అనర్హుల చేతిలో ‘అన్నపూర్ణ’!
సగానికిపైగా దుర్వినియోగం
ధనవంతులకూ ‘ఆహారభద్రత’
నిఘావర్గాల సర్వేలో తేలిన నిజాలు!
పేదలకే దక్కాల్సిన సంక్షేమ పథకా లు పక్కదారి పట్టాయి. అనాథలు, ఏ ఆసరా లేనివారికి దక్కాల్సిన అన్నపూర్ణ కార్డులు, నిరుపేదల అం త్యోదయ అన్నయోజన కార్డులు అనర్హుల చేతికి చేరాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే దక్కాల్సిన ఆహార భద్రత కార్డులు కోటీశ్వరులకూ అందాయి. అన్నపూర్ణ, అంత్యోదయ కార్డులకు సంబంధించి ఇటీవల నిఘా వర్గాలు నిర్వహించిన సర్వేలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూసినట్లు తెలిసింది. సగానికిగా అనర్హుల వద్దే ఉన్నట్లు సమాచారం. సాక్షి, కామారెడ్డి : ఏ ఆసరా లేని నిరుపేదలకు పట్టెడన్నం పెట్టేందుకు ప్రవేశపెట్టిన అన్నపూర్ణ పథకం అభాసుపాలవుతోంది. అనర్హులే ఎక్కువగా లబ్ధిపొందుతున్నారు. ఏ ఆసరా లేని వారికి అన్నపూర్ణ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్డు కలిగిన వారికి ఉచితంగా నెలకు 10 కిలోల బియ్యం ఇస్తారు. అయితే అనర్హులకు సైతం ఈ కార్డులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇటీవల నిఘా వర్గాల ద్వారా ఆరా తీసింది. కామారెడ్డి జిల్లాలో అన్నపూర్ణ కార్డులు 1,087 ఉన్నాయి. ఇందులో సగానికి పైగా అనర్హుల చేతిలో ఉన్నట్లు నిఘా వర్గాల సర్వేలో తేలినట్లు సమాచారం.
అంత్యోదయ కార్డులదీ అదేదారి
అంత్యోదయ కార్డుల ద్వారా నిరుపేద కుటుంబాలకు రూపాయికి కిలో చొప్పున 35 కిలోల బియ్యం ఇస్తారు. జిల్లాలో 16,425 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులు సైతం నిరుపేదలతోపాటు ఇతరులకూ అందాయని సర్వేలో తేలి నట్లు సమాచారం. సాధారణంగా ఆహార భద్రత కార్డుల ద్వా రా కుటుంబంలో ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల బియ్యం మాత్రమే ఇస్తారు. అంత్యోదయ కార్డులు ఉన్న వారికి మాత్రం కుటుంబ సభ్యుల సంఖ్యకు సంబందం లేకుండా 35 కిలోల బియ్యం ఇస్తారు. నిరుపేద కుటుంబాలకు ఈ పథకాలు వర్తిస్తాయి. కానీ రాజకీయ పార్టీల నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికార యంత్రాంగం అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తుండడం పరిపాటిగా మారింది.
కోటీశ్వరులకూ ‘ఆహార భద్రత’
జిల్లాలో 2,28,527 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. దారి ద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఈ కార్డులు ఇవ్వాల్సి ఉం టుంది. అయితే ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండి, ఆదాయ పు పన్ను చెల్లించేవారికి సైతం ఆహార భద్రత కార్డులు అం దాయి. పెద్దపెద్ద బంగళాలు ఉండి, కార్లలో తిరిగే కోటీశ్వరులు సైతం ఈ కార్డులు పొందారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు ఉంటే చర్య లు తీసుకుంటామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించడంతో చాలా మంది తమ కార్డులను వెనక్కు ఇచ్చేశారు. ఇంకా చాలా మంది అనర్హుల వద్ద ఆహార భద్రత కార్డులున్నాయి.
జిల్లా యంత్రాంగంపైనే భారం
అనాథలు, అత్యంత నిరుపేదలకు చెందాల్సిన అన్నపూర్ణ, అంత్యోదయ కార్డులు అనర్హుల చేతుల్లో చిక్కిన వైనం వెలుగులోకి వస్తున్నందున జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిం చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు పేదల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు వారికే చెందేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి సారించాల్సి ఉంది.