‘చైనాపై ఆధారపడుతున్న అమెరికా’
డర్బన్: తమది పేద దేశం కాదని జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే అన్నారు. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా తర్వాత తమదే అభివృద్ధి చెందిన దేశమని పేర్కొన్నారు. ఆర్థికంగా చైనాపై ఆధారపడిన అమెరికా పేద దేశమని వ్యాఖ్యానించారు. తమది విఫలదేశం కాదనడానికి 90 శాతం అక్షరాస్యత నమోదు కావడమే నిదర్శనమన్నారు. సుదీర్ఘ కాలంగా జింబాబ్వేకు అధ్యక్షుడిగా ఉన్న ముగాబే పాలనలో ఇటీవల కాలంలో ఆర్థిక సంక్షోభం తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.
‘మాది పేద దేశం కాదు. దుర్భర దేశం కాదు. అమెరికాను దుర్భర దేశంగా పిలుస్తాను. ఎందుకంటే చైనాపై అమెరికా ఎక్కువగా ఆధారపడుతోంది. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా తర్వాత మాదే అత్యంత అభివృద్ధి చెందిన దేశమ’ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్యానల్ డిస్కసన్‌లో ముగాబే అన్నారు. 2000 సంవత్సరం నుంచి జింబాబ్వే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. నిరుద్యోగం ఆకాశాన్నంటింది.