కరెన్సీలేని దేశానికి ‘రాజాధిరాజు’!
అధికార వ్యామోహం తాగే కొద్దీ పెరిగే దుర్దాహం. జింబాబ్వే అధినేత రాబర్ట్ ముగా బే ఎనభై తొమ్మిదేళ్ల వయసులో ఏడోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ‘ఇది నా దేశం. ఇది నాదే, నిండు నూరేళ్లు నే నే దీన్ని పాలిస్తాను’ అని ఎన్నడో ఆన్న మాటను ఆయన నిలబెట్టుకునేట్టే ఉన్నారు. 1980లో జింబాబ్వే స్వతంత్ర దేశంగా అంతర్జాతీయ గుర్తింపును పొందింది. ఆప్పటి నుంచి ఆయనే ఆ దేశానికి అధినేత. సవరించిన రాజ్యాంగం ప్రకా రం ఆయన మరోదఫా అధ్యక్ష పదవికి అర్హు లు. అంటే 99వ ఏటగానీ ఆయన స్వచ్ఛం దంగా వానప్రస్థం స్వీకరించే అవకాశం లేదు. జూలై 31న పార్లమెంటు ఎన్నికలతోపాటూ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ముగాబే నేతృత్వం లోని జింబాబ్వే అఫ్రికన్ నేషనల్ యూని యన్ (జెడ్‌ఏఎన్‌యూ-పీఎఫ్) ఘనవిజ యం సాధించింది. పలు లోటుపాట్లున్నా మొత్తంగా ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగాయని ఆఫ్రికన్ యూనియన్ పరిశీలకుల బృందం ప్రకటించింది. ‘నల్లోడి’ మాటలను నమ్మలేని పాశ్చాత్య మీడియా ఈ ఎన్నికలను బూటకంగా కొట్టిపారేస్తోంది. నేటి ప్రభుత్వంలో ప్రధాని, ఎమ్‌డీసీ-టీ (మూవ్‌మెంట్ ఫర్ డెమోక్రటిక్ ఛేంజ్) నేత మోర్గాన్ ట్సవంగిరాయ్ ముగాబేకు ప్రధాన ప్రత్యర్థి, ఆయన కూడా ముగాబే ఎన్నిక అక్రమమని సవాలు చేస్తున్నారు. ముగాబే పాశ్చాత్య దేశాల దృష్టిలో ఆఫ్రికా ఖండపు ‘బ్యాడ్ బాయ్’. కానీ ఆయన ఒకప్పుడు యావత్ ప్రపంచం మన్నించిన ఆఫ్రికన్ నేత. జింబాబ్వే జాతీయ విముక్తి నేత, ప్రజాస్వా మ్య ప్రదాత. ఆహారం, విద్య, వైద్యం తదితర సమస్యల పరిష్కారానికి ఆయన తొలి దశాబ్దంలో మంచి కృషి చేశారు. 99 శాతం అక్షరాస్యతతో ఆఫ్రికాలో అగ్రస్థానం జింబాబ్వేదే. దక్షిణాఫ్రికా ధాన్యాగారంగా విలసిల్లిన ఆ దేశం ఇప్పుడు ఆకలిచావుల పొలిమేరల్లో ఉంది. వాతావరణ మార్పుల వల్ల పెరిగే ఉష్ణోగ్రతలతో ఉపరితల జలవనరులలోని నీరు భారీగా ఆవిరైపోతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో సైతం నీటి ఎద్దడి పెరుగుతోంది. అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, అవినీతి, ఆశ్రీత పక్షపాతాలకు మారుపేరుగా మారిన ముగా బే పాలన సమస్యను మరింత విషమింపజేస్తోంది.
1980కి ముందు జింబాబ్వే రొడీషియా పేర బ్రిటన్‌కు వలసగా ఉండేది. శ్వేత జాత్యహంకార ప్రధాని అయాన్ స్మిత్ మైనారిటీ పాలనకు వ్యతిరేకంగా 1960ల నుంచి గెరిల్లా విముక్తి పోరాటాన్ని నడిపిన జాతీయ హీరో ముగాబే. నెల్సన్ మండేలా సరసన నిలవాల్సిన నేత. కానీ... చరిత్ర ఆయనపై చెప్పే తీర్పు అందుకు భిన్నంగా ఉండనుంది. కార ణం ఆయన్ను అధికార దాహం, ఆశ్రీత పక్షపాతాలనే రాహుకేతువులు కాటేయడమే. స్వా తంత్య్రానంతరం ఆఫ్రికాలో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారిన జింబాబ్వే 1990లలో క్షీణ దశలోకి ప్రవేశించింది. జింబాబ్వే చెప్పుకోదగ్గ జలవనరులున్న వ్యవసాయక దేశం. పైగా ప్లాటినమ్, బొగ్గు, ముడి ఇనుము, బంగారం, వజ్రాలు తదితర ఖనిజ నిక్షేపాలు కూడా ఉన్నాయి. అయినా 85 శాతం పేదరికం, 90 శాతం నిరుద్యోగంతో జింబాబ్వే నిరుపేదదేశంగా అల్లాడుతోంది. భూసంస్కరణలు, గనులపై స్థానిక యాజమాన్యం వంటి చర్యల తదుపరి కూడా దేశ సంపదలో సగానికిపైగా 10 శాతం మంది చేతుల్లోనే ఉంది. ముగాబే ఆశ్రీత పక్షపాత, అవినీతిమయ పాలన ఫలితాలివి. 2013 జనవరిలో జింబా బ్వే మొత్తం ఖనిజాల ఎగుమతులు 180 కోట్ల డాలర్లు. కాగా, ఒక్క తూర్పు వజ్రాల గనుల నుంచే 200 కోట్ల డాలర్ల విలువైన వజ్రాలను కొల్లగొట్టారంటేనే సమస్య తీవ్రత అర్థమవుతుంది. ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో విపరీతంగా కరెన్సీని ముద్రించిన ఫలితం గా... 2008లో క్షణ క్షణమూ ధరలు రెట్టిం పయ్యే ‘హైపర్ ఇన్‌ఫ్లేషన్’ (అవధులు లేని ద్రవ్యోల్బణం) ఏర్పడింది. ద్రవ్యోల్బణం 23.1 కోట్ల శాతానికి చేరింది! ఈపరిస్థితుల్లో 2009లో ఏర్పడ్డ జాతీయ ప్రభుత్వం జింబా బ్వే కరెన్సీని రద్దుచేసింది. అమెరికన్ డాల ర్‌తో పాటూ ఇరుగుపొరుగు దేశాల కరెన్సీయే నేటికీ అక్కడ వాడుకలో ఉంది.
సాహసోపేతమైన గొప్ప విప్లవ కర సం స్కరణలను సైతం తీవ్ర దుష్ఫలితాలకు దారి తీసే విధంగా అమలుచేయడానికి ముగాబే పాలన అత్యుత్తమ ఉదాహరణ. మార్క్సిస్టు, సోషలిస్టు భావాలతో ప్రేరేపితుడైన ముగాబే జనాభాలో ఒక్క శాతం శ్వేత జాతీయుల చేతుల్లోనే సగానికి పైగా భూములున్న పరిస్థితిని తలకిందులు చేయాలని ఎంచారు. బ్రిటన్ ‘ఇష్టపడ్డ అమ్మకందార్లు, ఇష్టపడ్డ కొనుగోలుదార్లు’ అనే పథకం కింద భూములను కొని, పేద రైతులకు ఇచ్చే కార్యక్రమం ప్రారంభింపజేసింది. వలస పాలనా యంత్రాంగం ఆ కార్యక్రమాన్ని ఎందుకూ పనికిరాని, నాసి రకం భూములకు భారీ ధరలను చెల్లించే కుంభకోణంగా మార్చింది. ముగాబే సహచరులు కూడా కుమ్మక్కయ్యారు. మరోవంక నిధులను సమకూర్చాల్సిన బ్రిటన్ తాత్సారం చేసి ఆ భూసంస్కరణలకు తూట్లు పొడిచిం ది. దీంతో 2000లో 1,500 మంది శ్వేత జాతీ యుల భారీ వ్యవసాయ క్షేత్రాలను స్వాధీనం చేసుకొని రైతులకు, మూలవాసులకు పం చారు. సేకరించిన భూములన్నీ సైన్యాధికారులు, ప్రభుత్వ నేతల వశమయ్యాయనే మీడియా ప్రచారం అతిశయోక్తే. లక్షకు పైగా కుటుంబాల రైతులు, మూలవాసులకు ఆ భూములలో పునరావాసం కలిగింది. అయితే భూ పంపిణీతో పాటే జరగాల్సిన వ్యవసాయ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో శ్వేత జాతీయుల మార్కెట్ ఆధారిత ఆధునిక పంటల పద్ధతి అమల్లో ఉన్న భూముల్లో జీవనాధార వ్యవసాయం ప్రవేశించింది. దీంతో వ్యసాయ ఉత్పత్తి, ఎగుమతులు క్షీణించాయి. అలాగే 2009లో గనులపై యాజమాన్యం స్థానికులకే చెందేలా తీసుకున్న చర్య అక్రమ గనుల తవ్వకానికి, నీటి వనరులు కలుషితం కావడానికి దారితీసింది. 2012 నాటికి ముగాబే ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించారు. జాతీయ విముక్తి నేతగా ముగాబే ప్రతిష్టకు తోడు అది కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది. ముగాబే ముందున్న తక్షణ సమస్య అత్యంత తీవ్రమైనది. ప్రధాన ఆహారమైన మొక్కజొన్న ప్రభు త్వ గోదాముల్లో పుచ్చిపోతుండగా జాంబి యా వంటి పొరుగు దేశాల నుంచి భారీ ఎత్తున దిగుమతి చేసుకోవడం ‘లాభసాటి’ గా మారింది. మంచి మొక్కజొన్నలను పుచ్చినవిగా దాణాకు తక్కువ ధ రకు అమ్మి, వాటినే సేకరణ పేరిట తిరిగి అధిక ధరలకు కొనడం పౌర, సైనికాధికారులకు అలవాటుగా మారిం ది. అలాగే తడిచిన, నిల్వకు పనికిరాని మొక్కజొన్నలను మంచి ధరకు కొని, పుచ్చిపోయాక పశువుల దాణాగా అమ్మేయడం నిరాటంకంగా సాగిపోతోంది.
2013 నాటికి దేశంలో కోటి మంది ఆకలితో అలమటిస్తున్నారని ప్రపంచ ఆహార సంస్థ అంచనా. దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా, తాను కన్న కలలు కరిగిపోతుండటం చూసి పరితపిస్తుండగా, ముగాబే తన కల లను తానే కాల్చేసుకుంటూ అధికారం వేడిలో చలి కాగుతుండటం చారిత్రక వైచిత్రి.