రేషన్ బొక్కేశారు!
డీలర్లు, అధికారుల మాయాజాలం
జనాభా కంటే అధికంగా బియ్యం యూనిట్ల పంపిణీ
ఒక్కో డీలర్‌కు 50 నుంచి 100 క్వింటాళ్లు అదనం
అభాసుపాలవుతున్న ‘ఆహారభద్రత’
పరిగి : అవినీతిపై యుద్ధం చేద్దామంటోంది ప్రభుత్వం. ఎవరైనా అధికారి చేయిచాపితే ఫోన్ చేయండంటూ టోల్‌ఫ్రీ నంబర్లు సైతం ఇచ్చేస్తోంది. ప్రభుత్వం ఇంత హడావుడి చేస్తున్నా.. కిందిస్థాయి సిబ్బందిలో మాత్రం ఇసుమంత మార్పు కూడా కన్పించడం లేదు. ముఖ్యంగా రేషన్ పంపిణీలో అందినకాడికి బొక్కేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఆహారభద్రత పథకంలో భాగంగా పంపిణీచేసిన రేషన్‌లో భారీ కుంభకోణమే జరిగింది. అంతా కూడబలుక్కుని వేల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారు.
పరిగి నియోజకవర్గంలో ఒక్కో డీలర్‌కు 50 నుంచి 100 క్వింటాళ్ల బియ్యం వరకు ఎక్కువగా పంపిణీ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అధికారుల అండదండలతోనే డీలర్లు ఈ కుంభకోణానికి తెరతీసినట్లు స్పష్టమవుతోంది. ఆహార భద్రత కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తుల్లో మండలాలవారీగా 30 నుంచి 40 శాతం వరకు విచారణలో తొలగించినట్లు చూపిస్తున్న అధికారులు.. పంపిణీ చేసిన బియ్యం యూనిట్లు మాత్రం ఆ మండల జనాభా కంటే ఎక్కువ ఉన్నాయి. ఇదే రేషన్ బియ్యం బొక్కేశారనేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. పథకం ప్రారంభ నెలలోనే ఈ తంతు జరిగితే ఇక మున్ముందు పరిస్థితేంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
60 వేల యూనిట్లు అదనంగా పంపిణీ
పరిగి నియోజకవర్గంలో 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 2,96,750. గత నాలుగేళ్లుగా మరో 40వేల జనాభా పెరిగి ఉంటుందని అంచనా. ఆహార భద్రత కార్డులకోసం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించడంతో.. తమకు ఎలాగూ కార్డులు రావని ఐదు శాతం మంది దరఖాస్తులు చేసుకోలేదు. వచ్చిన దరఖాస్తుల్లోంచి 35 నుంచి 40 శాతం వరకు విచారణలో అధికారులు తొలగించారు. దీంతో సరాసరిగా జనాభాలో 60 నుంచి 70 శాతం మందికి బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. చివరకు 35 శాతం మంది దరఖాస్తులు కట్ చేసినట్లు భావించినా నియోజకవర్గంలో 90 వేల యూనిట్లకు బియ్యం కట్ అవుతుంది.
ఈ లెక్కన 2.5 లక్షల మందికి బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు జనవరిలో ఏకంగా 3,06,627 యూనిట్లకు బియ్యం పంపిణీ చేశారు. ఈ లెక్కన సుమారుగా 55 వేల నుంచి 60 వేల యూనిట్ల బియ్యం అదనంగా సరఫరా చేశారని స్పష్టమవుతోంది. అంటే 3,600 క్వింటాళ్ల బియ్యం అదనంగా సరఫరా అయిందన్నమాట. ఈ లెక్కన రూ.2వేల క్వింటాళ్లు అయినా.. మొత్తం రూ.72 లక్షల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఒక్క పరిగి మండలంలో మాత్రమే జనాభా కంటే తక్కువ యూనిట్ల బియ్యం సరఫరా చేయగా.. మిగతా అన్ని మండలాల్లో జనాభా కంటే అధిక యూనిట్ల బియ్యం పంపిణీ చేసినట్టు ఉండడం గమనార్హం.
మండలాల వారీగా పంపిణీ చేసిన బియ్యం..
మండలం జనాభా పంపిణీ చేసిన బియ్యం (క్వింటాళ్లలో) యూనిట్లు..
పరిగి 62,984 3,566 59,207
దోమ 48,224 3,255 54,250
కుల్కచర్ల 70,281 4,319 71,569
పూడూరు 44,884 3,012 48,153
గండేడ్ 70,377 5,205 73,448
మొత్తం 2,96,750 19,357 3,06,627