
బోగస్.. ఏరివేత వేగిరం
జిల్లాలో కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కొన్ని గ్రామాలలో 2011 జనాభా లెక్కల ప్రకారం నివాసం ఉన్న కుటుంబాల కంటే కూడా రేషన్ కార్డులు అధికంగా ఉన్నాయి. దీంతో అధికారులు దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. గ్రామ ప్రణాళికల సందర్భంగానే రేషన్ కార్డుల వివరాలు సేకరించి బోగస్ కార్డులను తొలగించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 8.38 లక్షల కుటుంబాలు ఉండగా 10.02 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కుటుంబాల కంటే 1.64 లక్షల రేషన్ కార్డులు అదనంగా ఉన్నాయి. మూడవ విడత రచ్చబండ కార్యక్రమంలో మరో 1.42 లక్షల కుటుంబాల వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. బోగస్ కార్డుల ఏరివేత ప్రక్రియ గ్రామ స్థాయి నుంచి ప్రారంభం కావడంతో రేషన్ కార్డుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
83 శాతం ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి
రేషన్ కార్డులతో ఆధార్ కార్డుల అనుసంధాన ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. సాధారణ ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియ ఆగిపోయినప్పటికీ తిరిగి ప్రారంభించారు. రేషన్ కార్డులలోని యూనిట్ల ఆధారంగా ఆధార్ కార్డులను అనుసంధానం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 32,49,226 మంది పేర్లు రేషన్ కార్డులలో ఉండగా ఇప్పటి వరకు 24,80,311 మందికి సంబంధించిన ఆధార్ కార్డులను (83 శాతం) సేకరించారు.
త్వరలో తెలంగాణ
ప్రభుత్వ కార్డులు
జిల్లాలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో త్వరలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే కార్డులు రానున్నాయి. అందుకు గాను ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది. గతంలో జారీ చేసిన రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోటోతో పాటు మూడు రంగుల గుర్తులు కూడా ఉన్నాయి. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన కార్డులు కావడం వల్ల వాటి స్థానంలో తెలంగాణ ప్రభుత్వ ముద్రతో కార్డులు అందజేయనున్నారు. ఆధార్‌కార్డుల అనుసంధానం ఆధారంగానే కొత్త కార్డులు జారీ చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా అయితే బోగస్ కార్డులు వచ్చే అవకాశాలు లేవని భావిస్తున్నారు.
రేషన్ కార్డుల ఏరివేతలో
సేకరిస్తున్న వివరాలు
రేషన్ కార్డులు ఉండి చనిపోయిన కార్డుదారుల వివరాలు.
నుంచి వెళ్లిన కుటుంబాల వివరాలు.
ఒకే కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు.
ఒకే కుటుంబంలో తెలుపు, గులాబీ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు.
లో నివాసంలో లేకుండా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు.
69 వేల బోగస్ రేషన్‌కార్డులను గుర్తించాం
గుర్రంపోడు : ఆధార్ అనుసంధానం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 69 వేల బోగస్ రేషన్ యూనిట్లను గుర్తించినట్లు జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ తెలిపారు. గురువారం గుర్రంపోడు తహసీల్దార్ కార్యాయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బోగస్ రేషన్ కార్డుల గుర్తింపు చురుకుగా సాగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో రేషన్ కార్డులపై విచారణ జరుగుతుందన్నారు. యూనిట్ల వారీగా తనిఖీలు నిర్వహించి బోగస్ యూనిట్లను తొలగించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా యూనిట్ల వారీగా ఆధార్ అనుసంధాన పక్రియను వేగవంతం చేశామన్నారు.