బినామీలే!
సగం రేషన్ షాపులు బినామీల చేతుల్లోనే..
ఏళ్లుగా ఇదే వ్యవహారం
కామారెడ్డి :జిల్లాలో 575 రేషన్ షాపుల పరిధిలో 2,28,260 ఆహారభద్రత కార్డులు, 16,419 అంత్యోదయ కార్డులు, 1,090 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. నెలలో పక్షం రోజుల పాటు రేషన్ సరకులు సరఫరా చేయాల్సిన డీలర్లు.. కొన్ని చోట్ల రెండు, మూడు రోజులు మాత్రమే దుకాణాలను తెరుస్తున్నారని తెలుస్తోంది. జిల్లాలో 575 రేషన్ షాపుల్లో దాదాపు సగం దుకాణాలు బినామీల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయని తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో సగానికిపైగా షాపులను బినామీలే నిర్వహిస్తున్నారు. రేషన్ డీలర్లుగా స్థిరపడిన కొందరు.. అధికారులతో కుమ్మక్కై ఒక్కొక్కరు నాలుగైదు రేషన్ షాపుల బాధ్యతలు చూస్తున్నారు. వీరు అసలు డీలర్లకు ఎంతోకొంత కమీషన్ ఇచ్చి ఆయా షాప్‌లను తమ గుత్తాధిపత్యంలోకి తీసుకుంటున్నారు. ఏదైనా కేసుల్లో ఇరుక్కుని డీలర్లు సస్పెండ్ అయితే.. వాటిని కూడా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు.
జిల్లా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారులతో పాటు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని తమ బినామీ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. చాలా రేషన్ షాపులు మహిళల పేరిట ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ కూతుళ్ల పేరిట రేషన్ షాప్ అనుమతులు పొందినవారు.. కూతుళ్ల వివాహమయ్యాక కూడా ఆ షాప్‌లను తమ అధీనంలోనే ఉంచుకుని బినామీ డీలర్లుగా కొనసాగుతున్నారు.
దారిమళ్లుతున్న సరకులు
బినామీ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేదలకు అందాల్సిన రేషన్ సరకులను నల్లబజారుకు తరలిస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో బినామీ డీలర్ల హవా కొనసాగుతోంది. ఒక్కొక్కరు రెండు, మూడు షాపులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సరకులను రవాణా చేస్తున్నారు. బినామీ డీలర్లు అసలు డీలర్లకు నెలనెలా రూ. 3 వేల నుంచి రూ. 6 వేల దాకా కమీషన్ ఇస్తున్నారని తెలిసింది. అలాగే అధికారులకు మామూళ్లు ఇస్తూ బినామీ డీలర్లుగా తమ అక్రమాలు కొనసాగిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
రేషన్ షాప్ ఎవరి పేరిట ఉందో వారే నిర్వహించాలి. బినామీలతో నిర్వహిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని షాపులపై చర్యలు తీసుకున్నాం. రేషన్ సరకులను లబ్ధిదారులకు అందించకుండా నల్లబజారుకు తరలిస్తే లైసెన్సులు రద్దు చేస్తాం. బినామీ షాపుల గురించి వివరాలు సేకరిస్తున్నాం. త్వరలోనే చర్యలు తీసుకుంటాం.
– రమేశ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, కామారెడ్డి