
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ బెంజ్ కారులో ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. ఓవర్ స్పీడ్‌లో చెట్టును ఢీకొట్టింది. తర్వాత కారు కంట్రోల్ అవ్వకపోవడంతో ఎలక్ట్రికల్ పోల్, గోడను ఢీ కొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. కారు రెండు టైర్లు విడిపోయి.. కొంత దూరంలో ఎగిరి పడ్డాయి.
అయితే కారును అక్కడే వదిలేసిన యువతి.. తన హై హీల్స్ భుజాన వేసుకుని సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కాగా ప్రమాద స్థలంలో గుడిసెలో ఓ వాచ్ మెన్ కుటుంబం నివాసముంటోంది. గుడిసెకు అడుగుదూరంలో కారు ఆగడంతో సదరు కుటుంబం ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.
ఈ ఘటనలో కరెంట్ స్తంభం, గోడ కూలిపోయాయి. అంతా మట్టి,రాళ్లు గుట్టలుగా పేరుకుపోవడంతో గోడకు తగిలి కారు అయిపోయింది. లేదంటే నేరుగా ఎదురుగా గుడిసెలోకి దూసుకెళ్లేదని స్థానికులు అంటున్నారు. కారు అదే స్పీడ్‌లో వెళ్ళి ఉంటే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని చెబుతున్నారు.
దీనిపై సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నెంబర్ ప్లేట్ ఆధారంగా మహిళను గుర్తించే పనిలో పడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: కనురెప్ప కంటే తక్కువ బరువు.. వర్షానికి వాసన ఉంటుందా?
Comments
Please login to add a commentAdd a comment