హరారే : దేశ ప్రథమ పౌరురాలిపై అసత్య కథనాలు రాసిన ఓ జర్నలిస్టు.. చివరికి జైలు ఊచలు లెక్కించే పరిస్థితిని కొనితెచ్చుకున్నాడు. జింబాబ్వేలో తీవ్ర వివాదాస్పదమైన ఆ కథనం వివరాల్లోకి వెళితే..అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పాలనలోని జింబాబ్వే.. తీవ్ర ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజల కనీస అవసరాలకు కూడా సరుకులు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ - పేట్రియాక్ ఫ్రంట్(జును-పీఎఫ్) పార్టీ.. దేశంలోని ఉన్నతవర్గాల నుంచి పాతదుస్తులను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఫస్ట్‌లేడీ గ్రేస్ ముగాబే (రాబర్ట్ సతీమణి) సైతం తన వంతు సాయంగా పాత దుస్తులను దానం చేశారు.
అయితే, గ్రేస్ ఇచ్చిన దుస్తుల్లో ఆమె వాడిన లోదుస్తులు కూడా ఉన్నాయని, ఆ చర్య ద్వారా ఆమె పేదలను తీవ్రంగా అవమానించారని కెన్నెత్ న్యాంగాని అనే జర్నలిస్టు ఓ కథనం రాశారు. కానీ, కెన్నెత్ రాసినదాంట్లో ఏమాత్రం వాస్తవం లేదని, అధికార పార్టీపై దుష్ప్రచారం చేసేందుకే ఆ కథనాన్ని అల్లారని అధికారులు గుర్తించారు. ఈ మేరకు కెన్నెత్ పై కేసు నమోదుచేసి, అరెస్టు చేసినట్లు జింబాబ్వే మానవ హక్కుల సంఘం ప్రపంచ మీడియాకు వెల్లడించింది. త్వరలోనే ఈ కేసు కోర్టు విచారణకు వస్తుందని అధికారులు చెప్పారు.
ఈ వివాదంపై అధికార జును-పీఎఫ్ పార్టీ కీలక నేత ఈసౌ ముఫుమి మాట్లాడుతూ.. గ్రేస్ ముగాబే ఇచ్చినవాటిలో గౌన్లు, నైట్ డ్రెస్సెస్, చెప్పులు మాత్రమే ఉన్నాయన్నారు. కాగా, జర్నలిస్టు కెన్నెత్ అరెస్టును అంతర్జాతీయ మానవహక్కుల వేదిక ఆమ్నెస్టీ ఖండించింది. జింబాబ్వే పాలకులు మీడియాను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కెన్నెత్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. దానితోపాటు మీడియా కూడా హద్దులు మీరుకుండా స్వీయ నియంత్రణతో పనిచేయాలని ఆమ్నేస్టీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment