
ఫిలింనగర్ నుంచి గచ్చిబౌలి మధ్యలో..
సాక్షి,వీకెండ్: ఇన్నేళ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఆహారం, ఆరోగ్య భద్రత, న్యాయం, చదువు... ప్రతి వారికి ఇవి అందుతున్నాయా.? అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు సంతృప్తితో కూడిన సమాధానం రావడం కష్టమే. ఆరోగ్యం అనేది ఇప్పటికీ చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రజలకు ఏ రోగం వచ్చినా ఫర్వాలేకుండా పోయింది. మనకు భద్రత ఉందనే భరోసా ఎంత మాత్రం లేదు. అలాగే ఇంకా ఆహారం కోసం అల్లాడుతున్న వాళ్లు దేశంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇక విద్య సైతం ఎంతో మందికి అందని ద్రాక్షే. కావాల్సింది దొరకనప్పుడు దొరికిన దానితో సంతృప్తి పడడానికి అలవాటు పడిపోతాం.
కానీ మనం నిజంగా తృప్తిగా ఉన్నామా? అని మనల్ని మనం ప్రశ్నించుకొని, ప్రశ్నించడం మొదలుపెడితే పరిస్థితులు మారుతాయి అంటారు యంగ్ ఆర్టిస్ట్‌లు స్వాతి, విజయ్. మనలో ఆత్మ పరిశీలనకు ఇలాంటి ప్రశ్నలు రాజేయడానికి, తమ ఆలోచనను అందరిలో కలిగించడానికి వీరి చిరు ప్రయత్నం ఈ పెయింట్ వర్క్. తెల్లవారుజామున దాదాపు 5 గంటలు శ్రమపడి తమ ఆలోచనలు నలుగురికి తెలిసేలా ఇలా రోడ్డుపై చిత్రించారు. ఫిలింనగర్ నుంచి గచ్చిబౌలి మధ్యలో 80 అడుగుల రోడ్డుపై ఉన్న ఈ రైటింగ్స్ సిటీలోనే అతిపెద్ద స్ట్రీట్ ఆర్ట్ రైటింగ్.
– ఓ మధు