సాక్షి, హైదరాబాద్: సామాజిక భద్రతా పింఛన్లు, ఆహారభద్రత కార్డులు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఆయా పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఆదాయ పరిమితులను పెంచుతూ ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటనతో క్షేత్రస్థాయిలో అధికారులు అయోమయంలో పడ్డారు. గతంలో ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల మేరకు పింఛన్లు, ఆహార భద్రతాకార్డు పొందాలంటే.. రెండున్నర ఎకరాల్లోపు తరి(మాగాణి) లేదా ఐదెకరాల్లోపు మెట్టభూమి ఉన్నవారే అర్హులని పేర్కొంది. కుటుంబ వార్షికాదాయం గ్రామ ప్రాంతాల్లోనైతే ఏడాదికి రూ.60వేలు, పట్టణ ప్రాంతాల్లోనైతే రూ.75వేలుగా నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారెవరైనా దరఖాస్తుకు అర్హులు కాదని కూడా స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అందిన దరఖాస్తుల్లో 60 శాతం దర ఖాస్తులను అధికారులు పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. మార్గదర్శకాల్లోని పరిమితుల కన్నా ఎక్కువ భూమిగానీ, ఆదాయంగానీ ఉన్న దరఖాస్తులను పక్కనబెట్టేశారు. అయితే, ప్రభుత్వం తాజాగా, అర్హతలను, ఆదాయ పరిమితిని మార్చింది. తాజా మార్గదర్శకాల మేరకు గ్రామాల్లో 3.75 ఎకరాల్లోపు మాగాణి, ఏడు ఎకరాల్లోపు మెట్టభూమి ఉన్నవాళ్లందరినీ అర్హులుగా చేసింది. ఆదాయ పరిమితి గ్రామాల్లో రూ.1.5లక్షలుగా, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంతోమంది సన్న, చిన్నకారు రైతులతో పాటు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న చిరుద్యోగులు కూడా అర్హులవుతారు. అనర్హులుగా భావించి పక్కనబెట్టిన ఎంతోమందికి తాజా పరిమితుల మేరకు అర్హత లభిస్తుంది. అలాగే తమకు అర్హతలేదని గతంలో దరఖాస్తు చేయని వారి నుంచి మళ్లీ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలను కొత్తగా మొదలెట్టాలి. ఇప్పటికే నానా అవస్థలు పడుతున్న అధికారులు, మళ్లీ దరఖాస్తులు కష్టమేనంటున్నారు.
నేడు స్పష్టత వచ్చే అవకాశం
ఆహారభద్రతా కార్డులు, పింఛన్ల మంజూ రుకు ప్రభుత్వం తాజాగా పెంచిన ఆదాయ పరిమితులతో మళ్లీ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దరఖాస్తుల పరిశీలనను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. పరిశీలన పూర్తయిన దరఖాస్తుల్లో అనర్హులుగా పేర్కొని పక్కన పెట్టిన వారి వివరాలు కూడా ఉన్నందున, తాజాగా లబ్ధిదారులను ఎంపిక చేయడం సమస్య కాదు. దర ఖాస్తు చేసేందుకు కొత్తవారికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
- సెర్ప్ సీఈవో మురళి