లోక్‌సభ ఎన్నికల హడావిడిలో ఈ వార్త అంతగా దృష్టిలో పడలేదుగానీ, భద్రతా మండలిలో రెండేళ్ల కాలానికి పాకిస్తాన్ ఎన్నిక కావడం భారత్ పట్టించుకోవాల్సిన అంశమే. ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ‘ఓఐసీ’కి చెందిన ఐదు సభ్యదేశాలు భద్రతా మండలిలో ఉండటమూ పాక్‌కు కలిసొచ్చేదే. కశ్మీర్‌పై చర్చను తనకు అనుకూలంగా మార్చడానికి అది ప్రయత్నించవచ్చు.
ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆహార భద్రత ఐరాస ఎజెండాలో కీలకమైంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి దృఢమైన యంత్రాంగాలు ఉన్నప్పటికీ, పాక్ తన ఆహార భద్రతకు సంబంధించిన సమస్యగా ఈ అంశాన్ని చర్చలోకి తేగలదు. ఒక భారతీయుడిని ఐరాస నిర్వచించిన ఉగ్రవాది జాబితాలో చేర్చడానికి కూడా పాక్ ప్రయత్నించవచ్చు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోకి పాకిస్తాన్ ఇటీవల ఎన్నికైన విషయాన్ని, భారత్‌లో విస్తృతంగా నివేదించి ఉంటే, అది భారతీయులను కలవరపరిచి ఉండేది. భారత్ లోక్‌సభ ఎన్నికల్లో కూరుకుపోవడంతో, ఐక్యరాజ్య సమితి అత్యున్నత కమిటీలో పాకిస్తాన్ స్థానం గురించిన వార్తలకు దేశంలో పెద్దగా స్పందన లభించలేదు. ఐరాసలోని 193 సభ్య దేశాలలో 182 పాకిస్తా¯Œ కు అనుకూలంగా ఓటు వేసిన ఈ ఎన్నిక, మూడవ దఫా అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానానికి పెద్ద సవాలుగా మారనుంది.
2025 జనవరి 1న భద్రతామండలిలో రెండేళ్ల కాలానికి చేరనున్న పాకిస్తాన్, సోమాలియాల ఎంపికతో ఐక్యరాజ్యసమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థలో ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్’కు చెందిన ఐదు సభ్యదేశాలు ఉంటాయి. మొత్తం ప్రపంచం చట్టబద్ధంగా కట్టుబడి ఉండే నిర్ణయాలు చేసే ఏకైక ఐరాస సంస్థ అయిన భద్రతామండలి ఎన్నుకున్న సభ్యుల సంఖ్యలో ఇది సగం. అటువంటి నిర్ణయాలను మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వీటో ద్వారా తిరస్కరించవచ్చన్నది మరొక విషయం. ఈ సభ్యదేశాలనే పి–5 లేదా బిగ్ ఫైవ్ అంటారు.
ఇప్పుడు ఇస్లామాబాద్‌కు ఐరాస భద్రతామండలి తలుపులు తెరిచినంత మాత్రాన, భారత్ ఏదైనా దౌత్యపరమైన ముప్పును ఎదుర్కొంటుందని అర్థం కాదు. ప్రమాదం ఉండదు, కానీ సవాలు మాత్రం ఉంటుంది. అందువల్ల, భారత్ నిశ్చింతగా ఉండకూడదు. న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయంలో భారత శాశ్వత ప్రతినిధి పదవి ఖాళీగా ఉంది. పాకిస్తాన్ తరఫున గత ఐదేళ్లుగా ఈ పదవిని నిర్వహిస్తున్న మునీర్ అక్రమ్ ఒక ఘోరమైన రాయబారి. ఆయన అంతకుముందు కూడా 2002 నుండి ఆరేళ్ల పాటు అదే పదవిలో ఉన్నారు.
1994లో ఐరాస మానవ హక్కుల సంఘం ఎజెండాలో కశ్మీర్‌ను చేర్చడంలో అక్రమ్ రహస్య దౌత్యం దాదాపుగా విజయం సాధించింది. మరుసటి సంవత్సరం, ఆయన అధికారికంగా జెనీవాలో ఐరాస శాశ్వత ప్రతినిధిగా నియమితులవడమే కాకుండా ఏడేళ్లు ఈ పదవిలో కొనసాగారు. కాబట్టి, లోక్‌సభ ఎన్నికల ప్రచారం మధ్యలో పదవీ విరమణ చేసిన భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్థానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన భారత ప్రభుత్వం వెంటనే భర్తీచేయాలి.
వచ్చే ఏడాది ద్వైవార్షిక సమీక్ష కోసం కౌంటర్ టెర్రరిజం డాక్యుమెంట్ ఐక్యరాజ్యసమితి వద్దకు తిరిగి వస్తుంది. ఈ సమీక్షలోని పాఠం సరిహద్దు ఉగ్రవాద బాధితురాలిగా భారత్‌కు ముఖ్యమైనది. అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని రాజ్య విధాన సాధనంగా ఉపయోగించిన పాకిస్తాన్ వంటి మొండి రాజ్యాల కారణంగా, ఉగ్రవాదానికి విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నిర్వచనాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రూపొందించలేకపోయారు. అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఆ సమావేశంలో సోమాలియాది కూడా సందేహాస్పద వైఖరి కావడంతో, జనరల్ అసెంబ్లీపై ఈ రెండు దేశాల ప్రభావమూ పడుతుంది.
అదే సమయంలో భారత్ మరో ప్రమాదం నుంచి తనను కాపాడుకోవలసి ఉంది. ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ‘ఓఐసీ’కి చెందిన ఐదుగురు భద్రతా మండలి సభ్యులు ఒక భారతీయుడిని ఐక్యరాజ్యసమితి నిర్వచించిన ఉగ్రవాది జాబితాలో చేర్చడానికి కలిసి పని చేసే అవకాశం ఉంది. వాళ్లు కచ్చితంగా భద్రతా మండలి ప్రసిద్ధ తీర్మానం 1267 ప్రకారం, ఒక హిందువును ఉగ్రవాది జాబితాలో చేరడాన్ని చూడాలనుకుంటారు.
1999లో ఆమోదం పొందిన ఈ తీర్మానం ప్రకారం, ఉగ్రవాది జాబితాలో చేరిన అపఖ్యాతి ఒసామా బిన్ లాడెన్‌ది. న్యూఢిల్లీలోని హిందూ జాతీయవాద ప్రభుత్వం ఈ విషయంలో ఓఐసీకి మేత అవగలదనే చెప్పాలి. అయితే 2024లోనూ, వచ్చే ఏడాదిలోనూ మోదీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం భారత్‌లో ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఇది చాలావరకు ఆధారపడి ఉంటుంది.
1267 తీర్మానంతో ఏర్పాటు చేసిన ఆంక్షల కమిటీ ద్వారా అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ జాబితాలో చేర్చడంలో అమెరికాతో కలిసి పనిచేసిన భారత్ సఫలీకృతమైంది. ఆ ఘటన పాక్ రాయబారి అక్రమ్‌ను ఇప్పటికీ గాయపరుస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలకు మక్కీయే కారణమని ఆ తీర్మానం ఇచ్చిన వివరణ పాక్ బాధను మరింత పెంచింది. ఈ మక్కీ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు స్వయానా బావ.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసిన తర్వాత, భద్రతా మండలిలో పాకిస్తాన్ ‘సంప్రదింపులు’ మాత్రమే చేయగలిగింది. ఇటువంటి ప్రక్రియ మండలి సభ్యుల మధ్య అంతర్గత చర్చలను సూచిస్తుంది. ఈ చర్చల గురించి బహిరంగంగా ఎటువంటి రికార్డూ ఉండదు. ఇప్పుడు పాక్ భద్రతా మండలిలోకి ప్రవేశించిన తర్వాత, మిగతా ఓఐసీ సభ్యదేశాల మద్దతుతో కశ్మీర్‌పై చర్చను తనకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నించవచ్చు.
అవి ‘బహిరంగ సంప్రదింపుల’ ద్వారా జరిగే అవకాశం ఉంది. అంటే వాటి గురించి మీడియాకు, ప్రజలకు తెలియజేస్తారని అర్థం. సందర్భానుసారంగా ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్ కూడా ఆ చర్చల గురించి ప్రపంచానికి తెలియజేయవచ్చు. భారత్ దృక్కోణం నుండి ప్రమాదం ఏమిటంటే, ఇటువంటి జిత్తులు కొనసాగుతున్నప్పుడు కశ్మీర్ సమస్యపై ఐరాస పూర్తి దృష్టి పడుతుంది. అయినప్పటికీ భద్రతా మండలిలో వీటో కలిగివున్న పి–5 దేశాలపైనే ఏదైనా ఆధారపడి ఉంటుంది.
15 మంది సభ్యులతో కూడిన భద్రతామండలి పనికి ఆటంకం కలగకుండా గతంలో భారత్, పాక్ సహజీవనం చేశాయి. రెండు దేశాలూ చివరిసారిగా 2012లో కలిసి పనిచేశాయి. కానీ తర్వాతరెండు విషయాలు మారిపోయాయి. ఐరాసలో అప్పటి పాకిస్తాన్ మిషన్ కు ‘డాన్’ మీడియా గ్రూప్‌ను కలిగి ఉన్న హరూన్ కుటుంబానికి చెందిన హుస్సేన్ హరూన్ నాయకత్వం వహించారు. ఆయన చాలామంది పాకిస్తాన్ కెరీర్ దౌత్యవేత్తల మాదిరిగా కాకుండా భారత్‌కు వ్యతిరేకంగా ఎప్పుడూ నోరు జారలేదు. రెండవ మార్పు ఏమిటంటే, అప్పట్లో 2012లో ప్రపంచం చాలా భిన్నమైనదిగానూ, తక్కువ సంక్లిష్టమైనదిగానూ ఉండేది.
ఇటీవలి సంవత్సరాలలో ఐరాసలో దురదృష్టవశాత్తు ప్రత్యర్థులు, శత్రువుల మధ్య రహస్య, బహిరంగ ఘర్షణకు అవకాశాలు పెరిగాయి. అందువల్ల, భారత్‌తో తన ద్వైపాక్షిక సమస్యలను అంతర్జాతీయీకరించడానికి పాకిస్తాన్ కు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు, ముఖ్యంగా ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆహార భద్రత అనేది ఐరాస ఎజెండాలో కీలకంగా ఉంది. వివాదాలను పరిష్కరించడానికి సింధు జలాల ఒప్పందానికి సంబంధించి దృఢమైన యంత్రాంగాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ తన ఆహార భద్రతకు సంబంధించిన సమస్యగా ఈ అంశాన్ని గట్టిగా చర్చలోకి తీసుకురాగలదు.
వారు తమ కుతంత్రాలలో విజయం సాధించకపోవచ్చు కానీ ఇస్లామాబాద్ ప్రయత్నం చేయకుండా మాత్రం ఉండిపోదు. ఐరోపా పార్లమెంట్ ఎన్నికలలో యూరప్ మితవాదం వైపు దూసుకెళ్లిన తర్వాత, ఐరాస చర్చల్లో ఇస్లామోఫోబియా కూడా ఎక్కువగా ఉంటుంది. భద్రతా మండలిలో ఓఐసీ దౌత్యవేత్తల సంఖ్య పెరగడం వారికి దేవుడిచ్చిన వరం. ఐక్యరాజ్యసమితిలో తన ప్రయోజనాలను ముందుకు తీసుకురావడానికి పాకిస్తాన్ దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటుంది.
- వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
- కేపీ నాయర్
Comments
Please login to add a commentAdd a comment