అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆర్థికమాంద్యం భయం చాలా కాలంగా వెంటాడుతోంది. చైనా సైతం ఇటీవల ఆర్థిక రంగంలో అనేక ఒడిదుడుకులను చవిచూసింది. అయితే ఇప్పటి వరకు భారత్‌లో మాద్యం తాలూకా లక్షణాలేమీ కనిపించలేదు. అయితే తాజాగా వెలువడిన ఓ సంకేతం ఆర్థిక నిపుణులను అప్రమత్తం చేసింది.
బడ్జెట్‌కు ఆటంకం ఏర్పడినప్పుడు..
దేశంలో ఇటీవలి కాలంలో లోదుస్తుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం లోదుస్తుల తయారీ కంపెనీలలో ఇన్వెంటరీ పెరిగింది. అమ్మకాలు తగ్గాయి. ఆర్థికవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ద్రవ్యోల్బణం కారణంగా జనం తమ బడ్జెట్‌కు ఆటంకం ఏర్పడినప్పుడు వారు మొదట లోదుస్తుల కొనుగోలును వాయిదా వేస్తారు. దేశంలోని పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇటీవలి కాలంలో లోదుస్తుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.
మందగమనంలో జాకీ బ్రాండ్ విక్రయాలు
గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లోదుస్తుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. లోదుస్తుల అమ్మకాలు క్షీణించిన కారణంగా పలు కంపెనీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. జాకీ బ్రాండ్ లోదుస్తుల తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్‌కి ఆదాయం తగ్గడంతో పాటు అమ్మకాలు కూడా తగ్గాయి.గత కొన్ని నెలలుగా దేశంలో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ పరిమితులను మించిపోతోంది. ద్రవ్యోల్బణం సామాన్యుల బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తోంది. ఫలితంగా వినియోగదారుల సెంటిమెంట్ ప్రభావితమవుతుంది.
ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం లోదుస్తుల అమ్మకాలు క్షీణించడం ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతం కాదు. జనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారనడానికి ఇది సంకేతం. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మాజీ అధిపతి అలాన్ గ్రీన్‌స్పాన్.. ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి పురుషుల లోదుస్తుల సూచికను రూపొందించారు. దీని ప్రకారం ఒక దేశంలో పురుషుల లోదుస్తుల అమ్మకాలు క్షీణించడం అనేది ఆర్థిక వ్యవస్థలో మాంద్యానికి సంకేతం. 2007- 2009 మధ్య కాలంలో యూఎస్‌లో ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు లోదుస్తుల విక్రయాలు క్షీణించాయి.
2007- 2009 మధ్య అమెరికాలో ఏం జరిగింది?
ఆర్థిక నిపుణులు గ్రీన్‌స్పాన్ 1970లలో పురుషుల లోదుస్తుల సూచిక సిద్ధాంతాన్ని వెలువరించారు. పురుషుల లోదుస్తుల విక్రయ గణాంకాలు కీలక ఆర్థిక సూచికలు అని ఆయన అన్నారు. లోదుస్తులు అనేవి ప్రైవేట్ దుస్తులు. అవి పైనున్న దుస్తులలో దాగివుంటాయి. అందుకే ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారినప్పుడు, మనిషి చేసే మొదటి పని లోదుస్తులు కొనుగోలు చేయడం మానివేస్తాడు. ఇది రాబోయే కాలంలో మాంద్యం లేదా ఆర్థిక మందగమనాన్ని సూచిస్తుంది. 2007- 2009 మధ్య అమెరికా తీవ్ర మాంద్యం ఎదుర్కొంది. 2007 ప్రారంభం నుండి ఆ దేశంలో పురుషుల లోదుస్తుల విక్రయాలలో భారీ క్షీణత కనిపించింది. 2010 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు, పురుషుల లోదుస్తుల అమ్మకాలు ఆటోమేటిక్‌గా పెరిగాయి.
ఇది కూడా చదవండి: ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment