రేషన్ సరుకుల దోపిడీ
సాక్షి, కర్నూలు : పేదల ఆకలి తీర్చాల్సిన సబ్సిడీ సరుకులు.. అక్రమార్కుల బొజ్జలు నింపుతున్నాయి. పేదల ఇళ్లకు చేరాల్సిన నిత్యావసర వస్తువులు.. బ్లాక్ మార్కెట్లో చిందులేస్తున్నాయి. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు, డీలర్లు కుమ్మక్కై సాగిస్తున్న అవినీతి పర్వంతో ఖజానా లూటీ అవుతోంది. పౌరసరఫరాల శాఖలో జరుగుతోన్న అవినీతిని చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే.
బోగస్ తెలుపు రేషన్‌కార్డుల పేరుతో జిల్లాలో జరిగిన అవినీతి లెక్కలు చూసినవారెవరికైనా కళ్లు బైర్లు కమ్ముతాయి. ఇప్పటి వరకు 3 లక్షలకుపైగా రేషన్‌కార్డులు బోగస్ అని తేలాయి. ఈ కార్డులపైనే రూ. 171.81 కోట్లు దుర్వినియోగం అయ్యాయి. రేషన్‌కార్డులను అడ్డం పెట్టుకొని జరగకూడని అక్రమాలన్నీ జరిగాయి. జిల్లాలో పౌరసరఫరాల శాఖ పరిధిలో చూస్తే.. 11,34,551 రేషన్‌కార్డులు ఉన్నాయి. 2,409 చౌక డిపోల ద్వారా ఈ కార్డులపై నిత్యావసర సరుకుల పంపిణీ సాగుతోంది. ఇటీవల రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం పేరిట బోగస్ కార్డుల ఏరివేతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది.
దీంతో ఇప్పటి వరకు 3,19,751 బోగస్ రేషన్‌కార్డులు బయటికొచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరగడం ఖాయం. ఇంకా బయటికొచ్చే బోగస్‌కార్డుల సంగతి అటుంచితే.. ఈ మూడు లక్షల రేషన్‌కార్డులపై జరిగిన అవినీతి కోట్ల రూపాయల్లో ఉంది. ఏడాది కాలంగా ‘అమ్మహస్తం’ పథకం అమలవుతోంది. తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఈ పథకం కింద పంపిణీ చేస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా.. కేవలం పేదల బియ్యం, చక్కెర, కిరోసిన్‌పై జరిగిన నిధుల దుర్వినియోగం అక్షరాల రూ. 171.81 కోట్లు కావడం గమనార్హం.
నేతల ప్రమేయంతో..
ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. అదే తరుణంలో కొత్తగా రేషన్ కార్డులను ఇవ్వడానికి దరఖాస్తులు సేకరిస్తారు. ఇదే తరుణంలో దళారులు రంగప్రవేశం చేసి తమ నేతల ద్వారా కార్డులను పొందడం పరిపాటే. గతంలో రూ. 24 వేల వరకు వార్షిక ఆదాయం ఉన్నవాళ్లకే తెల్లరేషన్ కార్డులను ఇచ్చే పరిస్థితులుండగా.. ఇప్పుడు రూ. 75 వేల వరకు పెంచారు. దీంతో పేద, గొప్ప తేడా లేకుండా ధనవంతులు, ఉద్యోగులు సైతం తెల్లరేషన్ కార్డులను పొందారు.
ఖజానాపై రూ. కోట్ల భారం..
పేద ప్రజలకు కిలో బియ్యాన్ని రూపాయికి, కిలో చక్కెరను రూ. 13.50కు, లీటరు కిరోసిన్‌ను రూ. 15కు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అదే ప్రభుత్వం బియ్యాన్ని కిలోకి రూ. 21.69కు, చక్కెరను రూ. 21.50కు, కిరోసిన్‌ను రూ. 15కు కొనుగోలు చేస్తోంది. జిల్లాలో 3,19,751 బోగస్ రేషన్‌కార్డులపై ఏడాదికి 7,67,402 క్వింటాళ్ల బియ్యం(ఒక్కో కార్డుకు 20 కిలోల చొప్పున) పక్కదారి పట్టాయి. వాటి విలువ రూ. 158.77 కోట్లు కావడం గమనార్హం. అదే క్రమంలో 3,19,751 కార్డులపై నెలకు రెండు లీటర్ల చొప్పున 6,39,502 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేశారు.
ఈ లెక్కన గడిచిన ఏడాదిలో 76,74,024 లీటర్ల కిరోసిన్ నల్లబజారుకు తరలిపోయింది. ఈ కిరోసిన్ విలువ రూ. 11.51 కోట్లు. ఇక ఇవే బోగస్ కార్డులపై నెలకు అర కిలో చొప్పున చక్కెర పంపిణీ చేశారు. నెలకు 1,59,875 కిలోల చొప్పున ఏడాదిలో 19,18,506 క్వింటాళ్ల చక్కెర పక్కదారి పట్టింది. దాని విలువ రూ. 1.53 కోట్లు కావడం గమనార్హం. కేవలం మూడు రకాల సబ్సిడీ సరుకులపైనే రూ. 171.81 కోట్ల అవినీతి జరిగింది. మార్కెట్ ధరలకు అనుగుణంగా లెక్క లేస్తే ఈ అవినీతి పర్వం రూ. 250 కోట్లు దాటుతుంది.
పప్పు..తప్పు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎక్కడైనా.. ఏపనైనా ప్రభుత్వం తరఫున చేపడితే, వ్యయం లక్ష రూపాయలు దాటితే టెండరు వేయాలి. బహిరంగ టెండరు ద్వారా ఇవ్వాలి. అయితే కర్నూలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ కార్యాలయం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. టెండర్ లేకుండానే రూ.కోట్లు విలువ చేసే పప్పు దినుసులు సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు అప్పజెప్పింది. అంతే కాకుండా నాణ్యత లేని సరుకుకు మొదటి రకం క్వాలిటీ ధర చెల్లిస్తున్నారు. ఇదేమని అడిగితే పప్పు సరఫరా చేసే సంస్థ ప్రభుత్వానికి చెందిందని.. జీఓ ప్రకారం ఇస్తున్నామంటూ అధికారులు సమర్థించుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి.
వీటి కింద 3,476 అంగన్‌వాడీ కేంద్రాలు, 64 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో 73,440 మంది పిల్లలు ఉన్నారు. వీరికి ప్రతి రోజూ ఒక్కొక్కరికి 15 గ్రాముల కందిపప్పు అవసరం. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు భోజనంలో కందిపప్పు అందించాలి. పిల్లలకు ఇచ్చే భోజనం కోసం బియ్యం ఒక చోట, నూనె మరో చోట, కందిపప్పు మరో చోట కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోళ్లు ఎక్కడైనా చేయవచ్చు కానీ.. నిత్యావసర సరకులు సరఫరా చేసేవారిని మాత్రం టెండరు ద్వారా నిర్ణయించుకోవాలి. అది కూడా రూ.లక్ష దాటితో ఖచ్చితంగా టెండరు వేయాలి. కానీ కర్నూలు స్త్రీ శిశు సంక్షేమశాఖ మాత్రం రూ.9 కోట్లు విలువ చేసే కందిపప్పును ఎటువంటి టెండరు లేకుండానే హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు కట్టబెట్టినట్లు అధికార వర్గాలు తెలిపారు.
ఇవ్వటమే కాకుండా నాసిరకం కందిపప్పుకు మొదటి క్వాలిటీ ధరను చెల్లిస్తున్నట్లు వారు తెలియజేశారు. మూడో క్వాలిటీ రకం కందిపప్పు ధర మార్కెట్లో రూ.55 నుంచి రూ.60 మధ్యలో ఉంది. స్త్రీ శిశు సంక్షేమశాఖ మాత్రం రూ.69 చొప్పున ధర చెల్లిస్తుండటం గమనార్హం. ఇదేమని ఆ శాఖకు సంబంధించిన అధికారులను అడిగితే.. ఆ సంస్థ ప్రభుత్వానికి చెందినదేనని, నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతున్నారు. అయితే క్వాలిటీ, ధర విషయంలో మాత్రం సమాధానం దాటవేస్తున్నారు.
జిల్లాలో పేరుకుపోయినా.. : జిల్లాలో విస్తారంగా కంది పంట సాగవుతోంది. ఏటా రైతులు వేలాది క్వింటాళ్ల దిగుబడులు సాధిస్తున్నారు. సరైన గిట్టుబాటు ధరలు లేక కంది పంట గోదాముల్లో మగ్గుతోంది. రైతులకు సగం ధర చెల్లించినా సంతోషంగా విక్రయించేవారు. అయితే అధికారులు అటువంటి ప్రయత్నాలేవీ చేయకుండా వేరే రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవటం తెలిసి జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ‘సరే’ అనుకోవచ్చు. విడిపోయి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లుగా ఏర్పడ్డాయి.
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కూడా హైదరాబాద్ నుంచి క్వాలిటీ లేని కందిపప్పును ఎందుకు తెప్పిస్తున్నట్లు? పాత సంస్థకే టెండర్ లేకుండా ఎందుకు ఇచ్చినట్లు? స్థానికంగా దాల్ మిల్లులు ఉన్నా వాటి విషయం పట్టించుకోకుండా సుమారు 200 కి.మీ దూరంలో ఉన్న హైదరాబాద్ నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నట్లు అర్థంకావడంలేదని, తెలంగాణ నుంచి కొనుగోలు చేయటంపై దాల్‌మిల్లు యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు ఆ సంస్థతో కుమ్మక్కై మామూళ్లకు తలొగ్గి ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో పండుతున్న కందిపప్పును కొనుగోలు చేస్తే రైతులకు.. ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది.
అక్రమాల సరఫరా!
Published Sun, Aug 17 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM
Advertisement
Advertisement