Grace Mugabe
-
ఫస్ట్ లేడీ ‘లోదుస్తుల’ వివాదం.. జర్నలిస్టు అరెస్ట్
హరారే : దేశ ప్రథమ పౌరురాలిపై అసత్య కథనాలు రాసిన ఓ జర్నలిస్టు.. చివరికి జైలు ఊచలు లెక్కించే పరిస్థితిని కొనితెచ్చుకున్నాడు. జింబాబ్వేలో తీవ్ర వివాదాస్పదమైన ఆ కథనం వివరాల్లోకి వెళితే..అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పాలనలోని జింబాబ్వే.. తీవ్ర ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజల కనీస అవసరాలకు కూడా సరుకులు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ - పేట్రియాక్ ఫ్రంట్(జును-పీఎఫ్) పార్టీ.. దేశంలోని ఉన్నతవర్గాల నుంచి పాతదుస్తులను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఫస్ట్‌లేడీ గ్రేస్ ముగాబే (రాబర్ట్ సతీమణి) సైతం తన వంతు సాయంగా పాత దుస్తులను దానం చేశారు. అయితే, గ్రేస్ ఇచ్చిన దుస్తుల్లో ఆమె వాడిన లోదుస్తులు కూడా ఉన్నాయని, ఆ చర్య ద్వారా ఆమె పేదలను తీవ్రంగా అవమానించారని కెన్నెత్ న్యాంగాని అనే జర్నలిస్టు ఓ కథనం రాశారు. కానీ, కెన్నెత్ రాసినదాంట్లో ఏమాత్రం వాస్తవం లేదని, అధికార పార్టీపై దుష్ప్రచారం చేసేందుకే ఆ కథనాన్ని అల్లారని అధికారులు గుర్తించారు. ఈ మేరకు కెన్నెత్ పై కేసు నమోదుచేసి, అరెస్టు చేసినట్లు జింబాబ్వే మానవ హక్కుల సంఘం ప్రపంచ మీడియాకు వెల్లడించింది. త్వరలోనే ఈ కేసు కోర్టు విచారణకు వస్తుందని అధికారులు చెప్పారు. ఈ వివాదంపై అధికార జును-పీఎఫ్ పార్టీ కీలక నేత ఈసౌ ముఫుమి మాట్లాడుతూ.. గ్రేస్ ముగాబే ఇచ్చినవాటిలో గౌన్లు, నైట్ డ్రెస్సెస్, చెప్పులు మాత్రమే ఉన్నాయన్నారు. కాగా, జర్నలిస్టు కెన్నెత్ అరెస్టును అంతర్జాతీయ మానవహక్కుల వేదిక ఆమ్నెస్టీ ఖండించింది. జింబాబ్వే పాలకులు మీడియాను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కెన్నెత్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. దానితోపాటు మీడియా కూడా హద్దులు మీరుకుండా స్వీయ నియంత్రణతో పనిచేయాలని ఆమ్నేస్టీ సూచించింది. -
మోడల్‌పై దాడి చేసిన దేశాధ్యక్షుడి భార్య
జోహన్నెస్‌బర్గ్: ఓ దేశాధ్యక్షుడికి భార్య అంటే ఆ దేశానికి ప్రథమ పౌరురాలు. ఆమే గతి తప్పి ప్రవరిస్తే. బాధ్యతతో ఉండాల్సిన ఆమె తన స్ధాయిని మరచి ప్రవర్తిస్తే.. పౌరులు ఎలా ప్రవర్తించాలి. జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే భార్య గ్రేస్ ముగాబే చేసిన ఓ దుశ్చర్య ఆ దేశానికి కళంకం తెచ్చే విధంగా తయారైంది. అనారోగ్య కారణాలతో కొద్ది రోజుల క్రితం గ్రేస్ ముగాబే మెడికల్ పాస్‌పోర్టుపై దక్షిణాఫ్రికాకు వచ్చారు. ఇద్దరు తనయులతో పాటు జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ హోటల్లో ఉంటున్నారు. బుధవారం హోటల్‌కు గ్రేస్ ముగాబే తనయులతో మాట్లాడేందుకు ఓ మోడల్ వెళ్లారు. తనయుల గదిలో నుంచి మహిళ మాట్లాడుతున్న శబ్దం విని లోపలికి వెళ్లిన గ్రేస్.. అనుమానంతో ఆమెపై దాడికి దిగారు. తనయులు వారిస్తున్నా వినకుండా కొరడాతో మోడల్‌ను చితక్కొట్టారు. అక్కడి నుంచి బయటపడిన ఆమె జోహన్నెస్‌బర్గ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రేస్ ముగాబేను అరెస్టు చేసేందుకు హోటల్‌కు వెళ్లారు. అప్పటికే ఆమె తనయులతో కలసి తిరిగి జింబాబ్వేకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి జింబాబ్వే విదేశాంగ మంత్రితో చర్చిస్తున్నట్లు దక్షిణాఫ్రికా పోలీసులు తెలిపారు. దాడికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. గ్రేస్ ముగాబే గతంలో కూడా విచక్షణా రహితంగా ఓ వ్యక్తిపై దాడికి దిగిన సంఘటన ఉంది. ఓ హోటల్లోని వ్యక్తిపై గ్రేస్.. దాడికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయి తిరిగి జింబాబ్వే వచ్చేశారు. ప్రస్తుతం గ్రేస్ ముగాబే ఎక్కడ ఉన్నారన్న విషయంపై క్లారిటీ లేదు.