విజయనగరం కంటోన్మెంట్ : ఆధార్‌తో బోగస్ కార్డులు బయటపడుతున్నాయి. జిల్లాలో బోగస్ రేషన్ కార్డులతో పాటు, చనిపోయిన, వలస వెళ్లిన వారితో పాటు రెండేసి కార్డులున్న వారికి బియ్యం కేటాయింపులు జరుగుతున్న భాగోతం వెలుగుచూస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇలా ప్రతి నెలా 300 మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా పంపిణీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ఆధార్ అనుసంధానం పూర్తయిన తరువాత ఎంత మేర బియ్యాన్ని బొక్కేస్తున్నారో బహిర్గతం కానుంది.
ఆధార్ అనుసంధానంతో అక్రమాల భాగోతం వెలుగులోకి వస్తుండడంతో ఆయా కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్న వారి గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆధార్ కార్డులున్న వారందరికీ సీడింగ్ జరగాలంటే ఇంకా సుమారు లక్షా 24వేల యూనిట్ల సీడింగ్ జరగాల్సి ఉంది. కానీ అన్ని కార్డులకూ జోరుగా జరిగినప్పటికీ ఈ లక్షా 24వేల యూనిట్ల వద్ద సీడింగ్ ఆలస్యమవుతోంది. దీంతో ఈ కార్డుల్లో చాలా వరకూ బోగస్‌వేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మొత్తం 23,85,607 మందికి పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రతీ నెలా నెలకు నాలుగు కిలోల చొప్పున బియ్యం సరఫరా అవుతున్నాయి.
కేవలం బియ్యం మాత్రమే ఇలా కుటుంబ సభ్యుల సంఖ్యననుసరించి కేటాయింపులు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా 5,91,569 లక్షల రేషన్ కార్డులకు 95,42,428 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అక్రమాలను అరికట్టేందుకు ఆధార్ సీడింగ్ తప్పనిసరిగా చేశారు. జిల్లాలోని 23,85,607 మంది తెల్ల రేషన్ కార్డుదారులకుగాను 18,24,000 మందికి మాత్రమే ఆధార్ నమోదు జరిగింది. వీరందరికీ ఆధార్ సీడింగ్ చేపట్టి నకిలీ లబ్ధిదారులను తొలగించాలని నిర్ణయించారు. ఆధార్ నమోదు జరిగిన 17 లక్షల మందికి మాత్రమే సీడింగ్ జరిపారు. ఇంకా లక్షా 24వేల మందికి ఆధార్ సీడింగ్ జరుగాల్సి ఉంది. 17లక్షల మందికి ఆధార్ సీడింగ్ ఎంతో స్పీడుగా జరిగింది కానీ ఇప్పుడు ఉండిపోయిన లక్షా 24వేల మందికి మాత్రం ఆలస్యంగా జరుగుతోంది.
దీనికి కారణం ఇందులో సగానికి పైగా బోగస్ ఉన్నాయని అంటున్నారు. అందుకే ఆలస్యమవుతున్నాయనీ, కొన్ని డీలర్ల వద్ద, మరికొన్ని వలసలు, చనిపోయిన వారి పేరునా ఉన్నాయనీ అంటున్నారు. సీడింగ్ జరుగని లక్షా 24వేల యూనిట్లలో పింక్ కార్డులు, వలస పోయిన వారు సుమారు 50వేల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. మిగతా 74వేల యూనిట్లు బోగస్‌వేనని భావిస్తున్నారు. ఈ లెక్కన 74వేల మందికి నెలకు నాలుగు కిలోల బియ్యం చొప్పున లెక్కేస్తే 300 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతీ నెలా అక్రమార్కులకు చేరుతోంది. అయితే ఈ కార్డుల్లో ఇంకా బోగస్ ఉంటే ప్రతీ నెలా నష్టం మరింత ఎక్కుస్థాయిలో ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం కిలోకు రూ.26లు ఖర్చవుతున్నాయి. దీనిని రూపాయికి అందిస్తున్నా డీలర్లకు 20 పైసల కమిషన్ పోను 80 పైసలే ప్రభుత్వానికి చేరుతుంది. దీనిని బట్టి చూస్తే బోగస్ కార్డుల వల్ల ప్రభుత్వానికి ఎంత నష్ట వస్తుందో అర్ధమవుతుంది.
రేషన్ అక్రమాలు
Published Sun, Sep 7 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement