతంలో నిర్వహించిన 2, 3 రచ్చబండ సభల్లో రేషన్ కా ర్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు మొత్తం 56, 382 కార్డులు మంజూరు చేశారు. వీటిని పంపిణీ చేసేం దుకు అధికారులు గ్రామాల్లోకి వెళ్లగా కొన్నిచోట్ల లబ్ధిదారులు లేకపోవడంతో సుమారు 5 వేల కార్డులు మిగిలిపోయాయి. అలాగే ఇటీవల కూపన్లు అయిపోవడంతో కొత్తగా ఎన్టీఆర్ ప్రజా పంపిణీ కూపన్లను ప్ర భుత్వం పంపిణీ చేసింది. వీటిని కూడా పంపిణీ చేసేందుకు అధికారులు గ్రామాల్లోకి వెళ్లగా.. మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. దీంతో మొత్తం 56, 382 కార్డులకు గాను 48, 532 కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన 7850 కార్డులను అధికారులు వెనక్కి తీసుకువచ్చేశారు. ఇప్పుడు వాటన్నింటినీ రద్దు చేస్తున్నట్టు జేసీ ప్రక టించారు. కొందరు రాజకీయ నాయకులు గ్రామాల్లో లబ్ధిదారులు స్థానికంగా లేకపోరుునా తమ రాజకీయ పలుకుబడి తో కార్డులు మంజూరు చేయించుకున్నారు. అలాంటి వాటిని కూడా రద్దు చేస్తూ..ఆదేశాలు జారీ అయ్యూరుు. అలాగే గతం లో జిల్లాలో బోగస్ కార్డులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో జిల్లావ్యాప్తంగా సుమారు 19 వేల బోగస్ కార్డులను గుర్తించారు. అప్పట్లో వీటికి తక్షణమే సరుకులు నిలిపివేశారు. కానీ రికార్డుల్లో నుంచి తొలగించలేదు. ప్రస్తుతం వీటిని కూడా రద్దు చేశారు. ఆధార్ సీడింగ్ కోసమే... రేషన్‌కార్డులకు ఆధార్ తప్పనిసరి కావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నారుు. ఆధార్ అనుసంధానం కాకపోతే రేషన్ నిలిపివేస్తామని ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరిస్తుండడమే కాకుండా ఈ నెలాఖరుకు గడువు విధించడంతో అధికారులు ఇప్పుడు ఆధార్ అనుసంధానాన్ని వేగవంతం చేస్తున్నారు. దీంతో రికార్డుల్లో ఉన్న రేషన్‌కార్డుల్లో బోగస్ కార్డులను రద్దు చేస్తే అనుసంధానం చేసే సంఖ్య కూడా తగ్గి ముందు వరుసలోకి వస్తామన్నది వారి ఆలోచన. ఎప్పటికైనా ఈ కార్డులను రద్దు చేయూల్సిందే కనుక ఇప్పుడే రద్దు చేస్తే ఆధార్ అనుసంధాన ప్రక్రియలో సీడింగ్ శాతం కూడా మెరుగవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నా రు. ఈ మేరకు జేసీ జిల్లాలోని పంపిణీ కాని రచ్చబండ కార్డులను రద్దు చేసేందుకు తహశీల్దార్లకు ఆదేశాలు ఇవ్వాలని డీఎస్ఓ హెచ్వీ ప్రసాదరావును ఆదేశించారు. టెలికాన్ఫరెన్సు ద్వారా ఈ ఆదేశాలు అమలు కావాలన్నారు. -
'బోగస్ రేషన్ కార్టులను ఏరివేస్తాం'
పానాజీ: వేలాది బోగస్ రేషన్ కార్డులను ఎత్తివేయడానికి గోవా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డిజిటలైజేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత బోగస్ కార్టులను ఏరివేస్తామని గోవా పౌర సరఫరాల శాఖా మంత్రి దయానంద్ మండ్రేకర్ శాసనసభకు తెలిపారు. ఇప్పటికే రేషన్ కార్డుల డిజిటలైజేషన్ కార్యక్రమం కొనసాగుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వేలాది బోగస్ కార్డులు ఉన్నట్టు ప్రభుత్వానికి సమాచారం ఉందని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గోవా రాష్ట్రంలోని బర్డేజ్ తాలుకాలో 70 రేషన్ కార్డులకు గాను.. 44 వేల కార్టులను డిజిటలైజేషన్ పూర్తయిందని మంత్రి మండ్రేకర్ తెలిపారు. -
బోగస్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం
వీరఘట్టం: వీరఘట్టం మండలంలో ఉన్న బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ‘బియ్యం బొక్కుతున్న ‘తెల్ల’దొరలు’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో వచ్చిన కథనానికి రెవెన్యూ అధికారుల్లో చలనం వచ్చింది. జిల్లా అధికారుల నుంచి తహశీల్దార్ ఎం.వి.రమణకు వచ్చిన ఆదేశాల మేరకు బోగస్ కార్డుల ఏరివేతకు రెవెన్యూ సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మండలంలో అనర్హులకు రేషన్‌కార్డులు ఉన్న విషయాన్ని గుర్తించామని, ఇకపై మరింత వేగవంతంగా ఏరివేత కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అనర్హులకు రేషన్ కార్డులు ఉన్న విషయాన్ని ఎవరైనా గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకొస్తే వారి పేర్లును గోప్యంగా ఉంచడంతో పాటు అక్రమాలకు పాల్పడేవారిని శిక్షిస్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో పాటు అర్హత కలిగిన వారు ఉంటే రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని, ఇప్పటికే అర్హత లేక తెల్లరేషన్‌కార్డులు వినియోగిస్తున్న వారు స్వచ్ఛందంగా అప్పగిస్తే వారిని అభినందిస్తామంటున్నారు. -
అక్రమాల సరఫరా!
రేషన్ సరుకుల దోపిడీ సాక్షి, కర్నూలు : పేదల ఆకలి తీర్చాల్సిన సబ్సిడీ సరుకులు.. అక్రమార్కుల బొజ్జలు నింపుతున్నాయి. పేదల ఇళ్లకు చేరాల్సిన నిత్యావసర వస్తువులు.. బ్లాక్ మార్కెట్లో చిందులేస్తున్నాయి. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు, డీలర్లు కుమ్మక్కై సాగిస్తున్న అవినీతి పర్వంతో ఖజానా లూటీ అవుతోంది. పౌరసరఫరాల శాఖలో జరుగుతోన్న అవినీతిని చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. బోగస్ తెలుపు రేషన్‌కార్డుల పేరుతో జిల్లాలో జరిగిన అవినీతి లెక్కలు చూసినవారెవరికైనా కళ్లు బైర్లు కమ్ముతాయి. ఇప్పటి వరకు 3 లక్షలకుపైగా రేషన్‌కార్డులు బోగస్ అని తేలాయి. ఈ కార్డులపైనే రూ. 171.81 కోట్లు దుర్వినియోగం అయ్యాయి. రేషన్‌కార్డులను అడ్డం పెట్టుకొని జరగకూడని అక్రమాలన్నీ జరిగాయి. జిల్లాలో పౌరసరఫరాల శాఖ పరిధిలో చూస్తే.. 11,34,551 రేషన్‌కార్డులు ఉన్నాయి. 2,409 చౌక డిపోల ద్వారా ఈ కార్డులపై నిత్యావసర సరుకుల పంపిణీ సాగుతోంది. ఇటీవల రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం పేరిట బోగస్ కార్డుల ఏరివేతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఇప్పటి వరకు 3,19,751 బోగస్ రేషన్‌కార్డులు బయటికొచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరగడం ఖాయం. ఇంకా బయటికొచ్చే బోగస్‌కార్డుల సంగతి అటుంచితే.. ఈ మూడు లక్షల రేషన్‌కార్డులపై జరిగిన అవినీతి కోట్ల రూపాయల్లో ఉంది. ఏడాది కాలంగా ‘అమ్మహస్తం’ పథకం అమలవుతోంది. తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఈ పథకం కింద పంపిణీ చేస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా.. కేవలం పేదల బియ్యం, చక్కెర, కిరోసిన్‌పై జరిగిన నిధుల దుర్వినియోగం అక్షరాల రూ. 171.81 కోట్లు కావడం గమనార్హం. నేతల ప్రమేయంతో.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. అదే తరుణంలో కొత్తగా రేషన్ కార్డులను ఇవ్వడానికి దరఖాస్తులు సేకరిస్తారు. ఇదే తరుణంలో దళారులు రంగప్రవేశం చేసి తమ నేతల ద్వారా కార్డులను పొందడం పరిపాటే. గతంలో రూ. 24 వేల వరకు వార్షిక ఆదాయం ఉన్నవాళ్లకే తెల్లరేషన్ కార్డులను ఇచ్చే పరిస్థితులుండగా.. ఇప్పుడు రూ. 75 వేల వరకు పెంచారు. దీంతో పేద, గొప్ప తేడా లేకుండా ధనవంతులు, ఉద్యోగులు సైతం తెల్లరేషన్ కార్డులను పొందారు. ఖజానాపై రూ. కోట్ల భారం.. పేద ప్రజలకు కిలో బియ్యాన్ని రూపాయికి, కిలో చక్కెరను రూ. 13.50కు, లీటరు కిరోసిన్‌ను రూ. 15కు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అదే ప్రభుత్వం బియ్యాన్ని కిలోకి రూ. 21.69కు, చక్కెరను రూ. 21.50కు, కిరోసిన్‌ను రూ. 15కు కొనుగోలు చేస్తోంది. జిల్లాలో 3,19,751 బోగస్ రేషన్‌కార్డులపై ఏడాదికి 7,67,402 క్వింటాళ్ల బియ్యం(ఒక్కో కార్డుకు 20 కిలోల చొప్పున) పక్కదారి పట్టాయి. వాటి విలువ రూ. 158.77 కోట్లు కావడం గమనార్హం. అదే క్రమంలో 3,19,751 కార్డులపై నెలకు రెండు లీటర్ల చొప్పున 6,39,502 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేశారు. ఈ లెక్కన గడిచిన ఏడాదిలో 76,74,024 లీటర్ల కిరోసిన్ నల్లబజారుకు తరలిపోయింది. ఈ కిరోసిన్ విలువ రూ. 11.51 కోట్లు. ఇక ఇవే బోగస్ కార్డులపై నెలకు అర కిలో చొప్పున చక్కెర పంపిణీ చేశారు. నెలకు 1,59,875 కిలోల చొప్పున ఏడాదిలో 19,18,506 క్వింటాళ్ల చక్కెర పక్కదారి పట్టింది. దాని విలువ రూ. 1.53 కోట్లు కావడం గమనార్హం. కేవలం మూడు రకాల సబ్సిడీ సరుకులపైనే రూ. 171.81 కోట్ల అవినీతి జరిగింది. మార్కెట్ ధరలకు అనుగుణంగా లెక్క లేస్తే ఈ అవినీతి పర్వం రూ. 250 కోట్లు దాటుతుంది. పప్పు..తప్పు! సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎక్కడైనా.. ఏపనైనా ప్రభుత్వం తరఫున చేపడితే, వ్యయం లక్ష రూపాయలు దాటితే టెండరు వేయాలి. బహిరంగ టెండరు ద్వారా ఇవ్వాలి. అయితే కర్నూలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ కార్యాలయం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. టెండర్ లేకుండానే రూ.కోట్లు విలువ చేసే పప్పు దినుసులు సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు అప్పజెప్పింది. అంతే కాకుండా నాణ్యత లేని సరుకుకు మొదటి రకం క్వాలిటీ ధర చెల్లిస్తున్నారు. ఇదేమని అడిగితే పప్పు సరఫరా చేసే సంస్థ ప్రభుత్వానికి చెందిందని.. జీఓ ప్రకారం ఇస్తున్నామంటూ అధికారులు సమర్థించుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి కింద 3,476 అంగన్వాడీ కేంద్రాలు, 64 మినీ అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో 73,440 మంది పిల్లలు ఉన్నారు. వీరికి ప్రతి రోజూ ఒక్కొక్కరికి 15 గ్రాముల కందిపప్పు అవసరం. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు భోజనంలో కందిపప్పు అందించాలి. పిల్లలకు ఇచ్చే భోజనం కోసం బియ్యం ఒక చోట, నూనె మరో చోట, కందిపప్పు మరో చోట కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోళ్లు ఎక్కడైనా చేయవచ్చు కానీ.. నిత్యావసర సరకులు సరఫరా చేసేవారిని మాత్రం టెండరు ద్వారా నిర్ణయించుకోవాలి. అది కూడా రూ.లక్ష దాటితో ఖచ్చితంగా టెండరు వేయాలి. కానీ కర్నూలు స్త్రీ శిశు సంక్షేమశాఖ మాత్రం రూ.9 కోట్లు విలువ చేసే కందిపప్పును ఎటువంటి టెండరు లేకుండానే హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు కట్టబెట్టినట్లు అధికార వర్గాలు తెలిపారు. ఇవ్వటమే కాకుండా నాసిరకం కందిపప్పుకు మొదటి క్వాలిటీ ధరను చెల్లిస్తున్నట్లు వారు తెలియజేశారు. మూడో క్వాలిటీ రకం కందిపప్పు ధర మార్కెట్లో రూ.55 నుంచి రూ.60 మధ్యలో ఉంది. స్త్రీ శిశు సంక్షేమశాఖ మాత్రం రూ.69 చొప్పున ధర చెల్లిస్తుండటం గమనార్హం. ఇదేమని ఆ శాఖకు సంబంధించిన అధికారులను అడిగితే.. ఆ సంస్థ ప్రభుత్వానికి చెందినదేనని, నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతున్నారు. అయితే క్వాలిటీ, ధర విషయంలో మాత్రం సమాధానం దాటవేస్తున్నారు. జిల్లాలో పేరుకుపోయినా.. : జిల్లాలో విస్తారంగా కంది పంట సాగవుతోంది. ఏటా రైతులు వేలాది క్వింటాళ్ల దిగుబడులు సాధిస్తున్నారు. సరైన గిట్టుబాటు ధరలు లేక కంది పంట గోదాముల్లో మగ్గుతోంది. రైతులకు సగం ధర చెల్లించినా సంతోషంగా విక్రయించేవారు. అయితే అధికారులు అటువంటి ప్రయత్నాలేవీ చేయకుండా వేరే రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవటం తెలిసి జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ‘సరే’ అనుకోవచ్చు. విడిపోయి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్లుగా ఏర్పడ్డాయి. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కూడా హైదరాబాద్ నుంచి క్వాలిటీ లేని కందిపప్పును ఎందుకు తెప్పిస్తున్నట్లు? పాత సంస్థకే టెండర్ లేకుండా ఎందుకు ఇచ్చినట్లు? స్థానికంగా దాల్ మిల్లులు ఉన్నా వాటి విషయం పట్టించుకోకుండా సుమారు 200 కి.మీ దూరంలో ఉన్న హైదరాబాద్ నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నట్లు అర్థంకావడంలేదని, తెలంగాణ నుంచి కొనుగోలు చేయటంపై దాల్మిల్లు యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు ఆ సంస్థతో కుమ్మక్కై మామూళ్లకు తలొగ్గి ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో పండుతున్న కందిపప్పును కొనుగోలు చేస్తే రైతులకు.. ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. -
తెల్ల బోవాల్సిందే
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో మొత్తం 6లక్షల 81వేల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో ఆరు లక్షల పైచిలుకు తెల్ల రేషన్ కార్డులే! ఈ మొత్తం కార్డుల్లో బోగస్ కార్డులు లక్ష వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు రచ్చబండ-3లో 56,944 కార్డులు మంజూరు చేశారు. వీటికి కూపన్ల ద్వారా రేషన్ సరుకులు ఇస్తారు. ఈ కూపన్లను పంపిణీ చేసేందుకు గ్రామాల్లోకి వెళ్లిన అధికారులకు దిమ్మతిరిగినట్టయింది. ఎందుకంటే కార్డులు మంజూరైన వారిలో 8412 మంది గ్రామాల్లో లేరు. లేనివారికి కార్డులేమిటని ప్రశ్నిస్తే వలస వెళ్లారని, వస్తున్నారని గ్రామాల్లో ఉన్న నాయకులు చెప్పడంతో వాటిని మళ్లీ తీసుకువెళ్లినా అదే పరిస్థితి! దీంతో 56,944 కార్డులు మంజూరైనా 48,532 కార్డులకు మాత్రమే కూపన్లు పంపిణీ చేసి మిగతా కార్డుల కూపన్లను తీసుకు వచ్చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు చెల్లు! గతంలో రేషన్ కార్డులను తనిఖీలు చేసి బోగస్ కార్డులను గుర్తించి రద్దు చేసేందుకు సిఫారసు చేసినపుడు అధికారు లు రాజకీయంగా ఒత్తిళ్లను తీవ్రంగా ఎదుర్కొన్నారు. ఇప్పు డా పరిస్థితి ఉండదని అధికారులు భావిస్తున్నారు. బోగస్ రేషన్ కార్డులను గుర్తించేందుకు ఇప్పుడు ఆధార్ సీడింగ్ ఒక్కటే మార్గం! ఈ ప్రక్రియలో బోగస్ రేషన్ కార్డులు ఇప్పుడు గుర్తిస్తే ఉండే రాజకీయ ఒత్తిడి ఉండక పోవచ్చని భావిస్తున్నారు. సివిల్ సప్లైస్‌లో సరుకులను పొందుతున్న జిల్లాకు చెందిన పలువురు తెలుపు రేషన్ కార్డు దారులు బోగస్ కార్డులను కలిగి ఉన్నారు. జిల్లానుంచి వేలాది మంది ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఉన్నారు. అటువంటి వారు అక్కడ కూడా కార్డులు పొంది ఉన్నారు. ఇక్కడా వారికి కార్డులు ఉన్నాయి. ఇవి రాష్ట్రాల మధ్య ఉన్నప్పటికీ రేషన్‌కార్డులకు అనుసంధానం చేసే ఆధార్ కార్డు జాతీయ స్థాయిలో ఒకే సంఖ్య ఉంటుంది కనుక ఇటువంటివి కూడా రద్దయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విధానం అమలై ఒక కుటుంబం ఒకే రేషన్ కార్డు పొందడానికి మరికొన్ని నెలల సమయం పట్టవచ్చని అంటున్నారు. డీలర్లు, తాకట్టు వ్యాపారుల్లో గుబులు! జిల్లాలోని రేషన్‌కార్డుల్లో బోగస్ ఏరివేత జరుగుతుందని తెలిసి డీలర్లు, తాకట్టు దారులు అయోమయంలో పడ్డారు. తమ వద్ద ఇన్నాళ్లూ ఉన్న కార్డులు ఇక కనుమరుగు కానున్నాయని గుబులు చెందుతున్నారు. బోగస్ రేషన్ కార్డులు డీలర్ల వద్ద ఎక్కువగానే ఉన్నాయి. అదేవిధంగా మరికొన్ని గ్రామాలు, పట్టణాల్లో వ్యాపారుల వద్ద తాకట్టులో ఉన్నట్లు తెలుస్తోంది. బోగస్ ఏరివేత జరిగితే ఈ కార్డుల్లో చాలావరకూ రద్దవుతాయి. దీంతో ఇంతవరకూ వాటి ఫలితాన్ని అనుభవించిన వారికి ఇక ఆదాయం మరి రాదనే గుబులు పట్టుకుంది. -
‘బోగస్’పై సీరియస్
ముకరంపుర: సర్కారు సొమ్మును కాజేస్తున్న అక్రమార్కుల ఆటలు కట్టించి.. అర్హులకే సంక్షేమ ఫలాలు అందించేలా ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం బోగస్ రేషన్ కార్డులు, పింఛన్ల ప్రక్షాళన చేపడుతోంది. ఇరవై రోజులుగా రెండింటిని ప్రాధాన్యాంశాలుగా ఎంచుకుని ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 16,116 రేషన్‌కార్డులను బోగస్‌గా గుర్తించిన అధికారులు వాటిని రద్దు చేశారు. ఆధార్‌తో లింకు.. రేషన్‌కార్డులను ఆధార్ కార్డుతో లింకుపెట్టి బోగస్ చిట్టాను సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో డీలర్లను అప్రమత్తం చేసి ఒత్తిడి పెంచుతున్నారు. మండలాల వారీగా డీలర్లు ఎవరెన్ని కార్డులు అప్పగించారు? వాటిలో ఎన్ని యూనిట్లు రద్దయ్యాయి? అని ప్రతి రోజు పక్కాగా సమాచారం సేకరిస్తున్నారు. శుక్రవారం వరకు 16,116 బోగస్ కార్డులను రద్దు చేశారు. వీటిని రేషన్ డీలర్లతో పాటు లబ్ధిదారులు స్వచ్ఛందంగా తెచ్చి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. తద్వారా 1,33,889 యూనిట్లు తొలిగిపోయినట్లు లెక్క తేల్చారు. కార్డుల గుర్తింపునకు డీలర్లు ముందుకు రాకున్నా బినామీలు తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రాప్‌బాక్స్‌లో వేస్తున్నారు. డబుల్ కార్డులు ఉన్న 1,808 మంది తమంతట తాము సరెండర్ చేశారు. రేషన్‌డీలర్లు 14,308 కార్డులను అప్పగించినట్లు డీఎస్వో చంద్రప్రకాష్ పేర్కొన్నారు. అత్యధికంగా పెద్దపల్లి డివిజన్లో 4,987 కార్డులను సరెండర్ చేశారు. కరీంనగర్ డివిజన్లో 4,836, జగిత్యాలలో 3,334, సిరిసిల్లలో 2,408, మంథనిలో 1,661 బోగస్ కార్డులు అధికారులకు అప్పగించారు. బోగస్ పింఛన్లు.. పింఛన్ల పంపిణీలోనూ ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతున్నట్లు గుర్తించిన సర్కారు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 1,78,914 మంది వృద్ధులు, 94,567 మంది వితంతువులు, 64,855 మంది వికలాంగులు, 11,668 మంది చేనేత, 6,033 మంది గీతకార్మికులు, 40,846 మందికి అభయహస్తం పింఛన్లు ఉన్నాయి. మే వరకు 3,94,699 మంది పింఛన్లు పొందుతున్నారు. వీరి లో అనర్హులను గుర్తించేందుకు అధికారులు బయోమెట్రిక్ విధానం ద్వారా చేతివేళ్ల గుర్తులు, ఫొటోలు, ఆధార్ కార్డుతో అనుసంధానం తప్పనిసరి చేశారు. ఇవి సమర్పించని 27,056 మందికి జూన్‌లో అధికారులు నిలిపివేశారు. జూన్ నెలాఖరు వరకు 21,250 మంది ఎన్రోల్ చేసుకోవడంతో వారికి ఆగస్టు నుంచి పింఛన్లు అందనున్నాయి. మిగిలిన 5,806 మంది లబ్ధిదారులు స్పందించడం లేదు. వీరిలో చేతులు లేనివారు కొందరు ఉండడంతో వారు ఏం చేయాలో తెలియక సర్కారు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. మిగిలినవి బోగస్ పింఛన్లుగా భావిస్తున్నారు. -
బోగస్.. ఏరివేత వేగిరం
జిల్లాలో కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కొన్ని గ్రామాలలో 2011 జనాభా లెక్కల ప్రకారం నివాసం ఉన్న కుటుంబాల కంటే కూడా రేషన్ కార్డులు అధికంగా ఉన్నాయి. దీంతో అధికారులు దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. గ్రామ ప్రణాళికల సందర్భంగానే రేషన్ కార్డుల వివరాలు సేకరించి బోగస్ కార్డులను తొలగించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 8.38 లక్షల కుటుంబాలు ఉండగా 10.02 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కుటుంబాల కంటే 1.64 లక్షల రేషన్ కార్డులు అదనంగా ఉన్నాయి. మూడవ విడత రచ్చబండ కార్యక్రమంలో మరో 1.42 లక్షల కుటుంబాల వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. బోగస్ కార్డుల ఏరివేత ప్రక్రియ గ్రామ స్థాయి నుంచి ప్రారంభం కావడంతో రేషన్ కార్డుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. 83 శాతం ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి రేషన్ కార్డులతో ఆధార్ కార్డుల అనుసంధాన ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. సాధారణ ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియ ఆగిపోయినప్పటికీ తిరిగి ప్రారంభించారు. రేషన్ కార్డులలోని యూనిట్ల ఆధారంగా ఆధార్ కార్డులను అనుసంధానం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 32,49,226 మంది పేర్లు రేషన్ కార్డులలో ఉండగా ఇప్పటి వరకు 24,80,311 మందికి సంబంధించిన ఆధార్ కార్డులను (83 శాతం) సేకరించారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వ కార్డులు జిల్లాలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో త్వరలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే కార్డులు రానున్నాయి. అందుకు గాను ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది. గతంలో జారీ చేసిన రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోటోతో పాటు మూడు రంగుల గుర్తులు కూడా ఉన్నాయి. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన కార్డులు కావడం వల్ల వాటి స్థానంలో తెలంగాణ ప్రభుత్వ ముద్రతో కార్డులు అందజేయనున్నారు. ఆధార్‌కార్డుల అనుసంధానం ఆధారంగానే కొత్త కార్డులు జారీ చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా అయితే బోగస్ కార్డులు వచ్చే అవకాశాలు లేవని భావిస్తున్నారు. రేషన్ కార్డుల ఏరివేతలో సేకరిస్తున్న వివరాలు రేషన్ కార్డులు ఉండి చనిపోయిన కార్డుదారుల వివరాలు. నుంచి వెళ్లిన కుటుంబాల వివరాలు. ఒకే కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు. ఒకే కుటుంబంలో తెలుపు, గులాబీ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు. లో నివాసంలో లేకుండా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. 69 వేల బోగస్ రేషన్‌కార్డులను గుర్తించాం గుర్రంపోడు : ఆధార్ అనుసంధానం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 69 వేల బోగస్ రేషన్ యూనిట్లను గుర్తించినట్లు జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ తెలిపారు. గురువారం గుర్రంపోడు తహసీల్దార్ కార్యాయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బోగస్ రేషన్ కార్డుల గుర్తింపు చురుకుగా సాగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో రేషన్ కార్డులపై విచారణ జరుగుతుందన్నారు. యూనిట్ల వారీగా తనిఖీలు నిర్వహించి బోగస్ యూనిట్లను తొలగించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా యూనిట్ల వారీగా ఆధార్ అనుసంధాన పక్రియను వేగవంతం చేశామన్నారు. -
ఆపరేషన్
కలెక్టరేట్: బోగస్ రేషన్ కార్డులకు ఇక చెక్ పడనుందా? దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను రాయితీపై అందిస్తుంది. ఇందుకోసం జిల్లాలో దాదాపు 1,332 చౌకధరల దుకాణాలు. తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ ఇతర కార్డులు కలిపి దాదాపు ఏడు లక్షలకు పైగా ఉన్నాయి. వీటిలో సుమారు లక్ష వరకు బోగస్ కార్డులు ఉన్నట్లు అధికారు లు అంచనా వేశారు. జరగని కార్డుల విభజన జిల్లాలో రేషన్ దుకాణాల సంఖ్య పెరుగుతున్నా, కార్డుల విభజనకు మాత్రం రాజకీ య గ్రహణం చుట్టుకుంది. కార్టుల విభజ న ఎప్పుడు మెదలు పెట్టినా రాజకీయ ఒత్తి డి కారణంగా మధ్యలోనే నిలిచిపోతోంది. 2008, 2009లో ఈ ప్రక్రియను మొదలు పెట్టిన అధికారులు ఓ బడానేత, యూని యన్ నాయకుల ఒత్తిడి మేరకు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో కార్డులు తక్కువగా ఉన్న రేషన్ దుకాణాల వారికి నష్టం తప్పలేదు. నగరంలో ఇలా జిల్లా కేంద్రంలో 87 రేషన్ షాపులు ఉన్నాయి. ఇందు లో దాదాపు 25 దుకాణాల పరిధిలోనే వెయ్యి నుంచి ఐదు వేల కార్డుల వరకు ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి పౌరసరఫరాల కమిషనర్ నిబంధనల మేరకు ఒక్కో రేషన్ షాపులో, మున్సిపాలిటీ పరిధి అయితే 600 నుంచి 650, గ్రామీణ, మండల పరిధి అయితే 400 నుంచి 450 కార్డులు మాత్రమే ఉండాలి. నగరం లో చాలా దుకాణాలలో బోగస్ కార్డులతోపాటు, నిబంధనలకు మించిన కార్డులు ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ, రీ సైక్లింగ్ చేస్తూ అడ్డం గా దొరకిపోయిన సంఘటనలు ఇటీవల జిల్లాలో వెలుగు చూశాయి. అవి కూడా నిజామాబాద్ నగరానికి సంబంధించిన రేషన్ డీలర్ల బియ్యమే అని అధికారులు కూడా తేల్చారు. దీనిపై సీరియస్‌గా స్పం దించిన జేసీ, కమిషనర్‌కు లేఖ రాశారు. వెంటనే కార్డుల విభజన మొదలు పెట్టాలని, బోగస్ కార్డులను ఏరివేసి అర్హులకు కార్డులు అందించాలని అధికారులను ఆదేశించారు. పనిలో పనిగా ఎలాగూ ప్రస్తుతం కార్డులపై ‘డబ్ల్యూఏపీ’ అక్షరాలను తొలగించి, ఆ స్థానంలో డబ్ల్యూటీఎస్ను చేరుస్తున్నారు. పనిలో పనిగా కార్డుల విభజన చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాలో 62 వేల పాత గులాబీ కార్డులు, 40 వేల పింఛన్‌దారులు, మిగతా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మినిమం టైం స్కేల్ ఉద్యోగులను కలుపుకొని దాదాపు 30 వేల మంది, ఏపీఎల్ కుటుంబానికి చెందిన వారు మరో 25 వేల మంది వరకు ఉంటారు. ఇవన్నీ కలిపితే దాదాపు లక్షన్నర వరకు పింక్ కార్డులు ఉంటాయి. జిల్లాలో దాదాపు రెండు లక్షల వరకు కుటుంబాలు ఉంటాయి. కొన్ని కుటుంబాలలో లెక్కకు మించిన కార్డులు ఉన్నాయి. రేషన్ డీలర్లు మరో అడుగు ముం దుకేసి రచ్చబండలో ముందుగానే బినామీ పేర్లతో కార్డులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎక్కడ లేని విధంగా జిల్లాలో ఏడు లక్షల వరకు కార్డుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం నగరంలో 26 దుకాణాలు, జిల్లావ్యాప్తంగా మరో వంద రేషన్ షాపుల విభజనకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో జిల్లావ్యాప్తం గా మరో 150 వరకు రేషన్ షాపులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
'రేషన్' ఏరివేత
22 లక్షల బోగస్ కార్డుల రద్దు.. సీఎం సమీక్ష సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బోగస్ కార్డులను ఏరివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 లక్షల బోగస్ కార్డులు ఉన్నట్టు గుర్తిం చామని.. ఈ కార్డులను త్వరలోనే ఏరివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్డుల ఏరివేత సమయంలోనే తెలంగాణ రాష్ట్రం పేరుతో కొత్త రేషన్ కార్డులను కూడా ఇస్తామని తెలిపింది. బోగస్ కార్డుల్లో 7 లక్షలు తెలుపు రంగు, 15 లక్షల గులాబీ రంగు కార్డులు ఉన్నట్టు అంచనా వేశారు. బోగస్ కార్డుల ఏరివేత, కొత్త కార్డుల జారీ వంటి అంశాల పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథి, మేనేజింగ్ డెరైక్టర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. ఆధార్ వివరాలతో క్రోడీకరించి... తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కంటే రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం పేర్కొన్న విషయం తెలిసిందే. తద్వారా రేషన్ కార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే తన సంకల్పాన్ని కేసీఆర్ అప్పుడే పరోక్షంగా వెల్లడించారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. బోగస్ కార్డులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ఇంతకుముందు జారీ చేసిన కార్డులతో పాటు, నంబర్ మాత్రమే ఇచ్చి కార్డులను ఇవ్వకుండా రేషన్ సరుకులను (కూపన్లపై) ఇస్తున్న వారి విరాలను కూడా తీసుకున్నారు. రాష్ట్రంలోని కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంది. రేషన్ కార్డుల జారీ కోసం సేకరించిన ఐరిస్, వేలిముద్రలతో పాటు ఆధార్ కార్డుల జారీకి తీసుకున్న కుటుంబాల వివరాలను కూడా ప్రత్యేక సర్వర్ ద్వారా క్రోడీకరించారు. దాంతో బోగస్ కార్డులు ఎన్ని అనే విషయం తెలిసింది. ఆలాగే ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఎన్ని ఉన్నాయనే వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుల కోసం 83.59 లక్షల కుటుంబాలు అర్హమైనవిగా ఉంటే.. ప్రస్తుతం 91 లక్షల తెలుపు రంగు కార్డులు ఉన్నాయి. అంటే 7 లక్షలకు పైగా తెలుపు రంగు కార్డులు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే 15 లక్షల గులాబి రంగు కార్డులు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేశారు. ఇలా మొత్తం 22 లక్షల రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీటిని రద్దు చేయాలని శనివారం నాటి ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ బోగస్ కార్డులను తొలగించడంతో పాటు అన్ని రకాల కార్డులను కొత్తగా ముద్రించనున్నారు. బోగస్ కార్డులను సరెండర్ చేయాలి... రేషన్ షాపుల వద్ద ఉన్న బోగస్ కార్డులను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలా బోగస్ కార్డులను తమ వద్దే ఉంచుకుని రేషన్ సరకులను పక్కదారి పట్టించే డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు కూడా అప్రమత్తమై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాల వైఖరి కారణంగా ఇలా కుటుంబాల సంఖ్య కంటే కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందని, దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగడంతో పాటు ప్రభుత్వంపై భారం పడుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రేషన్ కార్డు.. రేషన్ సరుకులకే పరిమితం రేషన్ కార్డు కేవలం రేషన్ సరకుల పంపిణీకే ఉపయోగపడే విధంగా పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ కార్డులతో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పలు పథకాలు లింకు ఉంది. అయితే ఒక కార్డును ఒకే పధకానికి పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తసుకుంది. తద్వారా నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగటంతో పాటు ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఉన్నతాధికారులకు సూచించారు. -
లక్ష బోగస్ రేషన్‌కార్డులున్నాయ్
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా లక్ష బోగస్ తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్టు గుర్తించామని జాయింట్ కలెక్టర్ బసంత్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన బి.కొత్తకోటలోని పౌరసరఫరాల స్టాక్‌పాయింట్‌ను తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడో విడత రచ్చబండలో జిల్లాలో 45వేల రేషన్‌కార్డులను పంపిణీచేసామని, వీటిని కలుపుకుంటే మొత్తం 10,37,490 తెల్ల కార్డులున్నాయన్నారు. వీటన్నింటికీ అమ్మహస్తం సంచులు వచ్చాయని,అందులో లక్షమంది సంచులను తీసుకోలేదన్నారు. దీన్నిబట్టి లక్ష రేషన్‌కార్డులు బోగస్‌గా భావిస్తున్నామన్నారు. 28లక్షల రేషన్‌కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేశామని, మిగిలిన కార్డులకు ఆధార్సంఖ్య రాకుంటే వాటిని కూడా బోగస్కార్డులుగానే గుర్తిస్తామన్నారు. పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో సాహసక్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం కేటాయించనున్న మూడెకరాల భూమి విలువ రూ. 3కోట్లుగా నిర్ణయించనున్నామని చెప్పారు. దీన్నే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. పామాయిల్‌పై రాయితీని కేంద్రం ఉపసంహరించుకోవడంతో 975 మెట్రిక్‌టన్నుల పామాయిల్ జిల్లాకు రాలేదన్నారు. చౌక బియ్యం కర్ణాటకకు తరలిపోయి అక్కడ పాలిష్‌చేసిన బియ్యాన్నే రూ. 40కు విక్రయిస్తున్న విషయమై స్పందిస్తూ బి.కొత్తకోటలో కిలో రూ. 30కు సోనా మసూరి బియ్యం విక్రయించే కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆయన వెంట పౌరసరఫరాల డీఎం సత్యనారాయణరెడ్డి, తహశీల్దార్ వెంకటరమణారెడ్డి ఏఆర్ఐ శ్రీనివాసులురెడ్డి, సీఎస్‌డీటీ హరిప్రసాద్, గోదాము డీటీ భానుమూర్తి ఉన్నారు.