సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆహార భద్రత పథకం అమలుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించడంలో కొంత జాప్యం జరగడంతో గ్రామీణ ప్రాంతంలోనే ఆహార భద్రత అమలు చేయాలని జిల్లా యంత్రాంగం తొలుత భావించింది. కానీ దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి ప్రక్రియను వేగిరం చేసిన అధికారగణం.. ఇప్పటికే 89శాతం దరఖాస్తులు పూర్తిచేయగా.. మరో వారంరోజుల్లో మిగతా దరఖాస్తులన్నీ పరిశీలించి లబ్ధిదారులకు సరుకులు ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది.
దీంతో వచ్చే నెల నుంచి జిల్లాలో అటు పట్టణ ప్రాంతం, ఇటు గ్రామీణ ప్రాంతంలో అర్హులందరికీ ఆహార భద్రత కింద సరుకులు అందనున్నాయి.ఆహార భద్రత పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం ఆరు కిలోల బియ్యం సరఫరా చేయనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కీ రిజిస్టర్లు తయారు చేసి సంబంధిత డీలర్లకు చేరవేసింది. జిల్లా వ్యాప్తంగా 13.74లక్షల దరఖాస్తులు రాగా.. ఇందులో 12.23 లక్షల దరఖాస్తులు పరిశీలించారు. వీరిలో 10.27లక్షల మంది అర్హులను గుర్తించి.. వారికి ఆహార భద్రత సరుకుల పంపిణీకి గాను కోటాను రేషన్ డీలర్లకు చేరవేస్తున్నారు.
ఈ ప్రక్రియ ఒకటో తేదీలోగా పూర్తి చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు పరిశీలన పెండింగ్‌లో ఉన్న వాటిలో అర్హతను అంచనావేసి వారికి సంబంధించిన కోటాను సైతం డీలర్లకు పంపే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జిల్లాకు జనవరి నెలకు ప్రభుత్వం 24 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ డీలర్లకు విడుదల చేసింది.
వారం రోజుల్లో పరిశీలన పూర్తి
జిల్లాలో గ్రామీణ ప్రాంతాలైన వికారాబాద్, చేవెళ్ల, సరూర్‌నగర్ డివిజన్లలో ఆహార భద్రత కార్డులకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల ప్రక్రియ దాదాపు పూర్తయింది. అయితే గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్భాగమైన రాజేంద్రగనర్, మల్కాజిగిరి డివిజన్లలో పరిశీలన పెండింగ్‌లో ఉంది.
ఈ దరఖాస్తులన్నీ వారం రోజుల్లో పూర్తిచేసేలా పౌరసరఫరాల అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే కీ రిజిస్టర్లు తయారై, రేషన్ డీలర్లకు అందించినప్పటికీ.. మిగతా పరిశీలన పూర్తి చేసిన తర్వాత జనవరి మూడోతేదీ కల్లా మలివిడత కీ రిజిస్టర్లు తయారుచేసి రేషన్ డీలర్లకు అందిస్తామని, దీంతో మలివిడత కీ రిజిస్టర్ల ఆధారంగా సరుకులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నర్సింహారెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
చకచకా ఆహార భద్రత
Published Sat, Dec 27 2014 11:33 PM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement
Advertisement