![Food Insecurity Rising And Coronavirus Exacerbate The Situation - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/21/hunger.jpg.webp?itok=5qwt0WiX)
పారిస్: మహమ్మారి కరోనా కంటే ముందే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది జనం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితి మంగళవారం వెల్లడించింది. 55 దేశాల్లోని 135 మిలియన్ల (13.5 కోట్లు) ప్రజలు తిండి దొరక్క అల్లాడుతున్నారని తమ ‘గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్’ నివేదిక తెలిపిందని పేర్కొంది. నిత్యావసరాలకు నోచుకోక అవస్థలు పడుతున్న బీదబిక్కిపై కోవిడ్ రక్కసి మరింత తీవ్ర ప్రభావం చూపుతుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. క్రితం ఏడాది 50 దేశాల్లో 123 మిలియన్ల మంది ఆహార సంక్షోభంలో కూరుకుపోతే.. తాజా రిపోర్టులో ఆ సంఖ్య.. మరో 10 శాతం పెరిగి 135 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. సామాజిక విబేధాలు, ఆర్థిక వృద్ధి క్షీణించడం, కరువు వంటి వాతావరణ సంబంధిత సంఘటనలు ఈ పెరుగుదలకు కారణాలని రిపోర్టు వివరించింది.
(చదవండి: వాట్సాప్ యూజర్లకు శుభవార్త)
పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో 183 మిలియన్ల మంది ఆహార సంక్షోభం ఎదుర్కొంటారని అంచనా వేసింది. కరోనా విజృంభణకు పూర్వం డేటా ప్రకారమే ప్రస్తుత రిపోర్టు తయారు చేశామని.. కోవిడ్-19తో పరిస్థితులు మరింత దారుణం కానున్నాయని రిపోర్టు రచయితలు పేర్కొన్నారు. ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా కింది స్థాయిలో ఉన్నవారు కోవిడ్ బాధితులుగా మారితే.. నష్టం ఎక్కువగా ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ సమాజం సమన్వయం చేసుకుని.. త్వరితగతిన చర్యలు చేపట్టి ఆహార సంక్షోభం నుంచి బయటపడేందుకు పేదలకు తోడుగా నిలవాలని తెలిపారు. కాగా, ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రతియేడు ‘గ్లోబల్ రిపోర్టు ఆన్ ఫుడ్ క్రైసిస్’ నివేదిక రూపొందిస్తాయి.
(చదవండి: కరోనా : అమ్మా! మీ సేవకు సలాం)
Comments
Please login to add a commentAdd a comment