రోమ్: ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఉన్నచోట సాయమందించే ఈ కార్యక్రమం రోమ్ కేంద్రంగా పనిచేస్తోంది. గత ఏడాది ప్రపంచ ఆహార కార్యక్రమం దాదాపు 88 దేశాల్లోని పది కోట్ల మందికి ఆసరా కల్పించింది. ‘ఆకలి బాధలు ఎదుర్కొంటున్న కోటానుకోట్ల మంది కష్టాలపై ప్రపంచం దృష్టి పడేందుకు ఈ అవార్డు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని అవార్డు కమిటీ అధ్యక్షులు బెరిట్ రీస్ ఆండర్సన్ వ్యాఖ్యానించారు.
శాంతి స్థాపనకు కీలకమైన ఆహార భద్రత కల్పించేందుకు ప్రపంచ ఆహార కార్యక్రమం కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆకలన్నది మరోసారి ప్రపంచం మొత్తమ్మీద సమస్యగా మారుతోందని, కరోనా వైరస్ పరిస్థితులు దీన్ని మరింత ఎక్కువ చేసిందని కమిటీ తెలిపింది. 2019లో సుమారు 13.5 కోట్ల మంది ఆకలితో అలమటించారని, ఇటీవలి కాలంలో సమస్య ఇంత తీవ్రరూపం దాల్చడం ఇదే మొదటిసారని వివరించింది. యెమెన్, కాంగో, నైజీరియా, సౌత్ సూడాన్ వంటి దేశాల్లో కోట్లాది మందికి ఆహారం అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది.
హర్షాతిరేకాలు...
నోబెల్ కమిటీ శాంతి బహుమతిని ప్రకటించిన వెంటనే నైజర్‌లోని ప్రపంచ ఆహార కార్యక్రమ కార్యాలయంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా బీస్లీ అక్కడి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘‘రెండు విషయాలు. మనకు అవార్డు వచ్చినప్పుడు నైజర్‌లో ఉన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా. రెండో విషయం. నేను గెలవలేదు. మీరు గెలుచుకున్నారు’’అని అన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమానికి చాలాకాలంపాటు అమెరికన్లే అధ్యక్షత వహిస్తూ వచ్చారు. ఈ సంప్రదాయంలో భాగంగా 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌత్ కారొలీనా రాష్ట్ర గవర్నర్ డేవిడ్ బీస్లీని అధ్యక్షుడిగా నియమించారు.
ఆహార కార్యక్రమానికి నోబెల్ అవార్డు ప్రకటించిన విషయాన్ని తెలుసుకున్న బీస్లీ మాట్లాడుతూ ‘‘మాటల్లేని క్షణమంటూ నా జీవితంలో ఒకటి చోటు చేసుకోవడం ఇదే తొలిసారి’’అని, ఆవార్డు దక్కడం తనకు షాక్ కలిగించిందన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమమనే తన కుటుంబం అవార్డుకు అర్హురాలని అన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమంలో పనిచేస్తున్న యుద్ధం, ఘర్షణ, వాతావరణ వైపరీత్యాల వంటి దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని అటువంటి వారు ఈ అవార్డుకు ఎంతైనా అర్హులని ఆయన నైజర్ నుంచి అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రపంచ ఆహార కార్యక్రమం ఇదీ...
2030 నాటికల్లా భూమ్మీద ఆకలిబాధలను సమూలంగా తొలగించే లక్ష్యంతో పనిచేస్తున ఐక్యరాజ్య సమితి సంస్థ ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ లేదా ప్రపంచ ఆహార కార్యక్రమం. కరువు కాటకాలొచ్చినా.. దేశాల మధ్య, ప్రాంతాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు చెలరేగినా నిరాశ్రయులకు, బాధితులకు ఆహారం అందివ్వడం ఈ సంస్థ ప్రథమ కర్తవ్యం. దీనికి మాత్రమే పరిమితం కాకుండా.. సుస్థిర అభివృద్ధికి వివిధ దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. సిరియా, యెమెన్ వంటి దేశాల్లో లక్షల మంది కడుపు నింపే ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థకు ఇటీవలి కాలంలో ఎదురవుతున్న మరో సవాలు వాతావరణ వైపరీత్యాలు.
గత ఏడాది ఇడాయి తుపాను కారణంగా ముజాంబీక్‌లో సుమారు నాలుగు లక్షల హెక్టార్లలో పంట నీటమునిగిపోయింది. తిండిగింజల్లేని పరిస్థితుల్లో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తక్షణం రంగలోకి దిగింది ఈ సంస్థ. ఆహారంతోపాటు నిరాశ్రయులకు మళ్లీ ఇళ్లు కట్టించడం వరకూ అనేక కార్యక్రమాలను చేపట్టింది. భూసార పరిరక్షణ, పెంపు, సాగునీటి కల్పన, విద్య, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి అంశాల్లోనూ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తనవంతు సాయం అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment