Robert Mugabe
-
ముగాబే మృతిపై ఒలోంగా ఏమన్నాడంటే..?
హెన్రీ ఒలోంగా.. క్రికెట్ అభిమానులకు చిరపరిచితమైన పేరు. ముఖ్యంగా టీమిండియా ప్రేమికులకు అతడు కచ్చితంగా గుర్తుంటాడు. 1999 వన్డే ప్రపంచకప్‌లో జింబాబ్వే చేతిలో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారకుడు అతడే. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి టీమిండియా ఓటమికి కారకుడయ్యాడు. అయితే 2003 వరల్డ్‌కప్‌లో అతడు చేసిన పని ఒలోంగా క్రీడాజీవితానికే కాదు స్వదేశానికి దూరమయ్యేలా చేసింది. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే నేతృత్వంలో జింబాబ్వేలోని అప్పటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేతికి నల్ల రిబ్బను కట్టుకుని బరిలోకి దిగినందుకు అతడు భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. మాతృభూమికి శాశ్వతంగా దూరమయ్యాడు. రాబర్ట్ ముగాబే మరణించిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నుంచి స్కైప్‌లో అతడు మీడియాతో మాట్లాడాడు. తన క్రీడాజీవితాన్ని తలక్రిందులు చేసిన ముగాబే మరణం పట్ల తనకేమి సంతోషం లేదని పేర్కొన్నాడు. ‘ఆఫ్రికాలోని గొప్ప నాయకుల్లో ఒకరిగా ముగాబే పరిగణించబడడం చాలా బాధాకరం. ఇంగ్లీషు భాషపై మంచి పట్టువుండడంతో ఆయన తన చరిత్రను అనుకూలంగా రాయించుకున్నారు. దయార్ధ్ర హృదయుడిగా, సౌమ్యుడిగా, సంపదను అందరికీ సమానంగా పంచిన మంచి మనిషిగా కీర్తించుకున్నారు. నిజంగా ఇవన్నీ చేసుంటే నెల్సన్ మండేలా మాదిరిగా జనం హృదయాల్లో నిలిచేవార’ని ఒలోంగా వ్యాఖ్యానించాడు. శ్వేత జాతీయల భూములను లాక్కుకోవడం, మానవ హక్కుల ఉల్లంఘన కేసులను ప్రభుత్వం నీరుగార్చడాన్ని వ్యతిరేకిస్తూ 2003 ప్రపంచకప్‌లో జింబాబ్వే క్రికెట్ జట్టు కెప్టెన్ ఆండీ ఫ్లవర్‌తో కలిసి నల్లరిబ్బన్ ధరించి ఒలంగా మైదానంలోకి దిగాడు. ఫలితంగా అతడు ఎన్నో కష్టాలు చవిచూడాల్సి వచ్చింది. జింబాబ్వే నాయకులు అతడి నిరసనను ఖండించారు. ఒలోంగాను కుట్రదారుడిగా వర్ణించారు. వివాదాలు చుట్టుముట్టడంతో ప్రియురాలు అతడిని వదిలేసింది. దుండగుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ఇలాంటి సమయంలో జింబాబ్వే గూఢచారి విభాగానికి చెందిన అధికారి సహాయంతో ఇంగ్లండ్‌కు వెళ్లిపోయినట్టు ఒలోంగా వెల్లడించాడు. ఓ క్రికెట్ క్లబ్ యజమాని తనకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నాడని తెలిపాడు. ఆపద సమయంలో ముగాబే అనుచరుల నుంచి తనను కాపాడిన వారందరికీ ఈ మాజీ ఫాస్ట్ బౌలర్ ధన్యవాదాలు తెలిపాడు. జింబాబ్వేతో తనకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని.. స్వదేశానికి తిరిగివచ్చే ఆలోచన లేదని, అడిలైడ్‌లో అంతా బాగుందని స్పష్టం చేశాడు. అది ఆండీ ఆలోచన హరారేలో జరిగిన మ్యాచ్‌లో చేతికి నల్ల రిబ్బను కట్టుకుని మైదానంలోకి దిగాలన్న ఆలోచన ఆండీ ఫ్లవర్‌కు వచ్చిందని ఒలోంగా తెలిపాడు. మ్యాచ్‌కు ముందు రోజు ‘గ్లాడియేటర్’ ఇంగ్లీషు సినిమా పలుమార్లు చూసినట్టు వెల్లడించాడు. ముగాబే ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ప్రపంచం ముందుంచడానికే నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపామన్నాడు. ఆండీ ఫ్లవర్ సూచన పాటించకపోయివుంటే తన జీవితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అయితే తన నిర్ణయం పట్ల ఎటువంటి విచారం లేదన్నాడు. 16 ఏళ్ల తర్వాత కూడా జింబాబ్వేలో ప్రజాస్వామ్యం ఖూనీ గురించి మిగతా దేశాలు గళం విప్పకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశాడు. జింబాబ్వే క్రికెట్ జట్టును నిషేధిస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై మిగతా ప్రపంచం మౌనం వహించడం దిగ్భ్రంతికి గురిచేసిందని ఒలంగా వాపోయాడు. జింబాబ్వే జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించిన తొలి నల్లజాతీయుడిగా గుర్తింపు పొందిన ఒలోంగా ఉత్తుంగ కెరటంలా ఎగిసి టెస్టు, వన్డేలు కలిసి 126 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ఒలోంగా ఇప్పుడు గాయకుడిగా రాణిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియన్ రియాలిటీ షోలో కనిపించి అందరినీ అలరించాడు. (చదవండి: ఉక్కు మనిషి ముగాబే కన్నుమూత!) -
ఉక్కు మనిషి ముగాబే కన్నుమూత!
హరారే: జింబాబ్వే మాజీ అధ్యక్షుడు, ఉక్కు మనిషిగా పేరు సంపాదించిన రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. 37 ఏళ్ల పాటు జింబాబ్వేని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ముగాబే నియంతృత్వ పోకడల్ని భరించలేక చివరకు ఆయనకు అండదండగా ఉన్న సైన్యమే 2017లో ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ఆ అవమాన భారంతో కుంగిపోయిన ఆయన మంచం పట్టారు. గత ఏప్రిల్‌లో ఆయనను సింగపూర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ‘ జింబాబ్వే పితామహుడు రాబర్ట్ ముగాబే మనకిక లేరు’ అని దేశ అధ్యక్షుడు ఎమ్మర్సన్ మన్‌గాగ్వా ట్విట్టర్లో వెల్లడించారు. నాడు స్వాతంత్య్రం కోసం గెరిల్లా పోరు బ్రిటిష్ పరిపాలనలో ఉన్న రొడేషియాలో (ఇప్పటి జింబాబ్వే) 1924వ సంవత్సరం ఫిబ్రవరి 21న ముగాబే జన్మించారు. చిన్నప్పట్నుంచి విప్లవ భావాలు కలిగిన ముగాబే 1964లో బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. అందుకు 10 సంవత్సరాలకుపైగా విచారణ లేకుండానే జైలు జీవితం అనుభవించారు. జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్(జాను)కి వ్యవస్థాపక సభ్యుడైన ముగాబే ఆ తర్వాత 1973లో దానికి అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ఏడాది జైలు నుంచి విడుదలై తెల్లదొరల పాలనలో ఉన్న రొడేషియా విముక్తి కోసం గెరిల్లా తరహా పోరాటాలు చేశారు. సంక్షోభ సమయాల్లో సంప్రదింపులు జరపడంలో అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన ముగాబే ఆ తర్వాత రాజకీయంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయన పోరాటాల ఫలితంగా జింబాబ్వే స్వతంత్ర దేశమయింది. 1980లో జరిగిన తొలి ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చారు. ఒక స్వాతంత్య్ర వీరుడిగా నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడటంతో పాటు, స్వాతంత్య్రం వచ్చాక నల్లజాతీయులకు ఆరోగ్యం, విద్య అందేలా అవిరళ కృషి చేశారు. తొలి 20 ఏళ్లలో మంచి పరిపాలనా దక్షుడిగా పేరుతెచ్చుకున్నారు. 2000వ సంవత్సరం నుంచే ముగాబే పతనం మొదలైంది. అధికారం కోల్పోతానేమోనన్న అభద్రతా భావంలో ఆయన నియంతలా మారారు. 2000లో ముగాబే తెచ్చిన భూ సంస్కరణ విధానాలు బెడిసి కొట్టి ఆర్థిక వ్యవస్థ దిగజారి పోయింది. తెల్లజాతీయుల నుంచి భూములు లాక్కున్నారు. సైన్యం అండతో 17 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫలితంగా రాజకీయ అస్థిరత, ఆర్థిక మాంద్యం ఆ దేశాన్ని వణికించేశాయి. 37 ఏళ్ల పాటు అధికారంలో ఉండడంతో ప్రజల్లోనూ అసమ్మతి పేరుకుపోయింది. వయోభారంతో ఇక పదవిలో కొనసాగలేనని భావించిన ముగాబే 2017లో తన భార్య గ్రేస్‌కు అధ్యక్ష పీఠం అప్పగించే ప్రయత్నం చేశారు. ఇది తెలుసుకున్న ఆర్మీ ఆయనపై తిరుగుబాటు చేసి గద్దె దింపింది. -
రాబర్ట్ ముగాబే కన్నుమూత
సింగపూర్ : జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (95) మరణించారని ఆ దేశ అధ్యక్షుడు ఎమర్సన్ మగగ్వా తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. రాబర్ట్ ముగాబే మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని ఈ విషాద వార్తను తాను ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు. వయోభారం, అనారోగ్యం కారణంగా ఆయన కన్నుమూశారని అధికార వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ నుంచి సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగాబే కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు. గతంలోనూ ఆయన పలుమార్లు అనారోగ్యానికి గురై చికిత్స పొందారని పేర్కొన్నాయి. కాగా ముగాబే మూడు దశాబ్ధాల సుదీర్ఘ పాలనకు 2017 నవంబర్‌లో సైనిక తిరుగుబాటు ద్వారా తెరపడింది. స్వాతంత్ర్యానంతరం జరిగిన జింబాబ్వే తొలి ఎన్నికల్లో ముగాబే విజయం సాధించి 1980లో తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1987లో దేశ అధ్యక్ష పగ్గాలను స్వీకరించారు. జింబాబ్వే జాతిపితగా, స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుడిగా ముగాబే పేరొందారు. -
విండోస్ 2017
కొన్ని తీపి గురుతులు.. మరికొన్ని చేదు గుళికలు.. ఎన్నో మధుర స్మృతులు.. మరెన్నో పీడ కలలు.. మొత్తంగా 2017 ఎన్నో జ్ఞాపకాలను మిగులుస్తూ వీడ్కోలుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో 2017కి వీడ్కోలు పలికి 2018 సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ తరుణంలో గడిచిన 2017లో దేశంలోనూ, ప్రపంచంలోనూ చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు, పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ మేలో ప్రపంచాన్ని వాన్నాక్రై వణికించింది.150 దేశాల్లో విండోస్ ఓఎస్ ఉపయోగించే కంప్యూటర్లు, సంస్థలు లక్ష్యంగా సైబర్ దాడులు సాగాయి. ఈ కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని తిరిగి ఇచ్చేందుకు బిట్‌కాయిన్ క్రిప్టో కరెన్సీతో చెల్లింపులు చేయాలని బెదిరింపులకు పాల్పడ్డారు. వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తరకొరియా సైనిక పాలకుడు కిమ్ జోంగ్–ఉన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ చర్యలతో ట్రంప్, కిమ్ మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది. ట్రంప్ హెచ్చరికలు.. కిమ్ ప్రతి హెచ్చరికలతో ఇరుదేశాల మధ్యా యుద్ధ వాతావరణం నెలకొంది. జనవరి 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. అమెరికాను మరోసారి శక్తివంతమైన, సంపన్న దేశంగా మారుస్తానంటూ వాగ్దానం చేశారు. అధికారాన్ని చేపట్టిన కొద్ది కాలంలోనే తన వ్యవహారశైలి, మాట్లాడే ధోరణి, ముఖ్యమైన సమస్యలపై స్పందించే తీరుతో ట్రంప్ అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. 37 ఏళ్ల పాటు జింబాబ్వే అధ్యక్షుడిగా ఉన్న రాబర్ట్ ముగాబేకు రాజకీయ చరమాంకంలో చేదు అనుభవం ఎదురైంది. సైనిక తిరుగుబాటు ద్వారా ఆయన బలవంతంగా రాజీనామా చేసే వరకు పరిస్థితులు దారితీశాయి. తన భార్య గ్రేస్ ముగాబేను తొలుత ఉపాధ్యక్షురాలిని చేసి, తన తర్వాత అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టాలని ముగాబే చేసిన ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత దీనికి కారణమైంది. ఆరురోజుల పాటు దిగ్బంధం ఫలితంగా ఆ దేశ తర్వాతి అధ్యక్షుడిగా ఎమార్సన్ నాన్‌గాగ్వా బాధ్యతలను స్వీకరించారు. పనామా పేపర్ల పేరిట జర్మనీ వార్తాపత్రిక విడుదల చేసిన లక్షలాది పత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తల సందేహాస్పద ఆర్థిక వ్యవహారాలు బయటకు వచ్చాయి. ఈ వివాదాల్లో చిక్కుకున్న వారిలో ఎలిజబెత్ రాణి–2 మొదలుకుని, బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఐర్లాండ్‌కు చెందిన పాల్ డేవిడ్ హ్యూసన్(బోనో) తదితరులున్నారు. ఆగస్టు చివర్లో మయన్మార్‌లో రోహింగ్యాలపై అక్కడి సైన్యం హత్యాకాండతో బంగ్లాదేశ్ తదితర దేశాలకు పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా దాడుల బారిన పడిన తెగగా రోహింగ్యాలను పరిగణిస్తున్నారు. రోహింగ్యా శరణార్థుల సమస్యకు ఇంకా ఎలాంటి పరిష్కారం లభించలేదు. దేశ 14వ రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్ జూలై 17న, 13వ ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు ఆగస్ట్ 5న ఎన్నికయ్యారు. వారు వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులు మీరాకుమార్, గోపాలకృష్ణ గాంధీని ఓడించారు. బీజేపీ నేపథ్యమున్న మొదటి రాష్ట్రపతిగా కోవింద్(72) చరిత్రకెక్కారు. బిహార్ గవర్నర్‌గా పనిచేసిన కోవింద్‌కు 65 శాతం ఓట్లు లభించాయి. వరుసగా దాదాపు 19 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన వెంకయ్య ఆ సభకే అధ్యక్షుడయ్యారు. 1997లో నాసా ప్రయోగించిన కాసిని అంతరిక్షనౌక 2004లో శనిగ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. నాలుగున్నర లక్షల ఉపగ్రహ చిత్రాల ద్వారా విలువైన సమాచారాన్ని అందించింది. 2017 సెప్టెంబర్ 15న సేవలు చాలించింది. అక్టోబర్ 1న లాస్వేగాస్లో ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొన్న వారిని లక్ష్యంగా చేసుకుని స్టీఫెన్ పాడాక్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 58 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్ష ప్రకటన. దాదాపు 7 దశాబ్దాల పాటు అగ్రరాజ్యం అనుసరించిన వైఖరికి భిన్నంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో పశ్చిమాసియాలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికాను ‘హరికేన్ హార్వే’ అల్లాడించింది. దీని ధాటికి టెక్సాస్ తదితర ప్రాంతాల్లో 90 మంది వరకు చనిపోవడంతో పాటు దాదాపు 200 బిలియన్ డాలర్లపై చిలుకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఏడాది బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్‌లో భారీ మెజారిటీతో విజయం సాధించింది. గోవా, మణిపూర్‌లో సగానికన్నా ఎక్కువ సీట్లు రాకున్నా కొద్ది రోజుల్లోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. పంజాబ్‌లో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతి కష్టం మీద మెజారిటీ సంపాదించింది. ఐదేళ్ల కాంగ్రెస్ పాలన సాగిన హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జూలై 1న ఏకీకృత పన్నుల విధానం జీఎస్టీ అమలులోకి వచ్చింది. ప్రధాని మోదీ ‘గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్’ అని పిలిచిన జీఎస్టీ కేంద్ర, రాష్ట్రాలు వసూలు చేస్తున్న 15 రకాల పన్నులు, సుంకాల స్థానంలో జీడీపీని పెంచే సాధనంగా మారింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో దాదాపు రెండు దశాబ్దాలు కొనసాగిన సోనియాగాంధీ ఆరోగ్య కారణాలతో వైదొలిగారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సోనియా కుమారుడు రాహుల్‌గాంధీ పోటీ లేకుండా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేపట్టిన నెహ్రూ–గాంధీ కుటుంబంలో ఆయన ఆరో సభ్యుడిగా చరిత్రకెక్కారు. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో రాజకీయ బంధం తెంచుకున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేసిన వెంటనే అప్పటి వరకూ శత్రువైన బీజేపీతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కొన్ని నెలలుగా ఈ పరిణామం జరుగుతుందని ఊహించినా నితీశ్ చూపిన తెగువ, వేగం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ముస్లిం సమాజంలో మహిళలకు వారి భర్తలు ఇచ్చే ముమ్మారు తలాక్ పద్ధతి చెల్లదని ఈ ఏడాది ఆరంభంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సంచలనం సృష్టించిన ఈ తీర్పు అమలుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ముమ్మారు తలాక్‌ను రద్దు చేస్తూ ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లు రూపొందించింది. లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా మెజారిటీ సభ్యుల ఆమోదం పొందాక చట్టం కావడానికి అడ్డంకులేవీ ఉండవు. 1962లో యుద్ధానికి దిగిన ఆసియా పెద్దన్నలు ఇండియా, చైనా మధ్య జూన్ 16 నుంచి కొన్ని నెలలపాటు పశ్చిమ భూటాన్‌లోని వివాదాస్పద ప్రాంతమైన డోక్లామ్ పీఠభూమిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్తత ముదిరి రెండోసారి రెండు పెద్ద దేశాల మధ్య పోరుకు దారితీస్తుందేమోననే భయాందోళనలు తలెత్తాయి. డోక్లామ్ ప్రాంతంలోకి చైనా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఈ వివాదం రాజుకుంది. చివరికి నిర్మాణం ఆపేసిన చైనాకు, భారత్‌కు మధ్య ఉద్రిక్తత సడలించడానికి ఆగస్ట్ 28న అవగాహన కుదిరింది. ఇస్రోకు మరిచిపోలేని విజయాలు అందించిన సంవత్సరం ఇది. ఇస్రో తన ఉపగ్రహవాహక నౌక(పీఎస్ఎల్వీ) ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఫిబ్రవరి 15న 714 కిలోల ఉపగ్రహం కార్టోస్టాట్–2ను మరో 103 ఉపగ్రహాలతోపాటు ఇస్రో ప్రయోగించింది. బెంగళూరుకు చెందిన ప్రసిద్ధ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ హత్య దేశంలో కుచించుకుపోతున్న భావ ప్రకటనా స్వాతంత్య్రానికి, పత్రికా స్వేచ్ఛకు అద్దం పట్టింది. సెప్టెంబర్ 5 సాయంత్రం ఇంటి దగ్గరే గౌరిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అవినీతి, నియంతృత్వ పోకడలను ప్రతిఘటించే గౌరీ లంకేశ్ పత్రిక నడుపుతున్నారు. వివిధ రంగా ల్లో ప్రముఖులు తమ కింద పనిచేసే మహిళలపై సాగించిన లైంగిక వేధింపులు, దోపిడీకి వ్యతిరేకంగా పాశ్చాత్య ప్రపంచం లో ఆలిసా మిలానో అనే స్త్రీ ప్రారంభించిన ‘నేను సైతం’ ఉద్యమంలో వేలాది మంది భారత మహిళలు పాల్గొన్నారు. -
ముగాబే రాజీనామా
హరారే: జింబాబ్వే అధ్యక్ష పదవికి రాబర్ట్ ముగాబే ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఈ వార్త తెలియగానే దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. పదవి నుంచి దిగిపోవాలని నలువైపులా పెరుగుతున్న ఒత్తిడి, ఆయన్ని అభిశంసించే ప్రక్రియను జింబాబ్వే పార్లమెంట్ ప్రారంభించడంతో ముగాబే దిగిరాక తప్పలేదు. దీంతో సుమారు 4 దశాబ్దాలుగా నిర్విరామంగా కొనసాగిన ఆయన పాలనకు ఎట్టకేలకు తెరపడినట్లయింది. మంగళవారం ముగాబే పంపిన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ జాకబ్ ముడెండా పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో చదివి వినిపించారు. ‘జింబాబ్వే ప్రజల సంక్షేమం, సజావుగా అధికార బదిలీ జరిగేందుకు నేనే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాను’ అని అందులో తెలిపారు. ఇటీవలే ఉపాధ్యక్ష పదవి కోల్పోయిన ఎమర్సన్ నంగాగ్వా రెండు రోజుల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని అధికార పార్టీ జాను–పీఎఫ్ చీఫ్ విప్ లవ్మోర్ మాటుకే వెల్లడించారు. 1980 నుంచి..: భార్య గ్రేస్‌ను తన వారసురాలిగా చేయాలనుకుని ఆమెకు పోటీ గా ఉన్న ఉపాధ్యక్షుడు ఎమర్సన్‌ను ముగాబే పదవి నుంచి తొలగించడంతో దేశంలో అస్థిరత ఏర్పడింది. ఎమర్సన్‌కు అండగా నిలిచిన సైన్యం ముగాబే, ఆయన భార్యను గృహ నిర్బంధంలోకి తీసుకుంది. ముగాబే గద్దె దిగాల్సిందేనని దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళలు నిర్వహించారు. సొంత పార్టీ జాను–పీఎఫ్ ముగాబేను తమ చీఫ్‌గా తొలగించి ఎమర్సన్‌ను నియమించింది. 1980 నుంచి ముగాబేనే జింబాబ్వే అధ్యక్షుడిగా ఉన్నారు. -
జింబాబ్వే సంక్షోభం వెనుక ఓ అగ్రదేశం?
హరారే : జింబాబ్వే రాజకీయ సంక్షోభం ముగింపు దిశగా అడుగులు వేస్తోంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక దాదాపు ఖరారు కావటంతో పరిణామాలు సర్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉన్నట్లుండి హఠాత్తుగా ఈ తిరుగుబాటు జరగటం వెనుక ఓ అగ్ర దేశం హస్తం ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. జింబాబ్వేతో వర్తక, వ్యాపారాలు నడిపే దేశాల జాబితాలో చైనానే అగ్రగామిగా ఉంది. ముగాబేతో మంచి మైత్రి సంబంధాలు కొనసాగిస్తూ... 1970 నుంచి అక్కడి వ్యవసాయ రంగం, షిప్పింగ్ ఇలా ప్రతీ రంగంలోనూ పెట్టుబడులు పెడుతూ వాణిజ్యం రంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. యూఎస్ఎస్ఆర్.. జింబాబ్వేకు ఆయుధాల సరఫరాకు విముఖత వ్యక్తం చేసిన సమయంలో డ్రాగన్ కంట్రీయే ముందుకు వచ్చింది. చివరకు జింబాబ్వేలో నూతన పార్లమెంట్ నిర్మాణానికి కూడా ఆసక్తి చూపిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటి చైనా ఇప్పుడు తిరుగుబాటు ఎందుకు చేయిస్తుందన్నది అనుమానంగా మారింది. అయితే గత కొన్నేళ్లుగా ముగాబేకు-చైనాకు మధ్య పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ముఖ్యంగా 2008లో ఆయుధాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని జింబాబ్వే ఆయుధాలను తిప్పి పంపటం చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అయితే అప్పటికే బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి ఉండటంతో సైలెంట్ అయిన చైనా.. రక్షణ సహాయాన్ని మాత్రం క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ఆ తదనంతరం సందు దొరికినప్పుడల్లా ముగాబే పాలనపై పలుమార్లు అసంతృప్తి వెల్లగక్కుతూ వస్తున్న చైనా ముగాబేను గద్దె దిగిపోవాలంటూ పలుమార్లు పరోక్షంగా హెచ్చరిస్తూ వస్తోంది కూడా. అయినా తీరు మార్చుకోని ముగాబే తన మునుపటి విధానాలనే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో తమ దేశ పర్యటన సందర్భంగా చైనీస్ ప్రీమియర్ లీ కైయాంగ్ ముగాబేకు గట్టి వార్నింగ్‌నే ఇచ్చినట్లు చైనా మీడియా ఓ కథనం ప్రచురించింది కూడా. ఇక తన వయసు పైబడుతుండటంతో భార్య గ్రేస్ ముగాబేను అధ్యక్షరాలిని చేయాలన్న ఆలోచన సొంత పార్టీలో చిచ్చు రాజేసింది. దీంతో ఇదే అదనుగా భావించిన చైనా జింబాబ్వే మిలిటరీ జనరల్ కాన్స్టాంటినో చివెంగాను ఉన్నపళంగా చైనాకు రప్పించుకుని మరీ సైనిక తిరుగుబాటుకు ప్రోత్సహించి ఉంటుందన్న వాదన వినిపిస్తోది. దానికి తగ్గట్లే ఈ నెల మొదట్లో చివెంగా చైనా పర్యటన.. తిరిగొచ్చాక సైనిక తిరుగుబాటు ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోవటంతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కానీ, చైనా మాత్రం జింబాబ్వేలో ఇంత పెద్ద రగడ జరుగుతున్నా కిక్కురుమనకుండా ఉండటం విశేషం. (ఇండియా టుడే కథనం ప్రకారం) -
మొగాబే దంపతుల విలాసాలు చూస్తే.. విస్తుపోవాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : సైనిక కుట్ర ద్వారా పదవీచ్యుతుడై ప్రస్తుతం గహ నిర్బంధం అనుభవిస్తున్న జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ మొగాబే దంపతులు, వారి పిల్లలు ఇంతకాలం అనుభవించిన రాజభోగాల గురించి, వారి విలాసాల కులాసాల జీవితాల గురించి ఎవరైనా వింటే విస్తుపోవాల్సిందే. మొగాబే దంపతులు జింబాబ్వే రాజధాని హరారేలోని 75 కోట్ల రూపాయల విలాసమైన భవంతి (బ్లూరూఫ్ మాన్షన్) లో నివసిస్తున్నారు. ఈ భవంతిలో సకల సౌకర్యాలతో 25 పడక గదులు ఉన్నాయి. ప్రస్తుతం ఇదే భవంతిలో మొగాబే, ఆయన భార్య గుస్సీ గ్రేసీ గహ నిర్బంధంలో ఉన్నారు. మొగాబేకు 93 ఏళ్లుకాగా, గుస్సీ గ్రేసికి 52 ఏళ్లు. ఇద్దరి మధ్య వయస్సు తేడా 41 ఏళ్లు. కేవలం రాజరికం భోగభాగ్యాలను అనుభవించేందుకే మొగాబేను విడిచిపెట్టకుండా ఇప్పటికీ అంటుకు తిరుగుతుందని జింబాబ్వే ప్రజలు భావిస్తారు. అంతకంటే ఎక్కువ వారిని తిరుగులేని అధికారం కలిసి ఉండేలా చేసింది. ప్రపంచంలో జింబాబ్వే కడు పేద దేశం. అక్కడ ప్రతి పదిమందిలో ఏడుగురు రెండు పూటలు కూడా కడుపునిండా తిండిలేక పస్తులతో అలమటిస్తుంటారు. అలాంటి దేశంలో మొగాబే కుటుంబం ప్రజల చెమట, నెత్తురుతో సుఖ జీవితాలను అనుభవిస్తున్నారు. సైన్యానికి మొగాబే కోపం రావడానికి ఇదొక కారణంగా చెప్పవచ్చు. ఆ దంపతులకు ఒక్క హరారేలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సొంత భవనాలు ఉన్నాయి. ఇక మొగాబే భార్య గుస్సీ గ్రేసి డబ్బులను విచ్చిల విడిగా ఖర్చుపెట్టడంలో ఎంతో విఖ్యాతి చెందిన వారు. ఆమె తన కూతురు పెళ్లి కోసం 30 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. ఇటీవలనే ఆమె మూడు కోట్ల రూపాయలు పెట్టి రోల్స్ రాయిస్ కారు కొన్నారు. ఆమె తలగడ పక్కన రెండు కోట్ల రూపాయల వజ్రం పొదిగిన డ్రా ఉంటుంది. ఇక 12 వజ్రపు ఉంగరాలు, 62 జతల ఖరీదైన ఫెర్రగామో చెప్పులు, 80 లక్షల రూపాయల రోలెక్స్ వాచ్‌లు ఆమెకున్నాయి. ఆమె ప్యారిస్ పర్యటనకు వెళ్లినప్పుడు ఒక్కరోజే కోటి ఇరవై లక్షల రూపాయల షాపింగ్ చేశారు. ఏడాదికి ఆమె షాపింగ్‌ల ఖర్చు 20 కోట్ల రూపాయలకు పైనేనని 2014లో నిపుణులు అంచనా వేశారు. తల్లే ఇలా ఉంటే పుత్రులు ఇంకా ఎలా ఉండాలి? చిన్న కొడుకు ఛాతుంగ దక్షిణాఫ్రికాలో ఓ రోజు 45 లక్షల రూపాయల వాచ్‌పై 20 వేల రూపాయల ఆర్మండ్ షాంపేన్ బాటిల్‌ను కుమ్మరించిన ఆనందాన్ని ఆస్వాదించారు. పైగా దాని తాలూకు వీడియోను ‘స్నాప్‌చాట్’లో పోస్ట్ చేశారు. ఒకప్పుడు కోడి మాంసం అమ్ముకుని బతికే గుస్సీ గ్రేసి మొదట మొగాబే వద్ద టైపిస్ట్‌గా చేరారు. ఆయన మొదటి భార్య సాలీ తీవ్రంగా జబ్బు పడడంతో మొగాబేకు దగ్గరయ్యారు. 1996లో వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లి వైభవాన్ని చూసి జింబాబ్వేలోనే ‘వెడ్డింగ్ ఆఫ్ ది సెంచరీ’గా కీర్తించారు. మొగాబే మూడేళ్ల క్రితమే, అంటే తన 90వ జన్మదినోత్సవాన్ని ఆరుకోట్ల ఖర్చుపెట్టి జరుపుకున్నారు. ఇక గుస్సీ గ్రేసి తమ 20వ వివాహ వార్షికోత్సవానికి 9 కోట్ల రూపాయలు పెట్టి డైమండ్ రింగ్‌ను కొనుకొన్నారు. అంతేకాకుండా ఆమె బెదరించి ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఐదు డెయిరీ ఫామ్‌లను స్వాధీనం చేసుకున్న ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. మొగాబే ఏకైక పుత్రిక బోనా వివాహాన్ని కూడా ఆ దంపతులు 2014లో అంగరంగ వైభవంగా చేశారు. ఆ ఖర్చు వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. -
రాబర్ట్ ముగాబేకి షాక్..
జింబాబ్వేలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆదివారం రాత్రి ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. హరారే: జింబాబ్వేలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆదివారం రాత్రి ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అంతకు ముందు అధికార జాను–పీఎఫ్ పార్టీ తమ చీఫ్‌గా ముగాబేను తొలగించి ఆ స్థానంలో మాజీ ఉపాధ్యక్షుడు ఎమర్సన్ ఎమ్‌నాంగా గ్వాని నియమించింది. సోమవారం నాటికి ముగాబే రాజీనామా చేయకపోతే తామే అభిశంసిస్తామని హెచ్చరించింది. 2018లో జరిగే ఎన్నికల్లో తమ అధ్యక్ష అభ్యర్థి ఎమర్సన్ అని ప్రకటించింది. ముగాబే భార్య గ్రేస్‌ను కూడా పార్టీ నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా ఆర్మీ చీఫ్ కాన్స్టాంటినో చివెంగా, ముగాబేతో చర్చలు జరిపారు. ఈ సమావేశం వివరాలు వెల్లడికాలేదు. ముగాబే వృద్ధాప్యాన్ని సాకుగా చూపి అధికారం చేపట్టి దేశ వనరులను కొల్లగొట్టడానికి ఆయన భార్య గ్రేస్, ఆమె అనుచరులు ప్రయత్నిస్తున్నారని పార్టీ ప్రతినిధి ఒబర్ట్ ఎంపోఫు ఆరోపించారు. ముగాబేను గృహ నిర్బంధంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
జింబాబ్యేలో ముగాబే పాలనకు తెర..?
-
ముగాబే విషాదయోగం
బ్రిటిష్ వలస పాలకులకు రెండు దశాబ్దాలపాటు నిద్ర లేకుండా చేసిన గెరిల్లా... నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలాకు మాత్రమే సాటి రాగల నేపథ్యం... వలసపాలకులను తరిమికొట్టాక పదేళ్లపాటు శ్రమించి దేశాన్ని ఆఫ్రికా ఖండంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చిన సమర్ధత – ఇవన్నీ బుధవారం సైనిక తిరుగు బాటులో పదవీచ్యుతుడైన జింబాబ్వే అధినేత రాబర్ట్ ముగాబే గురించే. దేశాన్ని దాదాపు నాలుగున్నర దశాబ్దాలు పాలించిన ముగాబే తొలి పదేళ్ల పాలనాకాలం తర్వాత తన చరిత్రను తానే తుడిచేసుకునే పనిలోబడ్డారు. భిన్నాభిప్రాయాన్ని సహించలేకపోవడం, ప్రశ్నించినవారిని ఖైదు చేయడం లేదా కాల్చి చంపడం ముగాబే పాలన సారాంశం. వీటన్నిటిలో చేదోడు వాదోడుగా ఉండి ఆయన అధికార పీఠాన్ని కంటికి రెప్పలా కాపాడిన ఉపాధ్యక్షుడు ఎమర్సన్ నంగాగ్వాతో ముగాబేకు విభేదాలు రాకపోయి ఉంటే శేష జీవితంలో కూడా ఆయనే దేశాధ్యక్షు డిగా కొనసాగేవారు. కానీ 93 ఏళ్ల వయసులో ముగాబే తన వయసుకు మించిన సాహసానికి ఒడిగట్టారు. తన జీవిత భాగస్వామి 52 ఏళ్ల గ్రేస్‌కు అధికార పీఠం అప్పగించాలనుకున్నారు. ఆమె దేశాధ్యక్షురాలు కావాలంటే ముందు ఉపాధ్యక్షురాలి పదవిలో ఉండాలి గనుక అది కట్టబెట్టే సన్నాహాలు చేశారు. అందుకోసం సుదీర్ఘ కాలంపాటు తన కళ్లూ చెవులుగా పనిచేసిన ఎమర్సన్‌పై కత్తిగట్టి ఉపాధ్యక్ష పదవి నుంచి ఆయనకు ఉద్వాసన పలికారు. దీంతో సర్వమూ తారుమారైంది. సొంత పార్టీ జాను–పీఎఫ్‌లో సైతం ముగాబేపై వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇప్పుడాయన తన అధ్యక్ష భవనంలోనే బందీ. తిరుగుబాటు జరిపి ఆయన్ను పదవి నుంచి తప్పించా మని సైన్యం ఒప్పుకోవడం లేదు. పైగా దీన్ని ‘ప్రక్షాళన ప్రక్రియ’గా దబాయిస్తోంది. ఆయన చుట్టూ చేరిన నేరగాళ్ల ముఠాను తప్పించి వ్యవస్థను సరిచేయడమే తాము చేస్తున్న పని అని సంజాయిషీ ఇస్తోంది. ఆ దేశంలో సైనిక తిరుగుబాటు జరిగిందని అటు ఆఫ్రికా ఖండ దేశాల సంస్థ ఆఫ్రికన్ యూనియన్(ఏయూ) కూడా చెప్ప దల్చుకోలేదు. అలా చెబితే జింబాబ్వేను సంస్థ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన స్థానంలో ఎమర్సన్‌ను అధ్యక్షుడిగా ప్రకటించి అంతా సుఖాంతమైందని ప్రకటిస్తారా లేక అధికారం రుచి మరిగిన సైన్యం అక్కడే తిష్ట వేస్తుందా అన్నది చూడాలి. స్వాతంత్య్రానికి ముందు రొడీషియాగా పేరున్న జింబాబ్వే మిగిలిన ఆఫ్రికన్ దేశాల్లాగే ప్లాటినం, బొగ్గు, ముడి ఇనుము, బంగారం, వజ్రాలు వంటి సహజ సంపదలున్న దేశం. జలవనరులుండటం వల్ల వ్యవసాయం కూడా మెరుగ్గానే ఉంది. కానీ శతాబ్దానికి పైగా పాలించిన బ్రిటన్ పాలకులు ఆ దేశాన్ని నిలువునా కొల్లగొట్టారు. నల్లజాతీయులపై స్వారీ చేశారు. అడుగడుగునా అక్కడ జాత్యహం కారం తాండవించేది. అలాంటిచోట ముగాబే 1980లో అధికారం చేపట్టి తొలి దశాబ్దంలో అనేక విజయాలు సాధించారు. ఉన్న జలవనరులను వినియోగించుకుని దేశానికి ‘ఆఫ్రికా ఖండ ధాన్యాగారం’ అనే పేరు తెచ్చారు. విద్య, వైద్యం వంటి అంశాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించారు. ఆఫ్రికా ఖండంలో 99 శాతం అక్షరాస్యత సాధించిన దేశం అదే. అయితే తనకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు కుట్రలు పన్నుతున్నాయని ఆయన శంకించడం ప్రారంభించారు. ముఖ్యంగా తనతో కలిసి దేశ స్వాతంత్య్రానికి పోరాడిన జాషువా ఎన్కోమో వంటి నాయకులు తనకు వ్యతిరేకంగా మారడం వెనక వాటి హస్తమున్నదని అనుమానించారు. అంతేగాక తమకున్న పలుకుబడితో అవి ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వంటి సంస్థల నుంచి సహకారం అందకుండా అడ్డుపడుతున్నాయని భావించారు. అందుకు ప్రతీకారంగా ఆయన క్రమేపీ నియంతృత్వ పోకడలను పెంచుకున్నారు. జనాభాలో శ్వేత జాతీయులు ఒక శాతమే అయినా, వారి అధీనంలో 70 శాతం పంట భూములున్నాయని 1995లో జరిగిన ఒక సర్వే తేల్చింది. దేశంలో వలస పాలన పోయినా ఆర్ధిక స్వాతంత్య్రం రాలేదని ప్రకటించి నల్లజాతీయులను రెచ్చ గొట్టి ఆ భూముల నుంచి శ్వేత జాతీయుల్ని వెళ్లగొట్టే పని ప్రారంభించారు. శ్వేత జాతీయులు భూములు వదిలి పరారు కావడం, నల్లజాతీయులకు వ్యవసాయ క్షేత్రాల నిర్వహణలో అనుభవం లేకపోవడం పర్యవసానంగా అవి బీళ్లయ్యాయి. ఫలితంగా ఖజానా నిండుకుంది. నిరవధిక సమ్మెలతో పారిశ్రామిక రంగం పడ కేసింది. ప్రభుత్వం నుంచి నెలల తరబడి జీతాలు రాకపోవడంతో ప్రభుత్వోద్యో గులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు సమ్మెలు చేశారు. ఇవన్నీ ముగాబే పరపతిని దెబ్బతీశాయి. 2000 సంవత్సరంలో కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయడంపై రిఫరెండం నిర్వహిస్తే ముగాబేకు తొలిసారి ఓటమి ఎదురైంది. 2008 మార్చిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్లో ఆయన ప్రత్యర్థి సాంగిరాయ్ విజయం సాధించారు. అయితే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరో పించి ఆయన రెండో రౌండ్ పోటీలో పాల్గొనలేదు. దాంతో ముగాబే గెలిచా ననిపించుకున్నారు. ఆ మరుసటి నెలలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కోల్పోవడంతో సాంగిరాయ్ పార్టీ ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకోక తప్పలేదు. కానీ సాంగిరాయ్ త్వరలోనే దేశం విడిచిపోవాల్సి వచ్చింది. 2013 మేలో ఎన్నో అక్రమాలకు పాల్పడటం వల్ల ముగాబే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించ గలిగారు. సోషలిస్టు సిద్ధాంతాలతో మార్క్సిస్టు–లెనినిస్టుగా రాజకీయ జీవితం ప్రారం భించిన ముగాబే చరమాంకం ఇలా సైనిక తిరుగుబాటుతో ముగుస్తుందని ఎవరూ అనుకోలేదు. నమ్మే సిద్ధాంతం ఏదైనా నియంత పోకడలకు పోతే, ప్రజలను విశ్వా సంలోకి తీసుకోకుండా పరిపాలన సాగిస్తే ఎంతటివారికైనా గడ్డు పరిస్థితులు ఏర్ప డక తప్పదని వర్తమాన జింబాబ్వే హెచ్చరిస్తోంది. ఒకప్పుడు ముగాబే పేరు వింటే పులకించిన దేశం ఇప్పుడాయన బందీగా మారాడని తెలిసినా నిర్లిప్తంగా ఉండి పోయిందంటే అది ఆయన చేజేతులా చేసుకున్నదే. ప్రజాస్వామిక విలువలను కాల రాసే వారంతా ముగాబే జీవితాన్ని గుణపాఠంగా తీసుకోక తప్పదు. -
జింబాబ్వేలో సైనిక పాలన!
హరారే: జింబాబ్వేలో సంచలనం. సైన్యం ఆ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుని అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను ఆయన ఇంట్లోనే నిర్బంధించింది. అయితే ఇది సైనిక తిరుగుబాటు కాదనీ, అధ్యక్షుడు, ఆయన కుటుంబీకులు ఇంట్లో క్షేమంగానే ఉన్నారనీ, ముగాబే చుట్టూ ఉన్న నేరస్తులే తమ లక్ష్యమని ఆర్మీ జనరల్స్ బుధవారం వెల్లడించారు. తమ లక్ష్యం పూర్తయిన వెంటనే దేశంలో సాధారణ స్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జింబాబ్వే రాజధాని హరారేలో సైన్యం ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ కల్పిస్తూ గస్తీ కాస్తోంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. జనజీవనం చాలావరకు సాధారణ స్థితిలోనే ఉంది. జింబాబ్వేలోని భారత సంతతి వారు, భారతీయులంతా క్షేమంగా ఉన్నారని హరారేలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అటు అమెరికా రాయబార కార్యాలయాన్ని బుధవారం మూసి ఉంచారు. అమెరికా పౌరులు సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని ఎంబసీ సూచించింది. మరోవైపు ముగాబేతో తాను మాట్లాడాననీ, ఆయన క్షేమంగానే ఉన్నారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా వెల్లడించారు. ముగాబేతో, జింబాబ్వేలోని సైన్యాధికారులతో భేటీ అయ్యేందుకు తమ దేశం నుంచి రక్షణ శాఖ మంత్రిని పంపుతున్నట్లు ఆయన చెప్పారు. 1980 నుంచీ ఆయనే... గతంలో రొడేసియా అనే పేరున్న జింబాబ్వే 1965లో బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకుంది. నల్లజాతివారి సాయుధపోరాటం తర్వాత శ్వేతజాతి పాలన ముగిసింది. విమోచనపోరాటం నడిపిన రాబర్ట్ ముగాబే నాయకత్వాన 1980 ఎన్నికల్లో జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్(జాను) విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముగాబే అధికారంలోనే ఉన్నారు. 93 ఏళ్ల ముగాబే ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రపంచదేశాల అధ్యక్షుల్లోకెల్లా వయసులో పెద్దవారు. అలాగే 1980 నుంచి ఇప్పటికీ ఒక దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి ప్రపంచంలో ఈయన ఒక్కరే. అయితే 2008, 2013 ఎన్నికల సమయంలో ముగాబే అక్రమాలు, హత్యలు, రిగ్గింగ్ చేసి గెలిచారు. ఇన్నేళ్ల పాలనలో సైన్యం ఆయనకు ఎదురుతిరగడం మాత్రం ఇదే తొలిసారి. మాజీ యుద్ధ సైనికుల సంఘం కూడా తాము ఆర్మీ పక్షానే ఉన్నామని స్పష్టం చేసింది. ముగాబేను, ఆయన పార్టీని అధికారం నుంచి దింపివేయాలని డిమాండ్ చేసింది. ప్రాణాలు తీయకుండానే అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సైన్యం చేపట్టిన చర్యలను ఈ సంఘం ప్రశంసించింది. భార్య వల్లనే...! జింబాబ్వే పాలనను సైన్యం చేతుల్లోకి తీసుకోవడంతో దాదాపు నాలుగు దశాబ్దాల ముగాబే నియంతృత్వ పాలనకు తెరపడే అవకాశం ఉంది. ముగాబే ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దేశ పాలనపై పట్టు కోల్పోతున్నారనేది కొందరి వాదన. 52 ఏళ్ల తన భార్య గ్రేస్‌ను అధ్యక్షురాలిని చేయాలని ముగాబే అనుకుంటున్నట్లు భావిస్తున్నారు. కానీ ఆమెకు జింబాబ్వే ప్రజల్లో సరైన ఆదరణ లేదు. మరోవైపు ఇటీవలే ఆ దేశ ఉపాధ్యక్షుడు ఎమర్సన్ నంగాగ్వాను ముగాబే పదవి నుంచి తప్పించారు. గ్రేస్ ప్రేరణతోనే, ఆమెను అధ్యక్షురాలిని చేయడానికే ఎమర్సన్‌ను పక్కనబెట్టారని కొంతమంది అనుమానిస్తున్నారు. ఎమర్సన్‌కు సైనికాధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ముగాబే పార్టీ వారికి, సైనికులకు అక్కడక్కడా గొడవలు కూడా జరుగుతున్నాయి. దేశంలో రాజకీయ పరిస్థితిని చక్కదిద్దేందుకు తాము పాలనను చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందని ఆర్మీ కమాండర్ కొన్స్టాన్టినో చివెంగా సోమవారం చెప్పగా, ముగాబే పార్టీ ఆయనపై దేశ ద్రోహం ఆరోపణలు చేసింది. కొన్ని రోజుల క్రితం దేశం విడిచి వెళ్లిపోయిన ఎమర్సన్ బుధవారమే జింబాబ్వేకు తిరిగొచ్చారు. బుధవారమే సైన్యం ముగాబేను గృహ నిర్బంధం చేసి, పాలనను చేతుల్లోకి తీసుకోవడంతో ఈ పరిణామాల్లో నంగాగ్వా హస్తం ఉందని పలువురు గట్టిగా అనుమానిస్తున్నారు. జింబా బ్వే అధికార మీడియాను కూడా సైన్యం తన అధీనంలోకి తీసుకుంది. అయితే నేరాలు చేస్తూ దేశంలో సామాజిక, ఆర్థిక వ్యవస్థలను చెడగొడుతున్న వారికి శిక్ష వేసేందుకు తాము పాలనను చేతుల్లోకి తీసుకున్నామని ఆర్మీ మేజర్ జనరల్ సిబుసిసో మొయొ చెప్పడం గమనార్హం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మిలటరీ గుప్పిట్లో జింబాబ్వే
హరారే : దేశాధ్యక్షుడు రాబర్ట్ ముగాబే చుట్టూ ఉన్న క్రిమినల్స్‌ను నాశనం చేసేందుకు పవర్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు జింబాబ్వే మిలటరీ ప్రకటించింది. అధ్యక్షుడి చుట్టూ ఉన్న కొందరు దేశానికి సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నారని పేర్కొంది. అయితే, ముగాబే(93), ఆయన కుటుంబం తమ రక్షణలోనే ఉన్నట్లు దేశ అధికారిక టీవీలో మేజర్ జనరల్ ఎస్బీ మోయో చెప్పారు. దేశంలోని కీలకప్రాంతాల్లో(పార్లమెంటు, కోర్టులు, ప్రభుత్వ ఆఫీసులు) జింబాబ్వే మిలటరీ పెద్ద ఎత్తున ఆయుధ వాహనాలను మోహరించినట్లు రాయిటర్స్ పేర్కొంది. క్రిమినల్స్‌ను మట్టుబెట్టిన అనంతరం దేశంలో ప్రశాంతతను పునః ప్రతిష్టిస్తామని మోయో పేర్కొన్నారు. బుధవారం ఉదయం జింబాబ్వే ఆర్థిక శాఖ మంత్రిని మిలటరీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ముగాబే పార్టీ జాను-పీఎఫ్ కేంద్ర కార్యాలయాన్ని మంగళవారం మిలటరీ సీజ్ చేసింది. జానూ-పీఎఫ్ మిత్రపక్షాల మధ్య ఉన్న సమస్యలపై తాను జోక్యం చేసుకోవాలని అనుకుంటున్నట్లు మిలటరీ చీఫ్ జనరల్ కన్స్టాంటినో చివాంగా చెప్పిన 24 గంటల్లోనే మిలటరీ దళాలు దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అనంతరం జింబాబ్వే అధికారిక టీవీ జింబాబ్వీ స్టేట్ బ్రాడ్‌కాస్టర్(జెడ్‌బీసీ)లోకి సైనికులు చొచ్చుకెళ్లారు. కొందరు జెడ్‌బీసీ ఉద్యోగులపై సైనికులు చేయి చేసుకున్నట్లు కూడా తెలిసింది. 1980లో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందిన నాటి నుంచి జింబాబ్వే అధ్యక్షుడిగా రాబర్ట్ ముగాబే గెలుపొందుతూ వస్తున్నారు. -
ఛస్.. ఆయన అంబాసిడర్ ఏంటి?
జెనీవా : ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంపై అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. జింబాబ్వే అధ్యక్షడు రాబర్ట్ ముగాబేను గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రకటించించినట్లు ఐక్యరాజ్య సమితి ఆరోగ్య విభాగం ప్రకటించింది. దీంతో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. ‘‘మానవ హక్కులను గౌరవించేవారిని ఈ స్థానంలో నియమించటం పరిపాటి. అలాంటిది ముగాబేను ఏ అర్హతతో ఎంపిక చేశారు’’ అంటూ అమెరికా ప్రశ్నలు గుప్పిస్తోంది. ఆయన పాలనలో జింబాబ్వే దారుణంగా నాశనం అయ్యింది. దీనికితోడు 93 ఏళ్ల ఆయన ఓ పెద్ద రోగిష్టి వ్యక్తి. తరచూ ఆరోగ్యం కోసం సింగపూర్ లాంటి దేశాలకు వెళ్తూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తున్నారు. ఆయనపై ప్రజల్లో సానుకూలత కూడా లేదు. ఆ లెక్కన్న ఆయన నియామకం ఆరోగ్య సంస్థ చేసిన ఓ తప్పిదం అని అమెరికా భద్రతా విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్క అమెరికానే కాదు.. ఐర్లాండ్ ఆరోగ్య శాఖ మంత్రి సైమన్ హర్రిస్ కూడా ముగాబే నియామకాన్ని తప్పుబడుతూ ఓ ట్వీట్ చేశారు. గత వారం ఉరుగ్వేలో జరిగిన సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముగాబేను గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమిస్తూ ఓ ప్రకటన చేసింది. అయితే డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రెయెసస్ ఆఫ్రికాకు చెందిన వ్యక్తి కావటంతోనే ఈ నియామకం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1980లో జింబాబ్వే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాబర్ట్ ముగాబే.. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తాడనే చెప్పుకుంటున్నారు. అయితే 37 ఏళ్ల పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా కుదేలు చేశాయి. అన్నిరంగాల్లో దేశం వెనకబడిపోయింది. అందుకే అమెరికాతో ఆయన సంబంధాలు ఏ మాత్రం బాగోలేవు. దీనికి తోడు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తటంతో మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఆయనపై ఆంక్షలు కూడా విధించింది. కాగా, ముగాబే నియామకం గురించి జింబాబ్వే మీడియా అధికారికంగా ప్రకటించకపోయినా.. జాతీయ మీడియా జింబాబ్వే హెరాల్డ్ పత్రిక మాత్రం ముగాబే సిగలో మరో ఘనత అంటూ వరుస కథనాలతో ఊదరగొడుతోంది. అయితే విమర్శలు పెల్లుబిక్కుతుండటంతో ఆయన నియామకంలో డబ్ల్యూహెచ్‌వో పునరాలోచన చేస్తోందన్న సమాచారం అందుతోంది. -
ఫస్ట్ లేడీ ‘లోదుస్తుల’ వివాదం.. జర్నలిస్టు అరెస్ట్
హరారే : దేశ ప్రథమ పౌరురాలిపై అసత్య కథనాలు రాసిన ఓ జర్నలిస్టు.. చివరికి జైలు ఊచలు లెక్కించే పరిస్థితిని కొనితెచ్చుకున్నాడు. జింబాబ్వేలో తీవ్ర వివాదాస్పదమైన ఆ కథనం వివరాల్లోకి వెళితే..అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పాలనలోని జింబాబ్వే.. తీవ్ర ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజల కనీస అవసరాలకు కూడా సరుకులు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ - పేట్రియాక్ ఫ్రంట్(జును-పీఎఫ్) పార్టీ.. దేశంలోని ఉన్నతవర్గాల నుంచి పాతదుస్తులను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఫస్ట్‌లేడీ గ్రేస్ ముగాబే (రాబర్ట్ సతీమణి) సైతం తన వంతు సాయంగా పాత దుస్తులను దానం చేశారు. అయితే, గ్రేస్ ఇచ్చిన దుస్తుల్లో ఆమె వాడిన లోదుస్తులు కూడా ఉన్నాయని, ఆ చర్య ద్వారా ఆమె పేదలను తీవ్రంగా అవమానించారని కెన్నెత్ న్యాంగాని అనే జర్నలిస్టు ఓ కథనం రాశారు. కానీ, కెన్నెత్ రాసినదాంట్లో ఏమాత్రం వాస్తవం లేదని, అధికార పార్టీపై దుష్ప్రచారం చేసేందుకే ఆ కథనాన్ని అల్లారని అధికారులు గుర్తించారు. ఈ మేరకు కెన్నెత్ పై కేసు నమోదుచేసి, అరెస్టు చేసినట్లు జింబాబ్వే మానవ హక్కుల సంఘం ప్రపంచ మీడియాకు వెల్లడించింది. త్వరలోనే ఈ కేసు కోర్టు విచారణకు వస్తుందని అధికారులు చెప్పారు. ఈ వివాదంపై అధికార జును-పీఎఫ్ పార్టీ కీలక నేత ఈసౌ ముఫుమి మాట్లాడుతూ.. గ్రేస్ ముగాబే ఇచ్చినవాటిలో గౌన్లు, నైట్ డ్రెస్సెస్, చెప్పులు మాత్రమే ఉన్నాయన్నారు. కాగా, జర్నలిస్టు కెన్నెత్ అరెస్టును అంతర్జాతీయ మానవహక్కుల వేదిక ఆమ్నెస్టీ ఖండించింది. జింబాబ్వే పాలకులు మీడియాను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కెన్నెత్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. దానితోపాటు మీడియా కూడా హద్దులు మీరుకుండా స్వీయ నియంత్రణతో పనిచేయాలని ఆమ్నేస్టీ సూచించింది. -
మోడల్‌పై దాడి చేసిన దేశాధ్యక్షుడి భార్య
జోహన్నెస్‌బర్గ్: ఓ దేశాధ్యక్షుడికి భార్య అంటే ఆ దేశానికి ప్రథమ పౌరురాలు. ఆమే గతి తప్పి ప్రవరిస్తే. బాధ్యతతో ఉండాల్సిన ఆమె తన స్ధాయిని మరచి ప్రవర్తిస్తే.. పౌరులు ఎలా ప్రవర్తించాలి. జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే భార్య గ్రేస్ ముగాబే చేసిన ఓ దుశ్చర్య ఆ దేశానికి కళంకం తెచ్చే విధంగా తయారైంది. అనారోగ్య కారణాలతో కొద్ది రోజుల క్రితం గ్రేస్ ముగాబే మెడికల్ పాస్‌పోర్టుపై దక్షిణాఫ్రికాకు వచ్చారు. ఇద్దరు తనయులతో పాటు జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ హోటల్లో ఉంటున్నారు. బుధవారం హోటల్‌కు గ్రేస్ ముగాబే తనయులతో మాట్లాడేందుకు ఓ మోడల్ వెళ్లారు. తనయుల గదిలో నుంచి మహిళ మాట్లాడుతున్న శబ్దం విని లోపలికి వెళ్లిన గ్రేస్.. అనుమానంతో ఆమెపై దాడికి దిగారు. తనయులు వారిస్తున్నా వినకుండా కొరడాతో మోడల్‌ను చితక్కొట్టారు. అక్కడి నుంచి బయటపడిన ఆమె జోహన్నెస్‌బర్గ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రేస్ ముగాబేను అరెస్టు చేసేందుకు హోటల్‌కు వెళ్లారు. అప్పటికే ఆమె తనయులతో కలసి తిరిగి జింబాబ్వేకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి జింబాబ్వే విదేశాంగ మంత్రితో చర్చిస్తున్నట్లు దక్షిణాఫ్రికా పోలీసులు తెలిపారు. దాడికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. గ్రేస్ ముగాబే గతంలో కూడా విచక్షణా రహితంగా ఓ వ్యక్తిపై దాడికి దిగిన సంఘటన ఉంది. ఓ హోటల్లోని వ్యక్తిపై గ్రేస్.. దాడికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయి తిరిగి జింబాబ్వే వచ్చేశారు. ప్రస్తుతం గ్రేస్ ముగాబే ఎక్కడ ఉన్నారన్న విషయంపై క్లారిటీ లేదు. -
‘చైనాపై ఆధారపడుతున్న అమెరికా’
డర్బన్: తమది పేద దేశం కాదని జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే అన్నారు. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా తర్వాత తమదే అభివృద్ధి చెందిన దేశమని పేర్కొన్నారు. ఆర్థికంగా చైనాపై ఆధారపడిన అమెరికా పేద దేశమని వ్యాఖ్యానించారు. తమది విఫలదేశం కాదనడానికి 90 శాతం అక్షరాస్యత నమోదు కావడమే నిదర్శనమన్నారు. సుదీర్ఘ కాలంగా జింబాబ్వేకు అధ్యక్షుడిగా ఉన్న ముగాబే పాలనలో ఇటీవల కాలంలో ఆర్థిక సంక్షోభం తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ‘మాది పేద దేశం కాదు. దుర్భర దేశం కాదు. అమెరికాను దుర్భర దేశంగా పిలుస్తాను. ఎందుకంటే చైనాపై అమెరికా ఎక్కువగా ఆధారపడుతోంది. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా తర్వాత మాదే అత్యంత అభివృద్ధి చెందిన దేశమ’ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్యానల్ డిస్కసన్లో ముగాబే అన్నారు. 2000 సంవత్సరం నుంచి జింబాబ్వే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. నిరుద్యోగం ఆకాశాన్నంటింది. -
ఆర్భాటంగా వేడుకలు.. జనం మండిపాటు
మటోబో: అదుపులో లేని ద్రవ్యోల్బణం, ఆగని ఆకలి చావుల మధ్య కూడా జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే 93వ జన్మదినం సందర్భంగా భారీ ఖర్చుతో విందు విలాసాలు ఏర్పాటుచేశారు. శనివారం బులావాయో పట్టణం ఆవల తన పార్టీ జాను–పీఎఫ్(జెడ్‌ఏఎన్‌యూ–పీఎఫ్) నిర్వహించిన వేడుకకు వేల సంఖ్యలో ఆయన మద్దతుదారులు హాజరయ్యారు. మంగళవారం పుట్టిన రోజు జరుపుకున్న ముగాబే గౌరవార్థం వారంపాటు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ మీడియాలో అయితే ఆయన మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశం తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్న సమయంలో ఇంత హంగూ ఆర్భాటాలతో వేడుకలు జరపడం ప్రజలను, ప్రతిపక్షాలను ఆగ్రహానికి గురిచేసింది. వచ్చిన అతిథుల కడుపు నింపడానికి స్థానిక ప్రజలు తమ పశువులు అమ్ముకోవడం పరిస్థితి తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. 1980 నుంచి నిరాటకంగా కొనసాగుతున్న ముగాబే పాలనాకాలంలో అసమ్మతి అణచివేత, ఓట్ల రిగ్గింగ్, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం లాంటి మచ్చలెన్నో ఉన్నాయి. ఎదురుతిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన దాఖలాలు కోకొల్లలు. ఉత్తరకొరియా శిక్షణలో రాటుదేలిన జింబాబ్వే బలగాల చేతుల్లో సుమారు 20 వేల మంది చనిపోయారని ఓ అంచనా. వయసు మీద పడుతున్నా గద్దె దిగేదిలేదని ఓ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముగాబే స్పష్టం చేశారు. ఆయన కళ్లు మూతలుపడుతుండగా, మాటకు మాటకు మధ్య విరామం వల్ల స్వరం తడబాటుతో ఆ ఇంటర్వ్యూ సాగింది. తన పార్టీ కోరితేనే పదవి నుంచి తప్పుకుంటానని ముగాబే చెప్పారు. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలకు పార్టీ ముగాబేనే తన అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. -
నిలబడే నిద్రపోయిన దేశ అధ్యక్షుడు!
వయసుకారణంగానో లేక చాలా దూరం ప్రయాణించడం మూలంగానో తెలియదు కానీ ఏకంగా దేశాధ్యక్షుడే ఓ ముఖ్యమైన సమావేశంలో నిలబడే కునుకు తీసినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. అది కూడా మీడియా ప్రతినిధుల ముందు. ఇంకేముంది సమావేశంలో నిద్రపోవడమేంటని విమర్శలు రావడంతో అవన్ని వట్టి ఆరోపణలేనని సదరు దేశం కొట్టిపారేసింది. జపాన్ ప్రధాని షింజో అబే ఆహ్వానం మేరకు జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే(92) జపాన్‌లో పర్యటించడానికి వచ్చారు. ఆఫ్రికా అభివృద్ది కోసం ప్రతి ఏడాది నిర్వహించే టోక్యో అంతర్జాతీయ సదస్సు(టీఐసీఏడీ) ఈ ఏడాది అగస్టులో కెన్యాలో జరుగనుంది. దీనిలో భాగంగా ఇరు దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల గురించి వివరించడానికి టోక్యోలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జపాన్, జింబాబ్వే దేశాల దౌత్య సంబంధాల బలోపేతం గురించి అబే మాట్లాడారు. ఆఫ్రికాకు ముగాబే ఒక దిగ్గజంగా అభివర్ణిస్తూ మాట్లాడుతుండగా..నిలబడే ఉన్న ముగాబే కునుకు తీసినట్టు స్పష్టంగా కనిపించింది. తనకు కుడి వైపు నిద్రమత్తులో అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఉన్న ముగాబేను ఒక్కసారి అలా చూసి చూడనట్టు అబే చూశారు. కొంత అసహనానికి గురి అయినట్టు కూడా కనిపించింది. నిలబడే ఓ దేశ అధ్యక్షుడు కునుకు తీశారా అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ ప్రారంభం అవ్వడంతో జింబాంబ్వే సమాచార మంత్రిత్వ శాఖ వివరణ కూడా ఇచ్చుకుంది. ఆ సమయంలో ముగాబే నిద్రపోవడంలేదని కేవలం అక్కడ జరగబోయే ఒప్పందాల గురించి ఆలోచిస్తున్నారని తెలిపింది. మీడియా సమావేశంలో ఎవరైనా నిద్రపోతారా ? ముగాబేను అగౌరవ పరిచేలా వస్తున్న ఆరోపణలన్ని అవాస్తవమని ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే ముగాబే ఇలాంటి సంఘటనలో మీడియా కంటికి చిక్కడం మొదటిసారేం కాదు. ఆఫ్రికా యూనియన్ శిఖరాగ్రసమావేశంలోనూ పలువురు ముఖ్యులు ప్రసంగిస్తున్న సమయంలో కూడా నిద్రపోయారు. -
జనానికి తిండి లేకున్నా.. బర్త్‌డే కోసం 5.5 కోట్లు!
హరారే: అది నిరుపేద ఆఫ్రికా దేశం. లక్షల మంది జనం తిండిలేక నిత్యం అల్లాడుతున్నారు. అయినా ఆ దేశాధినేత మాత్రం అక్షరాల రూ. 5.5 కోట్లు ఖర్చు పెట్టి ఘనంగా తన పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఇలా కోట్లు తగలేసి జన్మదిన వేడుకలు చేసుకున్న జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే కురువృద్ధ దేశాధినేతగా పేరొందిన ముగాబే ఇటీవల 92వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన భార్య గ్రేస్‌తో కలిసి వాయవ్య నగరం మాస్వింగోలో పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. గ్రేట్ జింబాబ్వే స్మారక స్తూపం వద్ద 91 బెలూన్లను ఎగురవేశారు. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఒకవైపు మాస్వింగోతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయి. ఇక్కడి ప్రజలు తిండిలేక అవస్థ పడుతున్నారు. వారికి విదేశాల నుంచి ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునేందుకు ఉద్దేశించిన నిధులను దారి మళ్లించి అధ్యక్షుడు అట్టహాసంగా రూ. 5.5 కోట్లతో జన్మదినం జరుపుకొన్నాడని, ప్రజలు ఆకలితో చస్తుంటే, ఆయన ప్రజాధనాన్ని దుబారా ఖర్చుచేసి జల్సాలు చేస్తున్నాడని జింబాబ్వే ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. -
జింబాబ్వేపై కరువు దరువు
హరారే: జింబాబ్వేలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం కారణంగా 16,500 పశువులు మృతిచెందాయి. అనేక గ్రామీణ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే విపత్తు పరిస్థితిని ప్రకటించారు. 26 శాతం జనాభాకు ఆహార పదార్థాలు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వేలపై ఎల్‌నినో తీవ్ర దుష్ర్పభావం చూపింది. ఒకనాడు దక్షిణాఫ్రికాకు ధాన్యాగారంగా పేరొందిన జింబాబ్వేలోనూ ఇదే దుస్థితి నెలకొంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా నీళ్లు లేక ఆనకట్టలకు పగుళ్లు ఏర్పడ్డాయి. పంటలు ఎండిపోయాయి. కాగా శాశ్వత కరువు పరిస్థితుల ఛాయల నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా దక్షిణాఫ్రికా పొరుగు దేశాలనుంచి ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం 15 లక్షల మందికి ఆహార పదార్థాలు దొరకడం లేదు. 60 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు కొనసాగుతున్నాయని ప్రజాపనుల శాఖ మంత్రి సేవియర్ కసుకువరే పేర్కొన్నారు. పర్యావరణంలో మార్పుల ప్రభావం కారణంగా వర్షాలు సరిగా కురవలేదని, అందువల్లనే కరువు పరిస్థితులు తలెత్తాయని రాబర్ట్ ముగాబే పేర్కొన్నారు. కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అభయమిచ్చారు. -
మేం 'గే'లు కాదు...
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వి ఆర్ నాట్ గేస్' అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పశ్చిమ దేశాల తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. కొత్త హక్కులు అంటూ ఆ దేశాలు తెరపైకి తీసుకొస్తున్న నూతన విధానాలు మా ప్రజల విలువ, సంస్కృతి, నమ్మకాలపై ప్రభావం చూపిస్తాయని ముగాబే పేర్కొన్నారు. ఆఫ్రికా ఖండంలో ఎల్జీబీటీ విధానాలు, హక్కులు అధికంగా ఉన్న దేశం జింబాబ్వే అన్న విషయం అందరికి విదితమే. తమ దేశస్థులను స్వలింగ సంపర్కం చేసే వారిగా ఇతర దేశాలు భావిస్తుండటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. స్వలింగ సంపర్కం చేసే వారు 'పందులు, మేకలు, ఇతర జంతువుల కన్నా హీనం' అంటూ 2013లోనూ ఆయన వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
జింబాబ్వే అధ్యక్షుడిగా మళ్లీ ముగాబే ప్రమాణం
హరారే: జింబాబ్వే అధ్యక్షుడిగా రాబర్ట్ ముగాబే(89) మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 1980 నుంచి జింబాబ్వేకు ముగాబేనే నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారమిక్కడ ఘనం గా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాది మంది ముగాబే అభిమానులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విపక్ష నేత మోర్గాన్ స్వాన్గిరాయ్కు చెందిన పార్టీ బహిష్కరించింది. -
కరెన్సీలేని దేశానికి ‘రాజాధిరాజు’!
అధికార వ్యామోహం తాగే కొద్దీ పెరిగే దుర్దాహం. జింబాబ్వే అధినేత రాబర్ట్ ముగా బే ఎనభై తొమ్మిదేళ్ల వయసులో ఏడోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ‘ఇది నా దేశం. ఇది నాదే, నిండు నూరేళ్లు నే నే దీన్ని పాలిస్తాను’ అని ఎన్నడో ఆన్న మాటను ఆయన నిలబెట్టుకునేట్టే ఉన్నారు. 1980లో జింబాబ్వే స్వతంత్ర దేశంగా అంతర్జాతీయ గుర్తింపును పొందింది. ఆప్పటి నుంచి ఆయనే ఆ దేశానికి అధినేత. సవరించిన రాజ్యాంగం ప్రకా రం ఆయన మరోదఫా అధ్యక్ష పదవికి అర్హు లు. అంటే 99వ ఏటగానీ ఆయన స్వచ్ఛం దంగా వానప్రస్థం స్వీకరించే అవకాశం లేదు. జూలై 31న పార్లమెంటు ఎన్నికలతోపాటూ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ముగాబే నేతృత్వం లోని జింబాబ్వే అఫ్రికన్ నేషనల్ యూని యన్ (జెడ్‌ఏఎన్‌యూ-పీఎఫ్) ఘనవిజ యం సాధించింది. పలు లోటుపాట్లున్నా మొత్తంగా ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగాయని ఆఫ్రికన్ యూనియన్ పరిశీలకుల బృందం ప్రకటించింది. ‘నల్లోడి’ మాటలను నమ్మలేని పాశ్చాత్య మీడియా ఈ ఎన్నికలను బూటకంగా కొట్టిపారేస్తోంది. నేటి ప్రభుత్వంలో ప్రధాని, ఎమ్డీసీ-టీ (మూవ్మెంట్ ఫర్ డెమోక్రటిక్ ఛేంజ్) నేత మోర్గాన్ ట్సవంగిరాయ్ ముగాబేకు ప్రధాన ప్రత్యర్థి, ఆయన కూడా ముగాబే ఎన్నిక అక్రమమని సవాలు చేస్తున్నారు. ముగాబే పాశ్చాత్య దేశాల దృష్టిలో ఆఫ్రికా ఖండపు ‘బ్యాడ్ బాయ్’. కానీ ఆయన ఒకప్పుడు యావత్ ప్రపంచం మన్నించిన ఆఫ్రికన్ నేత. జింబాబ్వే జాతీయ విముక్తి నేత, ప్రజాస్వా మ్య ప్రదాత. ఆహారం, విద్య, వైద్యం తదితర సమస్యల పరిష్కారానికి ఆయన తొలి దశాబ్దంలో మంచి కృషి చేశారు. 99 శాతం అక్షరాస్యతతో ఆఫ్రికాలో అగ్రస్థానం జింబాబ్వేదే. దక్షిణాఫ్రికా ధాన్యాగారంగా విలసిల్లిన ఆ దేశం ఇప్పుడు ఆకలిచావుల పొలిమేరల్లో ఉంది. వాతావరణ మార్పుల వల్ల పెరిగే ఉష్ణోగ్రతలతో ఉపరితల జలవనరులలోని నీరు భారీగా ఆవిరైపోతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో సైతం నీటి ఎద్దడి పెరుగుతోంది. అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, అవినీతి, ఆశ్రీత పక్షపాతాలకు మారుపేరుగా మారిన ముగా బే పాలన సమస్యను మరింత విషమింపజేస్తోంది. 1980కి ముందు జింబాబ్వే రొడీషియా పేర బ్రిటన్‌కు వలసగా ఉండేది. శ్వేత జాత్యహంకార ప్రధాని అయాన్ స్మిత్ మైనారిటీ పాలనకు వ్యతిరేకంగా 1960ల నుంచి గెరిల్లా విముక్తి పోరాటాన్ని నడిపిన జాతీయ హీరో ముగాబే. నెల్సన్ మండేలా సరసన నిలవాల్సిన నేత. కానీ... చరిత్ర ఆయనపై చెప్పే తీర్పు అందుకు భిన్నంగా ఉండనుంది. కార ణం ఆయన్ను అధికార దాహం, ఆశ్రీత పక్షపాతాలనే రాహుకేతువులు కాటేయడమే. స్వా తంత్య్రానంతరం ఆఫ్రికాలో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారిన జింబాబ్వే 1990లలో క్షీణ దశలోకి ప్రవేశించింది. జింబాబ్వే చెప్పుకోదగ్గ జలవనరులున్న వ్యవసాయక దేశం. పైగా ప్లాటినమ్, బొగ్గు, ముడి ఇనుము, బంగారం, వజ్రాలు తదితర ఖనిజ నిక్షేపాలు కూడా ఉన్నాయి. అయినా 85 శాతం పేదరికం, 90 శాతం నిరుద్యోగంతో జింబాబ్వే నిరుపేదదేశంగా అల్లాడుతోంది. భూసంస్కరణలు, గనులపై స్థానిక యాజమాన్యం వంటి చర్యల తదుపరి కూడా దేశ సంపదలో సగానికిపైగా 10 శాతం మంది చేతుల్లోనే ఉంది. ముగాబే ఆశ్రీత పక్షపాత, అవినీతిమయ పాలన ఫలితాలివి. 2013 జనవరిలో జింబా బ్వే మొత్తం ఖనిజాల ఎగుమతులు 180 కోట్ల డాలర్లు. కాగా, ఒక్క తూర్పు వజ్రాల గనుల నుంచే 200 కోట్ల డాలర్ల విలువైన వజ్రాలను కొల్లగొట్టారంటేనే సమస్య తీవ్రత అర్థమవుతుంది. ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో విపరీతంగా కరెన్సీని ముద్రించిన ఫలితం గా... 2008లో క్షణ క్షణమూ ధరలు రెట్టిం పయ్యే ‘హైపర్ ఇన్ఫ్లేషన్’ (అవధులు లేని ద్రవ్యోల్బణం) ఏర్పడింది. ద్రవ్యోల్బణం 23.1 కోట్ల శాతానికి చేరింది! ఈపరిస్థితుల్లో 2009లో ఏర్పడ్డ జాతీయ ప్రభుత్వం జింబా బ్వే కరెన్సీని రద్దుచేసింది. అమెరికన్ డాల ర్తో పాటూ ఇరుగుపొరుగు దేశాల కరెన్సీయే నేటికీ అక్కడ వాడుకలో ఉంది. సాహసోపేతమైన గొప్ప విప్లవ కర సం స్కరణలను సైతం తీవ్ర దుష్ఫలితాలకు దారి తీసే విధంగా అమలుచేయడానికి ముగాబే పాలన అత్యుత్తమ ఉదాహరణ. మార్క్సిస్టు, సోషలిస్టు భావాలతో ప్రేరేపితుడైన ముగాబే జనాభాలో ఒక్క శాతం శ్వేత జాతీయుల చేతుల్లోనే సగానికి పైగా భూములున్న పరిస్థితిని తలకిందులు చేయాలని ఎంచారు. బ్రిటన్ ‘ఇష్టపడ్డ అమ్మకందార్లు, ఇష్టపడ్డ కొనుగోలుదార్లు’ అనే పథకం కింద భూములను కొని, పేద రైతులకు ఇచ్చే కార్యక్రమం ప్రారంభింపజేసింది. వలస పాలనా యంత్రాంగం ఆ కార్యక్రమాన్ని ఎందుకూ పనికిరాని, నాసి రకం భూములకు భారీ ధరలను చెల్లించే కుంభకోణంగా మార్చింది. ముగాబే సహచరులు కూడా కుమ్మక్కయ్యారు. మరోవంక నిధులను సమకూర్చాల్సిన బ్రిటన్ తాత్సారం చేసి ఆ భూసంస్కరణలకు తూట్లు పొడిచిం ది. దీంతో 2000లో 1,500 మంది శ్వేత జాతీ యుల భారీ వ్యవసాయ క్షేత్రాలను స్వాధీనం చేసుకొని రైతులకు, మూలవాసులకు పం చారు. సేకరించిన భూములన్నీ సైన్యాధికారులు, ప్రభుత్వ నేతల వశమయ్యాయనే మీడియా ప్రచారం అతిశయోక్తే. లక్షకు పైగా కుటుంబాల రైతులు, మూలవాసులకు ఆ భూములలో పునరావాసం కలిగింది. అయితే భూ పంపిణీతో పాటే జరగాల్సిన వ్యవసాయ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో శ్వేత జాతీయుల మార్కెట్ ఆధారిత ఆధునిక పంటల పద్ధతి అమల్లో ఉన్న భూముల్లో జీవనాధార వ్యవసాయం ప్రవేశించింది. దీంతో వ్యసాయ ఉత్పత్తి, ఎగుమతులు క్షీణించాయి. అలాగే 2009లో గనులపై యాజమాన్యం స్థానికులకే చెందేలా తీసుకున్న చర్య అక్రమ గనుల తవ్వకానికి, నీటి వనరులు కలుషితం కావడానికి దారితీసింది. 2012 నాటికి ముగాబే ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించారు. జాతీయ విముక్తి నేతగా ముగాబే ప్రతిష్టకు తోడు అది కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది. ముగాబే ముందున్న తక్షణ సమస్య అత్యంత తీవ్రమైనది. ప్రధాన ఆహారమైన మొక్కజొన్న ప్రభు త్వ గోదాముల్లో పుచ్చిపోతుండగా జాంబి యా వంటి పొరుగు దేశాల నుంచి భారీ ఎత్తున దిగుమతి చేసుకోవడం ‘లాభసాటి’ గా మారింది. మంచి మొక్కజొన్నలను పుచ్చినవిగా దాణాకు తక్కువ ధ రకు అమ్మి, వాటినే సేకరణ పేరిట తిరిగి అధిక ధరలకు కొనడం పౌర, సైనికాధికారులకు అలవాటుగా మారిం ది. అలాగే తడిచిన, నిల్వకు పనికిరాని మొక్కజొన్నలను మంచి ధరకు కొని, పుచ్చిపోయాక పశువుల దాణాగా అమ్మేయడం నిరాటంకంగా సాగిపోతోంది. 2013 నాటికి దేశంలో కోటి మంది ఆకలితో అలమటిస్తున్నారని ప్రపంచ ఆహార సంస్థ అంచనా. దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా, తాను కన్న కలలు కరిగిపోతుండటం చూసి పరితపిస్తుండగా, ముగాబే తన కల లను తానే కాల్చేసుకుంటూ అధికారం వేడిలో చలి కాగుతుండటం చారిత్రక వైచిత్రి.