భారత్పై పాక్ ఫిర్యాదులు..
Published Thu, Nov 24 2016 6:27 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
నియంత్రణ రేఖ వెంబడి తరుచూ జరుగుతున్న కాల్పులు... సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాకిస్తాన్, ఐక్యరాజ్యసమితి తలుపు తట్టింది. ఐక్యరాజ్యసమితిలోని పాకిస్తాన్ అంబాసిడర్ మలీహ లోధి, డిప్యూటీ యూఎన్ సెక్రటరీ జనరల్ జన్ ఎలియాస్సన్, చెఫ్ డి కేబినెట్ సెక్రటరీ జనరల్ ఎడ్మండ్ ములెట్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. ఈ పరిస్థితులు అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్ర ముప్పని ఆమె ఆరోపించారు.
ఐక్యరాజ్య సమితి అధికారులతో భేటీ అయిన ఆమె, భారతే నియంత్రణ రేఖ వెంబడి యుద్ధవాతావరణ పరిస్థితులు నెలకొల్పుతుందంటూ పేర్కొన్నారు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ అంతర్జాతీయ సమాజాన్ని దృష్టి మరలిస్తుందని ఆరోపించారు. దీనిపై ఐక్యరాజ్యసమితిలోని శాంతి కార్యకలాపాలు చూస్తున్న డిపార్ట్మెంట్, భారత్, పాకిస్తాన్లోని యూనైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్లకు ఆదేశాలు పంపింది. నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులను నిశితంగా గమనిస్తూ ఉండాలని ఆదేశిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలను నియంత్రించడానికి సహకరిస్తామని యూఎన్ పేర్కొంది.
ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సహమిస్తున్న పాకిస్తాన్, నియంత్రణరేఖ వెంబడి తరుచూ చొరబాటులకు ప్రయత్నిస్తూ కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. నిన్న కాక మొన్ననే ఎల్ఓసీ ప్రాంతంలో దాడి జరిపి ముగ్గురు భారత సైనికులను పాకిస్తాన్ ముష్కరుల పొట్టన పెట్టుకున్నారు. ఈ మెరుపుదాడిలో ఒకరి తలను కిరాతకంగా చంపేశారు కూడా. చేసేదంతా చేసి మళ్లీ నియంత్రణ రేఖ వెంబడి భారత్తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయంటూ పాకిస్తాన్ ముసలి కన్నీరు కారుస్తోంది.
Advertisement